ముళ్లబాటలు దాటి.. పూలదారి చేరి
బతుకు పూలబాట కాదు.. అది పరవశించి పాడుకొనే పాటకాదు.. అన్నాడో సినీ కవి. నిజమే.. బంగారానికి పుటం పెడితేనే దాని నాణ్యత పెరిగేది. కష్టాల కొలిమిలో కాగిపోతూ జీవనగమ్యాన్ని చేరుకున్నప్పుడే సార్థకత. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అనుకున్న సివిల్స్ సాధించినవారు ఒకరైతే.. పెళ్లైన ఏడేళ్లకే భర్తను కోల్పోయినా ధైర్యం పోగొట్టుకోకుండా కూలిపనులు చేసి ఇద్దరు పసి బిడ్డలను ప్రయోజకులుగా తీర్చిదిద్దిన వారు ఇంకొకరు. నారీశక్తికి ప్రతీకగా నిలిచిన ఆ ఇద్దరూ మహిళలందరికీ ఆదర్శప్రాయులు.
సాక్షి,రాజమహేంద్రవరం : పశ్చిమగోదావరి జిల్లాలో ఓ సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టారు బి.రాజకుమారి. తండ్రి న్యాయవాది. తల్లి గృహిణి. చిన్ననాడే సివిల్స్ సాధించడమే తన ధ్యేయం చేసుకున్నారామె. అయితే కుటుంబ ఆర్థిక పరిస్థితులు ఆమెకు సహకరించలేదు. దాంతో ఒక్కోమెట్టు ఎక్కాలని ఆమె నిర్ణయించుకున్నారు. ఆమేరకు ఆమె గ్రూప్–2 ఉద్యోగిగా ఉద్యోగ జీవనం ప్రారంభించారు. 2000లో గ్రూప్–2కు ఎంపికయ్యారు. ఈవోఆర్డీగా ఉద్యోగం సంపాదించారు. 2003లో వివాహం అయ్యింది. 2005లో మరో ప్రయత్నంలో ఏసీటీఓ (గ్రూప్–2)గా ఎంపికై ఆకివీడులో విధులు నిర్వర్తించారు. 2005లోనే గ్రూప్–1 పరీక్షలు రాశారు. ఈసారి బీసీ వెల్ఫేర్ అధికారిగా ఎంపికయ్యారు. గుంటూరు జిల్లా అధికారిగా బాధ్యతలు నిర్వర్తించారు.
ఇద్దరు పిల్లలు కలిగారు. ఇద్దరు పిల్లల తల్లిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ 2006లో సివిల్స్‌కు ఎంపికయ్యారు. ఐపీఎస్‌గా ఎంపికై 2007 బ్యాచ్‌లో హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ శిక్షణ అకాడమీలో శిక్షణ పొందారు. ఎస్పీ(ట్రైనింగ్)గా నల్లగొండ జిల్లాలో తొలి పోస్టింగ్ పొందారు. తర్వాత నూజివీడు అసిస్టెంట్ ఎస్పీగా, నిజమాబాద్ అడిషనల్ ఎస్పీగా విధులు నిర్వహించి 2015లో మంగళగిరి ఆరో బెటాలియన్ కమాండెంట్‌గా వెళ్లారు. 2016 మే 16న రాజమహేంద్రవరం అర్బన్ జిల్లాకు తొలి మహిళా ఎస్పీగా వచ్చి విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం కుమారుడు తొమ్మిదో తరగతి, కుమార్తె 8వ తరగతి చదువుతున్నారు.
మహిళా సమస్యల పరిష్కారానికి పటిష్ట చర్యలు
ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, కాలేజీలు, స్కూళ్లు, గృహిణుల సమస్యల పరిష్కారానికి, వారి రక్షణకు రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా ఎస్పీ పటిష్ట రాజకుమారి పటిష్టమైన చర్యలు చేపడుతున్నారు. షీటీమ్స్, సెల్ఫ్ టీమ్స్, వుమెన్ హెల్ప్ డెస్క్, ఫ్యామిలీ వెల్ఫేర్ కమిటీ, పాఠశాల పిల్లలకు సెక్సువల్ అబ్యూజ్‌పై అవగ్నా టీమ్‌లు ఏర్పాటు చేశారు. రాజమహేంద్రవరం అర్బన్ జిల్లాలో మహిళా సమస్యల పరిష్కారానికి చేపడుతున్న చర్యలు ఎస్పీ రాజకుమారి మాటల్లో....
