మరుపురాని మహానేత | Ap ,telangana political leaders talk about ysr | Sakshi
Sakshi News home page

మరుపురాని మహానేత

Published Sun, Jul 8 2018 4:02 AM | Last Updated on Mon, Sep 17 2018 5:10 PM

Ap ,telangana political leaders talk about ysr - Sakshi

సంతకమే వసంతమైతే అది వస్తూనే ఉంటుంది చిరునవ్వే ఆభరణమైతే అది మెరుస్తూనే ఉంటుంది ఆశయాలే చినుకులైతే అవి కురుస్తూనే ఉంటాయి విలువలే విత్తులైతే అవి మొలకెత్తుతూనే ఉంటాయి ప్రేమే జ్ఞాపకమైతే .. ఆ మనిషి ఎప్పటికీప్రజల వ్యాపకం నుంచి జరిగిపోడు.. చెరిగిపోడు. పుట్టి 69 ఏళ్లయింది. ప్రజల పిలుపుకి దూరమై తొమ్మిదేళ్లు గడిచిపోయింది. కానీ... ప్రతి మదిలో ఆ రూపం పదిలం. ప్రతి ఊరు ఆయన స్మృతిలోఒక సువర్ణయుగాన్ని మననం చేసుకుంటూనే ఉంది. మనిషిగా ఆయన పంచిన మంచి,  నాయకుడిగా చేసిన పోరాటం,  పాలకుడిగా పంచిన సంక్షేమం ఎప్పటికీ గీటురాళ్లే. ఆయనే దివంగత ముఖ్యమంత్రి, మహానేత, డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి. మేలు పొందిన ప్రజలు వైఎస్‌ ఔదార్యాన్ని.. కలిసి పనిచేసిన అధికారులు ఆయన వ్యక్తిత్వాన్ని.. సన్నిహితులు ఆ రాజన్న మాటను మమతను.. నేటికీ గుర్తు చేసుకుంటూనే ఉన్నారు.  అలాంటి పాలన మళ్లీ వస్తే బాగుండు అని ఆకాంక్షిస్తున్నారు.   ప్రజల మనిషి పుట్టిన రోజును ఊరూవాడా పండుగలా జరుపుకుంటున్నారు.  

పోలవరం వైఎస్సార్‌ ఘనతే
దశాబ్దాల తరబడి పునాది రాళ్లకే పరిమితమైన పోలవరం బహుళార్ధ సాధక ప్రాజెక్టు పనులు చేపట్టిన ఘనత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రులుగా పనిచేసిన వారిలో ఒక్క రాజశేఖరరెడ్డికే దక్కుతుంది.ఎంతో ముందుచూపుతో కుడి, ఎడమ కాలువల సామర్థ్యాన్ని ఏకంగా 17,500 క్యూసెక్కులతో డిజైన్‌ చేయించి కాలువల పనులను దాదాపు ఆయన హయాంలోనే పూర్తి చేశారు. కుడి, ఎడమ కాలువలతో పాటు పోలవరం హెడ్‌వర్క్‌ పనులను వైఎస్సార్‌ చేపట్టారు. అన్ని అనుమతులు తేవడానికి కేంద్రంపై ఒత్తిడి తెచ్చి సాధించగలిగారు. వైఎస్సార్‌ ఉండి ఉంటే పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేది. రాయలసీమలో హంద్రీ–నీవా, గాలేరు–నగరి ప్రాజెక్టుల పనులను వైఎస్సార్‌ చేపట్టారు. పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ సామర్థ్యాన్ని 11 వేల క్యూసెక్కుల నుంచి 44 వేల క్యూసెక్కులకు పెంచిన ఘనత వైఎస్సార్‌దే. వెనుకబడిన ఉత్తరాంధ్ర జిల్లాల కోసం ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టును చేపట్టిందీ వైఎస్సారే. 

