అశ్వరావుపల్లి రిజర్వాయర్ ప్రారంభోత్సవంతో మహానేత వైఎస్సార్(ఫైల్)
సాక్షి, జనగామ: కరువుకు కేరాఫ్‌గా మారిన జనగామ ప్రాంతంలో జలసిరులను అందించి చెదిరిపోసి సంతకం చేశారు దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి. భౌతికంగా లేకపోయినా ముఖ్యమంత్రిగా ఈ పోరుగడ్డకు చేసిన అభివృద్ధి రూపంలో నేటికి కళ్ల ముందే కదలాడుతోంది. సాగు, తాగునీటి రంగాలకు అధిక ప్రాధాన్యతను ఇచ్చి కరువు నేలకు జల ప్రదాతగా మారారు. సముద్రమట్టానికి 540 మీటర్ల ఎత్తులో ఉన్న జనగామ ప్రాంతానికి అపర భగీరథుడిగా మారి గోదావరి జలాలను తీసుకువచ్చారు. కరువు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసి రైతు బాంధువుడిగా తనదైన ముద్ర వేసుకున్నారు.
కరువు ప్రాంతంలో ఆయన చేసి అభివృద్ధి ప్రాజెక్టుల రూపంలో, 108 వాహనం కుయ్ కుయ్ శబ్దం వినగానే ఆపద్బాంధవుడిగా, ఆరోగ్యశ్రీ రూపంలో పేదల దైవంగా, ఉచిత విద్యుత్, రుణమాఫీతో రైతుల పక్షపాతిగా, వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు భరోసా ఇచ్చి కుటుంబానికి పెద్ద కొడుకుగా దివంగత మహానేత వైఎస్సార్ వ్యవహరించారు. అందుకే ఆయన పాలన ఓ స్వర్ణయుగంగా మారి, ప్రజల మనస్సుల్లో రారాజుగా వెలుగొందుతున్నారు. ఆదివారం ఆయన జయంతిని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా అనేక కార్యక్రమాలను చేపట్టడానికి వైఎస్సార్ అభిమానులు సన్నాహాలు చేస్తున్నారు.
రిజర్వాయర్ల నిర్మాణంలో వైఎస్సార్ కృషి..
కృష్ణా, గోదావరి నదులకు మధ్యలో జనగామ ప్రాంతం ఉంది. దీనితో ప్రతి ఏటా తక్కువ వర్షపాతం నమోదు అయ్యేది. రైతులు వేసిన పంటలు నీరు లేక ఎండిపోయే దుస్థితి ఉండేది. సాగునీటికే కాదు కనీసం తాగడానికి నీటి చుక్క దొరకనటువంటి పరిస్థితి. అలాంటి కరువు ప్రాంతానికి గో దావరి జలాలను తీసుకురావడంతో అపర భగీరథుడిగా కృషి చేశారు. మండుటెండలో మహాప్రజాప్రస్థానం పేరుతో చేపట్టిన చారిత్రక పాదయాత్రతో వైఎస్సార్ ప్రజల కష్టాలను దగ్గరుండి చూసి, విన్నారు. ప్రజల కష్టాలను తీర్చడానికి మహానేత ముందుకు వచ్చారు. కరువు ప్రాంతంలో జలసిరులను నింపడానికి తీవ్రంగా ప్రయత్నించారు. బడ్జెట్‌లో అధిక నిధులు కేటాయించిన ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.
దేవాదుల నీటితో సస్యశ్యామలం..
ప్రజల ఆశీర్వాదంతో 2004 నుంచి 2009 వరకు ముఖ్యమంత్రిగా వైఎస్ సుపరిపాలన సాగించా రు. ఆయన పరిపాలన కాలంలో జిల్లాలో రిజర్వాయర్ల నిర్మాణంపై దృష్టి సారించారు. జె.చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకం మొదటి దశలో రూ.844 కోట్లు, రెండోదశలో రూ.1887 కోట్లు, మూడో దశలో రూ.5410 కోట్లను కేటాయించారు. ఈ నిధులతో చిల్పూర్ మండలంలోని రాజవరం, స్టేషన్ ఘన్‌పూర్‌లో ఘన్‌పూర్ రిజర్వాయర్లను నిర్మించారు.
నర్మెట మండలంలో గండిరామారం, బొమ్మకూరు, వెల్దండ, చీటకోడూరు రిజర్వాయర్లను నిర్మించారు. 2007 ఏప్రిల్ 15వ తేదీన రఘునాథపల్లి మండలంలోని అశ్వరావుపల్లి రిజర్వాయర్‌ను వైఎస్సార్ స్వయంగా ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు. అంతేకాకుండా దేవాదుల పైపులైన్‌కు అనుసంధానంగానే కన్నెబోయినగూడెం, నవాబుపేట రిజర్వాయర్లు సైతం నీటితో నేడు కళకళలాడుతున్నాయి. జనగామ మునిసిపాలిటీ పరిధిలోని ప్రజలకు తాగునీటిని అందించడానికి చీటకోడూరు రిజర్వాయర్‌ను నిర్మించారు. ఇటు సాగు అటు తాగునీటిని అందించడంలో వైఎస్సార్ ఎనలేని సేవలను అందించారు.
నీటితో కళకళలాడుతున్న నర్మెటలోని గండిరామారం రిజర్వాయర్
Comments
Please login to add a commentAdd a comment