కొత్త జట్టు!
యంత్రాంగం కూర్పులో కేసీఆర్ మార్కు!
ఏఐఎస్ విభజనతో అధికారుల బదిలీ అనివార్యం
ఎస్పీ, సబ్‌కలెక్టర్ ఏపీ కేడర్‌కు.. వారిస్థానంలో కొత్త ముఖాలు
బదిలీల జాబితాలో జేసీల పేర్లు కూడా..
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : పాలనా యంత్రాంగంలో ప్రక్షాళనకు తెరలేచింది. అఖిల భారత సర్వీసు(ఏఐఎస్) అధికారుల విభజన ప్రక్రియ కొలిక్కి రావడంతో జిల్లా సారథుల మార్పు అనివార్యం కానుంది. రంగారెడ్డి గ్రామీణ ఎస్పీ బి.రాజకుమారి, వికారాబాద్ సబ్‌కలెక్టర్ హరినారాయణ్ లను విభజన ప్రక్రియలో ఏపీ కేడర్‌కు కేటాయించడంతో వీరిరువురు బదిలీ తప్పనిసరిగా మారింది. రెండు నెలల క్రితం రాజకుమారిని బదిలీ చేస్తూ ఆమె స్థానే మెదక్ ఎస్పీ సుమతిని ఇన్‌చార్జిగా ఎస్పీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
అయితే, సుమతి బాధ్యతలు స్వీకరించకపోవడంతో రాజకుమారే ఎస్పీగా కొనసాగుతున్నారు. తాజాగా ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ తదితర అధికారుల విభజనకు ప్రధాని ఆమోదముద్ర వేయడం.. నేడో, రేపో డీఓపీటీ కూడా జాబితాను రాష్ట్ర ప్రభుత్వానికి పంపనున్న తరుణంలో రాజకుమారి ఏపీ ప్రభుత్వానికి రిపోర్టు చేయాల్సివుంటుంది. సబ్‌కలెక్టర్ హరినారాయణ్ కూడా ఆ రాష్ట్రానికి వెళ్లాల్సివుంటుంది. ఏపీకి మారుతున్న వీరి స్థానంలో కొత్త ముఖాలు కొలువు దీరనున్నాయి.
జాయింట్ కలెక్టర్లకు స్థానచలనం?
మరోవైపు జిల్లా జాయింట్ కలెక్టర్లుగా వ్యవహరిస్తున్న ఎం.చంపాలాల్, ఎంవీరెడ్డిల పేర్లు బదిలీల జాబితాలో ఉంటాయనే ప్రచారం జరుగుతోంది. ఏడాదిన్నర క్రితం జేసీలుగా ఒకే రోజు విధుల్లో చేరిన ఈ ఇద్దరూ కలెక్టర్ పోస్టుపై కన్నేశారు. పని ఒత్తిడితో సతమతమవుతున్న చంపాలాల్ జిల్లా నుంచి నిష్ర్కమించడమే మంచిదనే భావనకొచ్చినట్లు తెలుస్తోంది. నగర శివార్లలో భూముల ధరలు ఆకాశన్నంటిన నేపథ్యంలో ఈ పోస్టుకు భలే డిమాండ్ ఉంది. ఈ క్రమంలోనే
పలువురు అధికారులు జేసీ-1గా వచ్చేందుకు పావులు కదుపుతున్నారు.
విభజన ప్రక్రియ కొలిక్కిరావడంతో జేసీ-2 ఎంవీరెడ్డికి కూడా స్థానచలనం ఉంటుందని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. పదవీ విరమణకు కొన్నేళ్లు మాత్రమే ఉన్నందున ఏదేనీ జిల్లాకు కలెక్టర్‌గా సేవలందించాలని ఆయన భావిస్తున్నారు. ఆప్రాధాన్య పోస్టులో ఏడాదిన్నరగా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆయన పేరు త్వరలో వెలువడే బ దిలీల జాబితాలో ఉండవచ్చనే ప్రచారం జరుగుతోంది.
కలెక్టర్ పోస్టుపై కన్ను!
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బదిలీపై కలెక్టర్‌గా జిల్లాకొచ్చిన ఎన్.శ్రీధర్ కు ఇప్పట్లో స్థానచలనం జరిగే అవకాశాలులేకపోవచ్చు. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ప్రభుత్వాన్ని గట్టెక్కించేందుకు కేసీఆర్ సర్కారు అప్పగించిన గురుతర బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తున్న శ్రీధర్‌ను మార్చడం వల్ల స్థలాల క్రమబద్ధీకరణ, భూముల అమ్మకంతో నిధులు సమకూర్చుకోవాలనే ప్రభుత్వ లక్ష్యం దెబ్బతినే ఆస్కారం ఉందనే వాదన వినిపిస్తోంది.
భూముల సర్వే, పరిశ్రమల స్థాపనలోనూ ముఖ్యపాత్ర పోషిస్తున్న ఆయనను మార్చే అవకాశాలు స్వల్పంగానే ఉన్నాయి. కార్యదర్శి హోదాలో ఇప్పటికే నాలుగు జిల్లాల్లో కలెక్టర్‌గా సేవలందించిన శ్రీధర్ పేరు సింగరేణి కాలరీస్ సీఎండీ పోస్టుకు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇది కార్యరూపం దాల్చితే కృష్ణా జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు పేరును ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవచ్చనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం కృష్ణా కలెక్టర్‌గా పనిచేస్తున్న ఆయన తెలంగాణ కేడర్‌కు మారనున్నారు.
ఇదిలావుండగా, తెలంగాణలోనే ముఖ్య పోస్టుగా భావిస్తున్న రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గిరిపై పలువురు అధికారులు ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే ప్రభుత్వ స్థాయిలో తమదైన శైలిలో పావులు కదుపుతున్నారు. ఏదీఏమైనా వారం, పది రోజుల్లో జిల్లా పాలనాయంత్రాంగంలో సమూల మార్పులు జరుగనున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ మార్కు పాలనకు అనుగుణంగా అధికారులు కొలువుదీరనున్నారు.