పేదలకు సాయం చేసేందుకు తపన..
సహాయం కోసం వచ్చిన వారిని ఆదుకునే విషయంలో వైఎస్‌ వెనుకాముందూ చూడరు. అప్పట్లో ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ వర్సిటీలో సీహెచ్‌ అనూరాధ అనే విద్యార్థిని చదువుతుండేది. ఆకతాయిలు యాసిడ్‌ దాడి చేయడంతో ఆమె ముఖమంతా అందవికారంగా తయారైంది. దీంతో ఆమె నేరుగా అప్పటి సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డిని కలిసి ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకోవడానికి ఆర్థిక సాయం చేయాలని కోరింది.ఆమె పరిస్థితి చూసి చలించిపోయిన వైఎస్‌ అప్పటికప్పుడు రూ.71.45 లక్షలు మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. అంతే కాకుండా.. పూర్తిగా వైద్యం చేయించుకోవడానికి ఎంత ఖర్చయినా భరిస్తామని ఆమెకు భరోసా ఇచ్చారు.
– తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్‌ కేవీ రమణాచారి

పాలకుడంటే వైఎస్‌లా ఉండాలి..
‘అసలు ప్రజా పాలకుడంటే ఎలా ఉండాలో అన్నదానికి వైఎస్‌ రాజశేఖరరెడ్డిగారే నిదర్శనం.. వైఎస్‌ ప్రభుత్వ హయాంలో నేను ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో)లో కార్యదర్శిగా ఉన్నందున చాలా అంశాలను దగ్గర నుంచి చూసే అవకాశం కలిగింది. దీనివల్ల నేను చాలా నేర్చుకున్నా’ అని రిటైర్డు ఐఏఎస్‌ అధికారి కె.ప్రభాకర్‌రెడ్డి చెప్పారు. వివిధ సందర్భాల్లో వైఎస్‌లో గమనించిన పలు అంశాలను ఆయన ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం రాజధర్మం: రాష్ట్రంలో ఉన్నా, రాష్ట్రం వెలుపల ఉన్నా ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్‌) కింద సాయం కోసం వచ్చిన వినతులను పరిష్కరించనిదే వైఎస్‌ ఏనాడూ నిద్రపోయేవారు కాదు. ఒక రోజు ఢిల్లీలో ప్రధానమంత్రి డాక్టర్‌ మన్మోహన్‌సింగ్, యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీని కలిశాక.. కేంద్ర మంత్రులు, ఇతరులతో సమావేశాలు ముగిసేసరికి బాగా పొద్దుపోయింది. ఆన్‌లైన్‌లో సీఎంఆర్‌ఎఫ్‌ లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌ (ఎల్‌వోసీ) అనుమతుల అంశం రేపు చూద్దురు.. ఇక నిద్రపోండి సర్‌.. అని నేను సూచించాను. ‘నో.. అవి పూర్తిచేశాకే నిద్ర.. మన నిద్ర కోసం ఎల్‌వోసీలు ఆగిపోకూడదు. నిధుల మంజూరు మెసేజ్‌లు ఆస్పత్రులకు వెళితేనే అక్కడి వారు ఈ పేదలకు వైద్యం ఆరంభిస్తారు. లేదంటే వైద్యం చేయరు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం రాజధర్మం’ అని చెప్పారు వైఎస్‌. దీంతో ఆ సలహా ఇచ్చినందుకు నేనే సిగ్గుపడ్డా. ఇదీ.. పేదల సమస్యల పట్ల ఆయనకున్న చిత్తశుద్ధి. 
– నాటి సీఎంవో కార్యదర్శి ప్రభాకర్‌రెడ్డి  

బీడు భూములకు జీవం 
వైఎస్సార్‌  చేసిన మేలు గద్వాల చరిత్రలో నిలిచిపోయింది. 2004 బడ్జెట్‌లో నెట్టెంపాడుకు సంబంధించిన ప్రతిపాదనలు లేవని తెలిసింది. వెంటనే వైఎస్సార్‌ వద్దకు వెళ్లి ప్రాజెక్టు విషయాన్ని చెప్పా. ఒక్కరోజులో నెట్టెంపాడు  ప్రతిపాదనలు ఓకే చేశారు. అంతేకాదు 25 వేల ఎకరాల ఆయకట్టు నుంచి ఏకంగా 2 లక్షల ఎకరాల ఆయకట్టుకు పెంచారు. ఈరోజు నెట్టెంపాడు ద్వారా 1.5 లక్షల ఎకరాల బీడు భూములకు సాగునీరు అందుతుందంటే అది వైఎస్‌ చలువే.     
– డీకే అరుణ, గద్వాల ఎమ్మెల్యే



తక్షణ నిర్ణయాలు 
తక్షణం నిర్ణయాలు తీసుకోవడంలో వైఎస్‌కు సాటివచ్చేవారు లేరు. ఒక రోజు సీఎం కార్యాలయం నుంచి ఫోన్‌ వచ్చింది. నియోజకవర్గానికి అవసరమైన ప్రతిపాదనలు ఏవైనా ఉన్నాయా అని అడిగారు.తాగునీటి ఎద్దడి తీర్చడానికి మంజీర నది నుంచి నీటిని అందించడానికి తాగునీటి పథకం కోసం రూ.40 కోట్లు అవసరమవుతాయని చెప్పా. ఆశ్చర్యంగా రాత్రి 11 గంటల సమయంలో సీఎం కార్యాలయం నుంచి మరో ఫోన్‌ వచ్చింది. తాగునీటి పథకం పనులు చేపట్టేందుకు సీఎం ఆమోదం తెలిపారని,  ఉత్తర్వులు పంపుతున్నట్లు చెప్పారు.       
– మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి 

అన్నది గొప్ప మనసు.. 
ప్రజల కోసం పడే తపన, ఎవరు సలహాలిచ్చినా స్వీకరించే గుణం అన్నలో కనిపించేవి. ఆ రోజుల్లో సిరిసిల్లలో నేత కార్మికుల ఆత్మహత్యలు తరచుగా జరిగేవి. వీటిని నివారించేందుకు రైతులు, డ్వాక్రా మహిళలకు ఇస్తున్న తరహాలో చేనేత కుటుంబాలకు కూడా పావలా వడ్డీ, ఐదు లక్షల రుణాలను ఇస్తే బాగుంటుందని అన్న వైఎస్‌కు సూచించా.  మరుసటి రోజు ఉదయంమే  క్యాంపు ఆఫీసు నుంచి అన్న ఫోన్‌. ‘మీరిచ్చిన ప్రతిపాదనలు చూశానమ్మా.. చాలా బాగున్నాయి. ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో ప్రకటిద్దాం’ అన్నారు. ‘పల్లెబాటకు వెళితే ప్రజల నుంచి సంచుల కొద్దీ అర్జీలొస్తున్నాయి.. సంచులతో బస్సు నిండిపోతోంది.. ఏం చేద్దాం అని ఓ నాయకుడు అనడం నా చెవిన పడింది. వెంటనే జోక్యం చేసుకుని అన్నా.. రేషన్‌ కార్డు, ఇల్లు, పెన్షన్‌ ఇస్తే సగం అర్జీలకు ఫుల్‌స్టాప్‌ పడుతుందని అనేశా. అంతే ఇందిరమ్మ ఇళ్లు, అర్హులందరికీ పెన్షన్, రేషన్‌ కార్డుల జారీకి శ్రీకారం చుట్టారు. హైదరాబాద్‌ శివారుల్లో రాజీవ్‌గృహ కల్ప కాలనీలకు అంకురార్పణ చేసి ఇళ్ల సమస్యను తీర్చారు.
– మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి

పైసా ఖర్చు లేకుండా ఆరోగ్య శ్రీ
1986లో తెలుగుగంగ పనులను పర్యవేక్షించేందుకు ప్రతిపక్ష నేతగా వైఎస్సార్‌ వెళ్లారు. ఆ సమయంలో ఓ కూలీ గాయపడి అల్లాడుతున్నాడు. వైఎస్సార్‌ అతనికి ప్రాథమిక చికిత్స అందించి, మద్రాసుకు పంపి మెరుగైన వైద్యం అందించారు. అలాగే 1988లో కడప జిల్లాలో ఓ గ్రామం మీదుగా వెళ్తున్నాం. ఆ రోడ్డు పూర్తిగా కంకర తేలిపోయి ఉంది. దాన్ని గమనించిన ఆయన సీఎం అయ్యాక నాణ్యతతో రహదారులను నిర్మించడమే కాకుండా గ్రామాల్లోనే అత్యధికంగా పనులు చేయించారు. ఇంకోసారి మహబూబ్‌నగర్‌లో పార్టీకి చెందిన కార్యకర్త క్యాన్సర్‌తో బాధపడుతూ ఆర్థికంగా చితికిపోయాడు. అతన్ని స్వయంగా పరామర్శించిన వైఎస్సార్‌ ఆర్థికంగా ఆదుకోవడమే కాకుండా, మెరుగైన వైద్యం చేయించారు. తాను సీఎం అయ్యాక ప్రతి పేదవాడికి పైసా ఖర్చు లేకుండా కార్పొరేట్‌ వైద్యం అందించే ఆరోగ్యశ్రీ  ప్రవేశపెట్టారు.
– భూమన కరుణాకర్‌రెడ్డి, టీటీడీ మాజీ చైర్మన్‌

లబ్ధి పొందని కుటుంబం లేదు 
మహిళల సమర్థతపై వైఎస్‌ఆర్‌కు అపారమైన నమ్మకం ఉండేది. అందుకే ఆయన మంత్రివర్గంలో ఏకంగా ఐదుగురు మహిళలకు స్థానం కల్పించి వారి సమర్థతను నిరూపించుకునే అవకాశమిచ్చారు. తనకు సహచరులే తప్ప అనుచరులు లేరని చెప్పిన అరుదైన నాయకుడు వైఎస్‌. అందుకే ఆయన ప్రతీ ఒక్కరి మనస్సులోను చోటు సంపాదించుకున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే వైఎస్సార్‌ పాలనలో లబ్ధిపొందని కుటుంబంలేదని ఘంటాపథంగా చెప్పొచ్చు. రైతులతోపాటు అన్ని వర్గాల వారూ వైఎస్‌ హయాంలో సంతోషంగా ఉండేవారు. 
– ఉండవల్లి అరుణ్‌కుమార్, మాజీ ఎంపీ, రాజమహేంద్రవరం  

మానవీయ కోణంలో పరిష్కారాలు
ప్రజల సమస్యలను మానవీయ కోణంలో ఆలోచించి, వాటి పరిష్కారానికి వైఎస్సార్‌ చిత్తశుద్ధితో కృషి చేశారు. సర్వశిక్షా అభియాన్‌కు, శాసనసభ కమిటీకి నేను చైర్మన్‌గా ఉన్నప్పుడు పాఠశాలల్లో కంప్యూటర్‌ విద్యను ప్రవేశపెట్టాలని ప్రతిపాదించాను. శాసనసభా కమిటీ ప్రతిపాదన కదా అనే చులకన భావనతో అధికార యంత్రాంగం సీరియస్‌గా తీసుకోలేదు. దీన్ని వైఎస్‌ దృష్టికి తీసుకెళ్లగానే.. ‘రేపు మధ్యాహ్నం సర్వశిక్షా అభియాన్‌పై సమీక్షా సమావేశం నిర్వహిద్దాం.. మీరు కూడా ఉండండి’ అన్నారు. దాదాపు మూడు గంటలసేపు జరిగిన చర్చల తదుపరి, రాష్ట్రంలోని 1000 పాఠశాలల్లో కంప్యూటర్‌ విద్య ప్రవేశపెట్టేందుకు అక్కడికక్కడే నిర్ణయం తీసుకొన్నారు. అదేవిధంగా తెనాలిలో యడ్ల లింగయ్యనగర్‌లో అగ్నిప్రమాదం సంభవించి 150కి పైగా ఇళ్లు కాలిపోయాయి. వైఎస్‌తో సమస్య చెప్పగానే ప్రభుత్వ ఖర్చుతోనే అందరికీ ఇళ్లు నిర్మిద్దామని హామీ ఇచ్చారు. అన్న మాటలను అక్షరాలా సాకారం చేసి చూపారు.     
– మాజీ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌

నిరాడంబరతకు నిదర్శనం 
ప్రజల పక్షాన ఉండే ప్రతీ అధికారినీ గౌరవించే వ్యక్తిత్వం వైఎస్‌కే సొంతం. నేను కడప, జమ్మలమడుగు డీఎస్పీగా పనిచేశాను. 1991–92లో ఈ ప్రాంతంలో ఎన్నికలు జరిగాయి. వైఎస్‌ ఇలాఖాలో ఇంత స్వేచ్ఛ ఉంటుందా అన్న విషయం ఎన్నికలయ్యాక గానీ నాకు తెలీలేదు. ‘నిష్పక్షపాతంగా ఉన్నావ్‌.. అదే కావాలి’ అని ఆయన ప్రశంసించడం ఇప్పటికీ గుర్తుంది. ఓ అధికారిగా నా పాప పెళ్లికి రమ్మని కార్డిచ్చాను.అంతే.. రావడమే కాదు.. మా కుటుంబ సభ్యులతో అరగంట గడపడం వైఎస్‌ నిరాడంబరతకు నిదర్శనం. విధినిర్వహణలో భాగంగా  కొన్ని విషయాల్లో ముందుకెళ్ళాలా? వద్దా? అనే సందేహాలొచ్చినప్పుడు కులం, మతం, పార్టీని చూడొద్దు. పేదవాడికి అన్యాయం జరిగితే వందశాతం వాళ్ల పక్షానే నిలబడాలని ఆయన చెప్పేవారు.  
– ఇక్బాల్, విశ్రాంత ఐపీఎస్‌ అధికారి 

సమయపాలనలో మార్గదర్శి 
సమయపాలన పాటించడంలో వైఎస్‌కు ఎవరూ సాటిలేరు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన ఏ సమావేశానికైనా గంట కొట్టినట్లు నిర్దిష్ట సమయానికి ఠంచనుగా వచ్చేవారు. ఇచ్చిన సమయం ముగియగానే ఎక్కడా నిమిషం కూడా వృథా చేయకుండా వెళ్లిపోయేవారు. అధికారుల సమీక్షల్లో కూడా ఎక్కడా కాలాన్ని వృథా చేసేవారు కాదు. ఏ అంశమైనా సూటిగా, స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్లు చెప్పేవారు. అధికారులు చెప్పే అంశాలను నిశితంగా పరిశీలించేవారు. స్పష్టమైన అవగాహన ఉన్న అంశాల్లో చక్కటి మార్గనిర్దేశం చేసేవారు. రైతులకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకునేవారు.ఎక్కువమంది సందర్శకులను కలవడానికి అవకాశం ఇచ్చేవారు. ప్రాధాన్యం ఉండి వివరంగా మాట్లాడాల్సిన అంశమైతే తర్వాత అపాయింట్‌మెంట్‌ ఇచ్చి పిలిపించి మాట్లాడేవారు. ఇంతటి టైమ్‌ మేనేజ్‌మెంట్‌ పాటించినందునే ఆయన ఎక్కువ మందిని కలిసేవారు. సమీక్షలు, మంత్రివర్గ సమావేశాలు కూడా సకాలంలో పూర్తిచేసేవారు.  
– ఐవైఆర్‌ కృష్ణారావు, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి  

ఏదడిగినా కాదనలే..!
‘దివంగత మహానేత వైఎస్‌ మహానీయుడు. నిరంతరం ప్రజల సంక్షేమం కోసమే పరితపించిన గొప్ప నేత. విద్య, వైద్యానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చి వాటికి భారీ ఎత్తున నిధులు కేటాయించారు. సంక్షేమం, అభివృద్ధికి సంబంధించి ఎవరేం అడిగినా కాదనకుండా ఇచ్చేవారు. నేను విశ్వవిద్యాలయం, అగ్రికల్చర్‌ కాలేజీ, ఇంజనీరింగ్‌ కాలేజీ కావాలని అడిగా. ఆయన కాదనకుండా వెంటనే వాటిని మంజూరు చేశారు. ఆయన చొరవ వల్ల జిల్లాలో వేల మంది విద్యార్థులు దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఉన్నత చదువులు చదివి గొప్ప స్థాయికి వెళ్లారు.
– తెలంగాణ సీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి

వంశధార సాకారమైంది
ఆరు దశాబ్దాలుగా నలుగుతున్న వంశధార జలాల సమస్య ఈ రోజు కొలిక్కి వచ్చినా, ట్రిబ్యునల్‌ తీర్పు అనుకూలంగా వచ్చినా దానికి కారణం.. దూరదృష్టితో నాడు వైఎస్‌ తీసుకున్న చొరవే. ఒడిశాకు ఇబ్బందిలేని రీతిలో భామిని మండలంలో సైడ్‌వియర్‌ నిర్మించి వరద కాలువ ద్వారా హిరమండలం జలాశయంలోకి నీరు తెచ్చే విధంగా ప్రఖ్యాత ఇంజనీర్‌ సీఆర్‌ఎం పట్నాయక్‌ ప్రత్యామ్నాయ ప్లాన్‌ తయారుచేశారు. దీనికి వైఎస్‌ వెంటనే గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. ప్రాజెక్టు నిర్మాణ పనులూ చాలావరకూ పూర్తయ్యాయి. ఇది పూర్తయితే శ్రీకాకుళం జిల్లాలో 2.5 లక్షల ఎకరాల్లో రెండు పంటలకూ సాగునీరు అందుతుంది. 
– మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు

ఎప్పుడూ ప్రజల వెంటే..
అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల వెన్నంటే ఉండాలని దివంగత మహానేత వైఎస్సార్‌ ఎప్పుడూ చెప్పేవారు. కార్మిక నాయకుడిగా ఉన్న నన్ను ఎమ్మెల్యేను చేసిన ఘనత వైఎస్సార్‌దే. తంగెడ, దాచేపల్లి, నడికుడి, శ్రీనగర్, గామాలపాడు, పొందుగల గ్రామాలకు కృష్ణానది నీటిని అందించేందుకు నిధులు కేటాయించారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పిడుగురాళ్ల, గురజాల, మాచవరం మండలాల్లో నిరుపేదలకు ఇళ్లు కట్టించాం. నియోజకవర్గంలో జరిగిన వందల కోట్ల అభివృద్ధిలో వైఎస్సార్‌ది చెరగని ముద్ర. బీసీలంటే వైఎస్సార్‌కు అమిత ప్రేమ ఉంది.
వైఎస్సార్‌సీపీ బీసీ విభాగం అధ్యక్షుడు కృష్ణమూర్తి

అక్కడికక్కడే రూ.17 కోట్లు 
ప్రజల కష్టాన్ని తన కష్టంగా భావించి వాటికి అక్కడికక్కడే పరిష్కారం చూపించిన మహనీయుడు మహానేత వైఎస్‌. 2005లో తమ్మిలేరుకు వరదలు వచ్చి ఏలూరు సగానికిపైగా నీట మునిగి ఐదారు అడుగుల నీరు చేరింది. సీఎం వైఎస్సార్‌కు ఫోన్‌ చేసి పరిస్థితి వివరించగానే ఆయన వెంటనే ఏలూరు వచ్చారు. నన్ను, కలెక్టర్‌ను పిలిచి సమస్యకు శాశ్వత పరిష్కారం ఏమిటని అడిగారు. ఏలూరు చుట్టూ ఉన్న తమ్మిలేరుకు రివిటింగ్‌ చేయడంతోపాటు, రిటైనింగ్‌ వాల్‌ కడితే సరిపోతుందని చెప్పాను. దీంతో ఆయన అక్కడికక్కడే రూ.17 కోట్లు మంజూరు చేశారు. 
– వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ ఆళ్ల నాని 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement