కోతలు.. వాతలు
♦ అనధికార విద్యుత్ కోతలతో వెతలు
♦ ఏజెన్సీలో మరీ దారుణం
♦ ఎల్‌ఆర్‌లు లేవంటున్న అధికారులు
♦ ఈ నెల నుంచే కొత్త చార్జీలు
సాక్షి, విశాఖపట్నం: వేసవి వచ్చేసింది..తనతో పాటు విద్యుత్ కోతలను తీసుకొచ్చింది. జిల్లాలో అధికారికంగా ప్రకటించకపోయిన్పటికీ, మండల, గ్రామ స్థాయిలో అనధికారిక విద్యుత్ కోతలు అమలు చేస్తున్నారు. ఇవి కేవలం స్థానికంగా ఏర్పడే ఇబ్బందుల వల్లనే తప్ప లోడ్ రిలీఫ్ విధించాల్సిన పరిస్థితి ఇంకా రాలేదని విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఈ నెల విద్యుత్ బిల్లులో కొత్త ధరలు పడనున్నాయి. ఒకటో తేదీ నుంచి అమలులోకి వచ్చిన 2015-16 ఆర్థిక సంవత్సర విద్యుత్ టారిఫ్ ప్రకారం కొత్త ధరలతో బిల్లుల భారం పడనుంది.
జిల్లాలో 12 లక్షల మంది విద్యుత్ వినియోగదారులున్నారు. వీరికి రోజుకు అందించే విద్యుత్ 16 మిలియన్ యూనిట్లు. ఆ మేరకు విద్యుత్ కోటా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఎలాంటి విద్యుత్ కోతలు విధించడం లేదంటున్నారు. కానీ గ్రామ స్థాయిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. కొన్ని గ్రామాల్లో దాదాపు ఒక పూటంతా విద్యుత్ సరఫరా ఉండటం లేదు. ముఖ్యంగా ఏజెన్సీలో పరిస్థితి దారుణంగా ఉంది. ఇక్కడ విద్యుత్ సరఫరా సక్రమంగా ఉండకపోవడంతో తాగునీటికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. విద్యుత్ సౌకర్యం లేక నీటిపథకాలు పనిచేయకపోవడంతో సుదూర ప్రాంతాల నుంచి నీటిని మోసుకుని తెచ్చుకుంటున్నారు.
ఇదే విషయాన్ని ఆశాఖ అధికారుల వద్ద ప్రస్తావించగా ఏజెన్సీలో ఉండే ప్రత్యేక పరిస్థితులు, సమస్యల కారణంగా విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు తలెత్తున్న మాట వాస్తవమేనని దానిని అధిగమించడానికి చర్యలు చేపడుతున్నామని వివరించారు. మరోవైపు ఈ నెల నుంచి జిల్లా ప్రజలపై నెలకు రూ.10.22 కోట్ల విద్యుత్ చార్జీల భారం పడుతోంది. 200 యూనిట్లు పైబడి వాడే ప్రతి వినియోగదారుడిపై చార్జీల భారం తప్పదు. ఓ వైపు కోతలు, మరో వైపు చార్జీల వాతలు ఈ నెల నుంచే జిల్లా విద్యుత్ వినియోగదారులకు ఎదురవుతున్నాయి.