షీ టీమ్స్ ఏర్పాటు చేశాం
షీ టీమ్ 2016లో ఏర్పాటు చేశాం. తర్వాత రెండో టీమ్‌ను ఏర్పాటు చేశాం. ఫిర్యాదు వచ్చి నిమిషాల్లోనే షీ టీమ్ సభ్యులు ఆ ప్రాంతానికి వెళ్లి సమస్యను పరిష్కరిస్తారు. 24 గంటల పాటూ షీ టీమ్ అందుబాటులో ఉంటుంది. రాజమహేంద్రవరం నగరంలో ఆకతాయిల పని పడుతున్నాం. బాలికలకు సెక్సువల్ అబ్యూజ్‌పై షీ టీమ్స్ ద్వారా అవగాహన కల్పించేందుకు పాఠశాలల్లో సమావేశాలు నిర్వహిస్తున్నాం. కళాశాలల్లో ‘సెల్ఫ్ షీ టీమ్స్’ ఏర్పాటు చేశాం. ఈ టీమ్‌లో ఆయా కళాశాలల్లోని ఐదుగురు సీనియర్ విద్యార్థులు సభ్యులుగా ఉంటారు. ఆయా కళాశాలల్లో తలెత్తే సమస్యలను షీ టీమ్స్ సహాయంతో వారే పరిష్కరించుకునేలా దీన్ని రూపొందించాం.
ఉమెన్ హెల్ప్ డెస్క్...
ఎస్పీ కార్యాలయానికి వచ్చే మహిళలకు ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశాం. మహిళలు అక్కడ ఉన్న సిబ్బందిని సంప్రదిస్తే పిటిషన్లు రాసేందుకు సహకరించడం, లేదా సిబ్బందే రాసిస్తారు. సమస్యను బట్టీ పోలీస్ స్టేషన్‌కు, లేదా షీటీమ్స్‌కు వారి ఫిర్యాదును పంపిస్తాం. సమస్య పరిష్కారంపై ఉమెన్ డెస్క్‌లు ఫాల్‌అప్ చేస్తాయి.
పోలీసు మహిళా సిబ్బందికి వెల్ఫేర్ కమిటీలు
పోలీసు విభాగంలో మహిళా సిబ్బంది సమస్యలను పరిష్కరించేందుకు మూడు వుమెన్ వెల్ఫేర్ కమిటీలు ఏర్పాటు చేశాం. ఈ కమిటీలకు మహిళా ఎస్సై నేతృత్వం వహిస్తున్నారు. మహిళా పోలీసులు ఎదుర్కొనే సమస్యలకు ఒక కమిటీ, జిల్లా పోలీసు శిక్షణ సంస్థలోని ట్రైనీ కానిస్టేబుళ్లకు రెండో కమిటీ, ఇతర సిబ్బంది (మినిస్టీరియల్ సిబ్బంది) కోసం మూడో కమిటీని ఏర్పాటు చేశాం.
బ్లూకోల్ట్.. వైట్ కోల్ట్ మహిళా కానిస్టేబుళ్లు
రాష్ట్రంలోనే మొదటిసారిగా రాజమహేంద్రవరంలో బ్లూకోల్ట్, వైట్కోల్ట్గా మహిళా కానిస్టేబుళ్లను నియమించాం. గొడవలు, సమస్యాత్మక ప్రదేశాలు, ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు బ్లూకోల్ట్ సిబ్బంది వెంటనే స్పందిస్తారు. వారు ద్విచక్రవాహనంపై ఘటనా స్థలానికి చేరుకుంటారు. బ్లూకోల్ట్ కానిస్టేబుల్ ఇటీవల గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకోబోయిన ఇద్దరిని కాపాడింది. వైట్కోల్ట్ మహిళా కానిస్టేబుల్ ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించిన వారిపై చర్యలు చేపడుతుంది.
అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం
నగరంలో రౌడీయిజాన్ని ఉక్కుపాదంతో అణచివేస్తున్నాం. రౌడీ షీటర్ల సమాచారాన్ని డిజిటలైజ్ చేశాం. తరచూ వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నాం.
మహిళా రక్షణ కోసం ‘యూ– సేఫ్’ యాప్
ప్రమాదంలో ఉన్న మహిళల కోసం కొత్తగా ‘యూ– సేఫ్’ పేరుతో యాప్ తయారు చేయిస్తున్నాం. ఈ యాప్‌లో ఆటోలు, వాహనాల్లో వెళుతూ ఇబ్బందులకు గురైతే చిన్నపాటి సిగ్నల్ ఇస్తే ఆ వాహనాన్ని జీపీఎస్ ద్వారా గుర్తిస్తాం.