అధికారపార్టీ ఆగడాలు!
సాక్షి, కర్నూలు: తెలుగుదేశం పార్టీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. మాట వినని వారిపై కేసులు పెట్టి భయాందోళనకు గురిచేస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఘోర పరాభావం ఎదురైంది. 14 స్థానాలకు గానూ కేవలం మూడింట మాత్రమే ఆ పార్టీ నేతలు విజయం సాధించారు. ముఖ్యంగా డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కుటుంబానికి కంచుకోటగా ఉన్న డోన్ నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ విజయబావుటా ఎగురవేసింది. ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేకపోతున్న డోన్ నియోజకవర్గ టీడీపీ నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో క్రీయాశీలకంగా వ్యవహరిస్తున్న నాయకులు, కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు. జిల్లాలో తెలుగుదేశం ఎమ్మెల్యేలు ముగ్గురే ఉన్నప్పటికీ ఆ పార్టీ అధినేత చంద్రబాబు నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జీలకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం.. అధికారులతోనూ నియోజకవర్గ ఇన్‌చార్జీలు చెప్పినట్లు నడుచుకోవాలని ఆదేశించడంతో వారి ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది.
డోన్ నియోజకవర్గంలో ఇది మరింత మితిమీరిందనే చెప్పొచ్చు. ఆరు నెలల కిందట.. కౌనిల్సర్‌పై అసభ్యంగా ప్రవర్తించారని టీడీపీ నేతల ఒత్తిడి మేరకు జెడ్పీటీసీ సభ్యుడు శ్రీరాములు, వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ పద్మజ భర్త హరికిషన్‌పై, అలాగే పార్టీ కార్యకర్తలు రాజవర్ధన్, ప్రసాద్‌లపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో కౌన్సిలర్ లక్ష్మిదేవి కుమారులు దినేష్‌గౌడ్, నాగార్జునగౌడ్ తదితరులపైనా ఇలాంటి కేసే నమోదు చేశారు.
ఊరేగింపు సందర్భంగా జరిగిన చిన్న వివాదాన్ని పెద్దదిగా చేసి లక్ష్మికాంత్, రామాంజనేయులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. ప్యాపిలి గ్రామంలో గత ఏడాది సోమశేఖర్ అనే కార్యకర్తపైనా.. ఆదే మండలానికి చెందిన ఎస్.రంగాపురం గ్రామానికి చెందిన నాగరాజుపైనే ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. వైఎస్సార్‌సీపీకి మద్దతు ఇస్తున్న వారిపైనా ఇలాంటి చర్యలకే పాల్పడుతుండటంతో టీడీపీ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది