Compensation Hike
-
కడలి కెరటమంత కేరింత
సాక్షి, పాత పోస్టాఫీసు(విశాఖ దక్షిణ): గంగపుత్రులపై సీఎం జగన్ సర్కారు వరాల జల్లు కురిపించింది. మత్స్యకారుల్లో సాగరమంత సంతోషాన్ని నింపింది. ఇంతటి సాహసోపేతమైన నిర్ణయం ఇప్పటి వరకూ ఏ ప్రభుత్వం తీసుకోలేదని మత్స్యకార సంఘాలు అంటున్నాయి. వేట నిషేధ సమయంలో మత్స్యకార కుటుంబాలకు ఇచ్చే పరిహారాన్ని రూ.10వేలకు పెంచడంతో హర్షం వ్యక్తం చేస్తున్నాయి. మెకనైజ్డ్, మోటరైజ్డ్, నాన్‌మోటరైజ్డ్ బోట్లు ఉన్న కుటుంబాలతో పాటు తెప్పలపై వేటకు వెళ్లేవారికి కూడా ‘వైఎస్సార్ మత్స్యకారుల వేట నిషేధ సహకారం’ పథకాన్ని తొలిసారిగా వర్తింపజేస్తున్నందుకు మత్స్యకారులు ఆనందోత్సాహాల్లో మునిగితేలుతున్నారు. ముఖ్యమంత్రికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నారు. డీజిల్ సబ్సిడీని రూ.6.03 నుంచి రూ.9కి పెంచడంపై బోట్ల యజమానులు సంబరాలు చేసుకుంటున్నారు. గతం: 2002 మార్చికి ముందు రిజిస్టర్ అయిన బోట్లకు మాత్రమే డీజిల్ సబ్సిడీ ఇవ్వడం వల్ల కేవలం 350 బోట్లకు మాత్రమే సబ్సిడీ దక్కేది. ప్రస్తుతం: సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం వల్ల 3550 బోట్లకు సబ్సిడీ దక్కనుంది. సర్కారు తీసుకున్న నిర్ణయంతో ప్రతి ఏటా డీజిల్ సబ్సిడీ కింద 25 కోట్ల రూపాయల్ని మత్స్యకారులు రాయితీ రూపంలో పొందనున్నారు -
శాసన విధుల్లో జోక్యం చేసుకోలేం: సుప్రీం
న్యూఢిల్లీ: శాసన సంబంధ విధుల్లో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రోడ్డు ప్రమాద బాధితులకు పరిహారం పెంపునకు సంబంధించిన బిల్లు రాజ్యసభలో పెండింగ్‌లో ఉన్నందున ఈ విషయంలో జోక్యం చేసుకోవాలంటూ కోయంబత్తూర్‌కు చెందిన డాక్టర్ ఎస్.రాజశేఖరన్ దాఖలు చేసిన పిటిషన్ సోమవారం అత్యున్నత న్యాయస్థానంలో విచారణకు వచ్చింది. మోటారు వాహనాల(సవరణ) బిల్లు–2017 బిల్లును ఇప్పటికే లోక్‌సభ ఆమోదించగా రాజ్యసభలో పెండింగ్‌లో ఉంది. దీనిని వచ్చే శీతాకాల సమావేశాల్లో సభ ఆమోదించే అవకాశం ఉంది. ‘చట్టసభల విధుల్లో మేం జోక్యం చేసుకోలేము. రాజ్యసభలో ఆ బిల్లు పెండింగ్‌లో ఉందంటే దానర్థం మేం జోక్యం చేసుకోవాలని కాదు. ఆ పని మేం చేయలేం’ అని స్పష్టం చేసింది. ‘పరిహారం చెల్లింపులో ప్రభుత్వానికి స్వేచ్ఛ ఉంది. ఎవరైనా రూ.2 లక్షల పరిహారం ఇస్తామంటే మేమేందుకు వద్దంటాం? అని ప్రశ్నించింది. -
జుకర్‌బర్గ్‌కు భారీగా పెరిగిన పరిహారాలు
డేటా చోరి ఉదంతంపై ప్రపంచవ్యాప్తంగా ఫేస్బుక్ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న సమయంలో ఆ కంపెనీ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ మార్క్ జుకర్‌బర్గ్ పరిహారాలు భారీగా పెరిగినట్టు తెలిసింది. గతేడాది జుకర్‌బర్గ్ పరిహారాలు 53.5 శాతం పెరిగి 8.9 మిలియన్ డాలర్లుగా నమోదైనట్టు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో కంపెనీ శుక్రవారం పేర్కొంది. దీనిలో ఎక్కువ ఆయన వ్యక్తిగత సెక్యురిటీకి వెచ్చించిన వ్యయాలే ఉన్నాయి. 83 శాతం పరిహారాలు సెక్యురిటీకి సంబంధించిన ఖర్చులని, మిగతా మొత్తం జుకర్‌బర్గ్ వ్యక్తిగతంగా వాడుకున్న ప్రైవేట్ ఎయిర్‌క్రాఫ్ట్ ఖర్చులు ఉన్నాయని కంపెనీ తెలిపింది. గతేడాది జుకర్‌బర్గ్ ఎక్కువ సమయం ట్రావెలింగ్‌కే వెచ్చించారని, అమెరికాలోని అన్ని రాష్ట్రాలను ఆయన చుట్టిముట్టేశారని పేర్కొంది. సెక్యురిటీ వ్యయాలు అంతకముందు 4.9 మిలియన్ డాలర్లుంటే, 2017లో 7.3 మిలియన్ డాలర్లకు పెరిగాయి. అయితే ఫేస్బుక్ సీఈవో బేస్ శాలరీలో ఎలాంటి మార్పు లేదు. ఆయన బేస్ శాలరీ 1 డాలర్‌గానే ఉంది. అదేవిధంగా కంపెనీలో ఆయన ఓటింగ్ అధికారాలు కూడా 59.9 శాతం పెరిగాయి. చైర్మన్‌గా, సీఈవోగా, వ్యవస్థాపకుడిగా ఉన్న ఆయన భద్రత విషయంలో పలు ముప్పులు ఉంటాయని, ఈ నేపథ్యంలో జుకర్‌బర్గ్‌కు వ్యక్తిగత సెక్యురిటీకి ఎక్కువగా వెచ్చించినట్టు ఫేస్బుక్ బోర్డ్ పరిహారాల కమిటీ తెలిపింది. గత రెండేళ్ల నుంచి ఫేస్బుక్ అంచనా వేసిన దానికంటే ఎక్కువ ఆదాయాలనే ఆర్జిస్తోంది. కానీ ఇటీవల కేంబ్రిడ్జ్ అనలిటికాతో ఫేస్బుక్ యూజర్ల డేటాను కంపెనీ అక్రమంగా పంచుకుందనే ఆరోపణలు వెల్లువెత్తడంతో, ఆ కంపెనీ షేర్లు ఒక్కసారిగా ఢమాల్‌మన్నాయి. ఈ విషయంపై వివరణ ఇవ్వడానికి జుకర్‌బర్గ్ అమెరికన్ కాంగ్రెస్ ముందుకు కూడా వచ్చారు. -
అట్రాసిటీ కేసుల్లో పరిహారం పెంపు
గత ఉత్తర్వులను సవరిస్తూ సర్కార్ నిర్ణయం సాక్షి, హైదరాబాద్: షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందినవారు అత్యాచారాలు, దాడులకు గురైనపుడు సహాయం, పునరావాసం కింద అందించే పరిహారాన్ని పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గతంలోని ఉత్తర్వులను సవరిస్తూ ఆదేశాలు జారీచేసింది. తాజా నిర్ణయం ప్రకారం ఎస్సీ, ఎస్టీలపై దాడులు జరిగిన సందర్భాల్లో బాధితులు వందశాతం వైకల్యానికి గురైతే రూ. 8.25 లక్షల పరిహారం, 50 శాతం వైకల్యముంటే రూ.4.5 లక్షలు, 50 శాతం కంటె తక్కువ వైకల్యానికి గురైతే రూ. 2.5 లక్షల పరిహారాన్ని అందజేయనున్నారు. దాడిలో హత్యకు గురైనా.. లేదా మరణానికి దారితీస్తే రూ.8.25 లక్షలు, గ్యాంగ్ రేప్‌నకు గురైన వారికి రూ.8.25 లక్షలు, అత్యాచారానికి గురైన వారికి రూ.5 లక్షలు పరిహారమివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాక హత్య, మరణం, రేప్, గ్యాంగ్‌రేప్, శాశ్వత వైకల్యం, దోపిడీకి గురైన కేసుల్లో ఎస్సీ, ఎస్టీ బాధితుల భార్య లేదా వారిపై ఆధారపడి జీవిస్తున్న వారికి నెలకు రూ.5 వేల చొప్పున అందజేస్తారు. ఈ కేసుల్లో చనిపోయిన వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం, వ్యవసాయ భూమి, ఇళ్లు వంటివి అందజేస్తారు. వారి పిల్లలను డిగ్రీ వరకు చదివిస్తారు. దాడుల్లో ఇళ్లు పూర్తిగా ధ్వంసం కావడం లేదా తగులబడితే అదేస్థలంలో ప్రభుత్వ ఖర్చులతో ఇంటిని నిర్మించి ఇస్తారు. వివక్ష బాధితులకు రూ.2 లక్షల పరిహారం.. ఎస్సీ, ఎస్టీలకు వ్యతిరేకంగా తప్పుడు సాక్ష్యాలను సృష్టించడం, ఇవ్వడం వంటి కేసుల్లో బాధితులకు రూ.4.15 లక్షల పరిహారాన్ని ఇవ్వాలని నిర్ణయించింది. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగుల చేతుల్లో వివక్ష లేదా బాధితులుగా మారిన వారికి లేదా వారిపై ఆధారపడిన వారికి రూ.2 లక్షలు పరిహారం, ఆలయాల్లోకి, ప్రార్థనాస్థలంలోకి ప్రవేశించకుండా, సామాజిక, సాంస్కృతికంగా ఊరేగింపులు నిర్వహించకుండా అడ్డుకుంటే.. బాధితులకు రూ. లక్ష పరిహారంతో పాటు ఆయా హక్కులను కల్పించాలని నిర్దేశించింది. ఎస్సీ, ఎస్టీలను ఎన్నికల్లో ఓటు వేయకుండా, నామినేషన్ దాఖలు చేయకుండా నిరోధించడం, ఎన్నికల్లో హింస.. ఇతరత్రా దౌర్జన్యకర సంఘటనల్లో బాధితులకు రూ.85 వేల పరిహారాన్ని అందించనున్నారు. ఈ మేరకు ఎస్సీ అభివృద్ధిశాఖ కార్యదర్శి బి. మహేశ్ దత్ ఎక్కా ఉత్తర్వులను జారీచేశారు.