కడపసిటీ, న్యూస్‌లైన్ :జిల్లాలో నిర్వహించే ఎన్నికల కోసం పోలింగ్ బూత్‌ల మార్పులు, చేర్పులు కొత్త బూత్‌ల వివరాలు తప్పులు లేకుండా 10వ తేది లోగా పంపాలని జిల్లా కలెక్టర్ కోన శశిధర్ ఆదేశించారు. నగరంలోని జిల్లా పరిషత్ వైఎస్‌ఆర్ సమావేశ హాల్‌లో గురువారం సాయంత్రం పోలింగ్ బూత్‌ల ఏర్పాటు, మార్పులు, చేర్పులపై రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా నిర్వహించినందుకు అధికారులను అభినందించారు. పోలింగ్ బూత్‌ల విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పక్కాగా పోలింగ్ బూత్‌లు మార్పులు, చేర్పులు, కొత్త బూత్‌ల ఏర్పాటు అందజేయాలన్నారు. 1200 మంది ఓటర్లు ఉంటే పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేయాలన్నారు. ఓటర్లకు బూత్‌లు అందుబాటులో ఉండాలని, తహశీల్దార్లు స్వయంగా పరిశీలించి ఏర్పాటు చేయాలన్నారు. బూత్‌లలో తాగునీరు, విద్యుత్ సౌకర్యం ఉండేలా చూడాలన్నారు. ఎస్సీ, ఎస్టీ కాలనీల బూత్‌లను మార్చరాదన్నారు. మైనార్టీ, బీసీ కాలనీలలో 1200 మంది ఓటర్లుంటే బూత్ ఉండాలన్నారు.
ఈనెల 12వ తేది పోలింగ్ బూత్ వివరాల ప్రకటన ఉంటుందని, పోలింగ్ బూత్‌ల ఏర్పాటుకై అభ్యంతరాలు వస్తే తహశీల్దార్లు వాటి వివరాలు తెలియజేయాల్సి ఉంటుందన్నారు. సబ్ కలెక్టర్, ఆర్డీఓలు పోలింగ్ బూత్‌ల మార్పులు, చేర్పులను పరిశీలించాలన్నారు. ఓటర్ల నమోదు అభ్యంతరాలు, మార్పులు, చేర్పుల దరఖాస్తులను రిజిష్టరులో నమోదు చేస్తూ కంప్యూటరులో నమోదు చేయాలన్నారు. ఆన్‌లైన్‌లో ఓటర్ల నమోదు సరిగా డౌన్‌లోడ్ కావడం లేదని జమ్మలమడుగు ఆర్డీఓ రఘునాథరెడ్డి కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులను పెండింగ్ లేకుండా తక్షణం పరిష్కరించాలన్నారు. భూ సమస్యల వినతులు పరిష్కరించాలన్నారు. దొంగ పాసు పుస్తకాలు, స్టిక్కర్లు వస్తున్నాయని, తహశీల్దార్లు ప్రత్యేక దృష్టిసారించి అలాంటి వాటిని నివారించాలన్నారు. గ్రామంలోని సమస్యలను కలెక్టర్ దృష్టికి ఎస్‌ఎంఎస్ ద్వారా తెలపాలన్నారు.
అదనపు జాయింట్ కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో అంగన్‌వాడి కేంద్రాలకు సొంత భవనాలు లేవని, ఐదు సెంట్ల ప్రభుత్వ స్థలాన్ని గుర్తించి నివేదికలు పంపాలన్నారు. ఇన్‌చార్జి డీఆర్‌ఓ ఈశ్వరయ్య మాట్లాడుతూ ప్రభుత్వ, పొరంబోకు భూములను గుర్తించి రక్షణ కల్పించేందుకు 9 బృందాలు నియమించామని, ఒక్కో బృందం నాలుగు నుంచి ఐదు మండలాల్లో పర్యటిస్తారన్నారు. ఈ సమావేశంలో రాజంపేట సబ్‌కలెక్టర్ ప్రీతిమీనా, కడప, జమ్మలమడుగు ఆర్డీఓలు వీరబ్రహ్మయ్య, రఘునాథరెడ్డి, ఏఓ గుణభూషణ్‌రెడ్డి తహశీల్దార్లు పాల్గొన్నారు.