గత ఉత్తర్వులను సవరిస్తూ సర్కార్ నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందినవారు అత్యాచారాలు, దాడులకు గురైనపుడు సహాయం, పునరావాసం కింద అందించే పరిహారాన్ని పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గతంలోని ఉత్తర్వులను సవరిస్తూ ఆదేశాలు జారీచేసింది. తాజా నిర్ణయం ప్రకారం ఎస్సీ, ఎస్టీలపై దాడులు జరిగిన సందర్భాల్లో బాధితులు వందశాతం వైకల్యానికి గురైతే రూ. 8.25 లక్షల పరిహారం, 50 శాతం వైకల్యముంటే రూ.4.5 లక్షలు, 50 శాతం కంటె తక్కువ వైకల్యానికి గురైతే రూ. 2.5 లక్షల పరిహారాన్ని అందజేయనున్నారు.
దాడిలో హత్యకు గురైనా.. లేదా మరణానికి దారితీస్తే రూ.8.25 లక్షలు, గ్యాంగ్ రేప్‌నకు గురైన వారికి రూ.8.25 లక్షలు, అత్యాచారానికి గురైన వారికి రూ.5 లక్షలు పరిహారమివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాక హత్య, మరణం, రేప్, గ్యాంగ్‌రేప్, శాశ్వత వైకల్యం, దోపిడీకి గురైన కేసుల్లో ఎస్సీ, ఎస్టీ బాధితుల భార్య లేదా వారిపై ఆధారపడి జీవిస్తున్న వారికి నెలకు రూ.5 వేల చొప్పున అందజేస్తారు. ఈ కేసుల్లో చనిపోయిన వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం, వ్యవసాయ భూమి, ఇళ్లు వంటివి అందజేస్తారు. వారి పిల్లలను డిగ్రీ వరకు చదివిస్తారు. దాడుల్లో ఇళ్లు పూర్తిగా ధ్వంసం కావడం లేదా తగులబడితే అదేస్థలంలో ప్రభుత్వ ఖర్చులతో ఇంటిని నిర్మించి ఇస్తారు.
వివక్ష బాధితులకు రూ.2 లక్షల పరిహారం..
ఎస్సీ, ఎస్టీలకు వ్యతిరేకంగా తప్పుడు సాక్ష్యాలను సృష్టించడం, ఇవ్వడం వంటి కేసుల్లో బాధితులకు రూ.4.15 లక్షల పరిహారాన్ని ఇవ్వాలని నిర్ణయించింది. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగుల చేతుల్లో వివక్ష లేదా బాధితులుగా మారిన వారికి లేదా వారిపై ఆధారపడిన వారికి రూ.2 లక్షలు పరిహారం, ఆలయాల్లోకి, ప్రార్థనాస్థలంలోకి ప్రవేశించకుండా, సామాజిక, సాంస్కృతికంగా ఊరేగింపులు నిర్వహించకుండా అడ్డుకుంటే.. బాధితులకు రూ. లక్ష పరిహారంతో పాటు ఆయా హక్కులను కల్పించాలని నిర్దేశించింది.
ఎస్సీ, ఎస్టీలను ఎన్నికల్లో ఓటు వేయకుండా, నామినేషన్ దాఖలు చేయకుండా నిరోధించడం, ఎన్నికల్లో హింస.. ఇతరత్రా దౌర్జన్యకర సంఘటనల్లో బాధితులకు రూ.85 వేల పరిహారాన్ని అందించనున్నారు. ఈ మేరకు ఎస్సీ అభివృద్ధిశాఖ కార్యదర్శి బి. మహేశ్ దత్ ఎక్కా ఉత్తర్వులను జారీచేశారు.
అట్రాసిటీ కేసుల్లో పరిహారం పెంపు
Published Fri, Aug 5 2016 3:42 AM | Last Updated on Sat, Sep 15 2018 3:59 PM
Advertisement
Advertisement