ఇదేనా సంపద సృష్టి?
భూముల విలువతోపాటు నిర్మాణాల (స్ట్రక్చర్) విలువలూ పెరుగుదల
గుడిసెలు, పూరి పాకలు, పెంకుటిళ్లు, రూఫ్ లేని ఇళ్లు.. వేటినీ వదలని వైనం
అన్ని రకాల నిర్మాణాల విలువల్ని పెంచేసిన చంద్రబాబు ప్రభుత్వం
నివాస, వాణిజ్య భవనాలు, అపార్టుమెంట్ల ఫ్లాట్ల విలువలు అమాంతం పెంపు.. విలువల పెంపుపై మెమో జారీ చేసిన రిజిస్ట్రేషన్ల శాఖ
భూముల విలువలు సైతం 50 శాతానికిపైగా పెంపు.. ఇందుకోసం దొడ్డిదారిన క్లాసిఫికేషన్ల మార్పు
ఏరియా ప్రాతిపదికన కాకుండా స్థలం ప్రాతిపదికగా విలువలు ఖరారు
ఇప్పటికే ఖరారు చేసిన సబ్ రిజిస్ట్రార్లు.. జేసీ కమిటీల ఆమోదమే తరువాయి
జనవరి ఒకటి నుంచి అమల్లోకి కొత్త విలువలు.. రూ.కోటి ఫ్లాట్‌పై అదనంగా రూ.2.5 లక్షల భారం
వంద గజాల స్థలంపైనా భారీగా వడ్డన
అడ్డగోలుగా ఆదాయం పెంచుకోవడమే లక్ష్యంగా ప్రజలపై భారం
రాష్ట్రంలో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలకు మేలు చేసిందేమీ లేకపోగా, ప్రజలను బాదడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇటీవల కనీవినీ ఎరుగని రీతిలో కరెంట్ చార్జీలను ఎడా పెడా బాదేసిన చంద్రబాబు ప్రభుత్వం.. తాజాగా రిజిస్ట్రేషన్లపై పడింది. ఇదివరకు ఏ ప్రభుత్వం అవలంభించని రీతిలో ల్యాండ్ ధరలను పెంచేయడంతో పాటు నిర్మాణాల విలువనూ అమాంతం ఆకాశాన్నంటించింది.
విలువల పెంపునకు కాదేదీ అనర్హం.. అన్నట్లు పూరిళ్లు, రేకుల షెడ్లు, పెంకుటిళ్లు, గోడలు లేని ఇళ్లను కూడా వదలక పోవడం విస్తుగొలుపుతోంది. క్లాసిఫికేషన్ల పేరుతో మాయ చేస్తూ ఒకే ప్రాంతంలో ఇష్టానుసారం రేట్లు ఫిక్స్ చేస్తోంది. సంపద సృష్టించడం అంటే ఇదే కాబోలు అని జనం వాపోయేలా చేసింది.
విజయవాడలోని పటమట ప్రాంతంలో ప్రస్తుతం రూ.కోటి విలువైన ఫ్లాట్ కొనుగోలు చేస్తే రిజిస్ట్రేషన్ చార్జీలు రూ.8 లక్షలు. ఇప్పుడు దాని విలువ 30% పెరిగితే రిజిస్ట్రేషన్ చార్జీలు అదనంగా రూ.2.50 లక్షలు.. అంటే రూ.10.50 లక్షలు కట్టాల్సి వస్తుంది. గుంటూరు రూరల్ ప్రాంతంలో రూ.30 లక్షల స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే ప్రస్తుతం రూ.2.40 లక్షలు అవుతుండగా.. అవి రూ.3 లక్షలకు పెరగనున్నాయి.
ఇలా అన్ని చోట్లా భూముల విలువను బట్టి రేట్లు భారీగా పెరిగిపోనున్నాయి. జనవరి 1 నుంచి ఈ పెరుగుదల అమల్లోకి రానుంది. ఈ మేరకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ మంగళవారం రాత్రి మెమో, ప్రొసీడింగ్స్ (ఎంవీ1/752/2022) జారీ చేశారు.
సాక్షి, అమరావతి: ఆదాయం పెంచుకోవడమే లక్ష్యంగా చంద్రబాబు ప్రభుత్వం ప్రజలపై పెను భారాలు మోపుతోంది. భూముల విలువతోపాటు నిర్మాణాల (స్ట్రక్చర్) విలువను అమాంతం పెంచేస్తోంది. ఇప్పటికే నిర్మాణాల విలువను నిర్ధారించింది. పూరిళ్లు, రేకుల షెడ్లు, పెంకుటిళ్లు, గోడలు లేని ఇళ్లనూ వదలకుండా వాటి విలువలను పెంచేసింది. భూముల విలువ పెంచినా, ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. పైకి 20 శాతం వరకు పెంపు ఉంటుందని చెబుతున్నా 50 శాతం వరకు పెంచుతున్నారని తెలుస్తోంది.
అర్బన్, రూరల్ ప్రాంతాల్లోని భూముల విలువ కేటగిరీలను బట్టి 30 నుంచి 60 శాతం వరకు పెంచేస్తున్నారు. దీంతో నగరాల్లో అపార్టుమెంట్లలోని ఫ్లాట్లు, ఇళ్లు కొనుగోలు చేసిన వారిపై అదనంగా రూ.లక్షల భారం పడనుంది. భూముల విలువ పెంపును తక్కువగా చూపేందుకు ప్రస్తుతం ఉన్న భూముల క్లాసిఫికేషన్లను మార్చేస్తున్నారు. అంటే ప్రతి ఏరియాలోని భూమికి ప్రస్తుతం ఒకే విలువ ఉండగా, దొడ్డిదారిన దాని క్లాసిఫికేషన్ మార్చి రెండవ విలువను పెట్టాలని నిర్ణయించారు. దీనికి కొత్తగా లేయర్లు, గ్రిడ్ల విధానాన్ని ప్రవేశపెట్టారు.
ప్రస్తుతం వ్యవసాయ భూమి అయితే మెట్ట, మాగాణి, కన్వర్షన్ చేసిన భూమిగా.. ఇళ్ల స్థలాలైతే జాతీయ రహదారులను ఆనుకుని ఉన్నవి.. వాటి వెనుక ఉన్నవి.. అంటూ పలు రకాలుగా క్లాసిఫికేషన్‌లో ఉన్నాయి. ఒక ఏరియాలో మెట్ట భూమి విలువ రూ.10 లక్షలు, మాగాణి భూమి విలువ రూ.20 లక్షలుగా ఉందనుకుందాం. ఇప్పుడు రూ.10 లక్షలు ఉన్న మెట్ట భూమిలో ఒకచోట రూ.15 లక్షలు, పక్కనే ఉన్న దానికి రూ.20 లక్షలు పెడుతున్నారు. అంటే ప్రతి క్లాసిఫికేషన్‌లోనూ కొత్తగా రెండో రేటు పెడుతున్నారు.
జాతీయ రహదారి పక్కనున్న భూములకు ఒక క్లాసిఫికేషన్, వాటి వెనుక లోపల ఉన్న భూములను మరో క్లాసిఫికేషన్ పెడుతున్నారు. ఈ విధానంలో ఒకే ప్రాంతంలోని రోడ్డుపై ఉన్న భూమికి ఒక రేటు, దానికి ఆనుకున్న భూమికి ఒక రేటు, వాటి వెనుక ఉన్న వాటికి మరో రేటు పెడుతున్నారు. అర్బన్ ప్రాంతాల్లోనూ క్లాసిఫికేషన్లు మార్చి రోడ్ల పక్కనున్న స్థలాలకు ఒకరేటు, సందుల్లో వాటి వెనుక ఉన్న స్థలాలకు మరో రేటు నిర్ణయిస్తున్నారు.
వాణిజ్య స్థలాలకు సంబంధించి క్లాసిఫికేషన్లు రకరకాలుగా మార్చారు. ఒక ఏరియాలోనే గతంలో మాదిరిగా ఒక క్లాసిఫికేషన్‌లో ఉన్న భూమికి ఒక రేటు కాకుండా ప్రతి దాని రేటు మార్చేస్తున్నారు. తద్వారా ఒకే ప్రాంతంలో ఉన్న భూమి మార్కెట్ విలువను వీలును బట్టి రెండు, మూడు రకాలుగా పెంచేశారు.
ఏరియాను బట్టి కాదు.. స్థలాన్ని బట్టి రేటు
సాధారణంగా భూముల విలువను.. ఉన్న దానిపైనే ఎంతో కొంత పెంచడం ఆనవాయితీ. కానీ ఆదాయాన్ని భారీగా పెంచుకోవడం కోసం గుట్టుచప్పుడు కాకుండా క్లాసిఫికేషన్లు మార్చుతున్నారు. దీంతో ప్రతి వ్యవసాయ, నివాస, వాణిజ్య భూములతోపాటు అర్బన్ ప్రాంతాల్లోని అన్ని స్థలాల మార్కెట్ విలువలు అమాంతం పెరిగిపోనున్నాయి.
ఏరియా ప్రాతిపదికన కాకుండా సంబంధిత భూమి ప్రాతిపదికన రేటు పెట్టడంతో అన్ని భూముల విలువలు పెరిగిపోనున్నాయి. ఎక్కడైనా ఈ ఏరియాలో భూమి రేటు ఎంత ఉందని అడగడం సహజం. కానీ ఇకపై ఆ ఏరియాలోని ప్రతి స్థలం రేటు.. రోడ్డు పక్కన ఒకలా, రోడ్డు లోపల మరోలా మారిపోవడం వల్ల రేటు చెప్పడం అంత సులువు కాదు.
27 నాటికి తుది విలువలకు ఆమోదం
భూముల మార్కెట్ విలువల పెంపునకు సంబంధించి ఇప్పటికే సబ్ రిజి్రస్టార్లకు రిజిస్ట్రేషన్ల శాఖ షెడ్యూల్ కూడా ఇచ్చింది. 18వ తేదీ లోపు మార్కెట్ విలువను నిర్ధారించాలని షెడ్యూల్ ఇవ్వడంతో దాదాపు అన్ని చోట్లా వాటిని ఖరారు చేశారు. 19వ తేదీ ఆయా జిల్లాల్లో జాయింట్ కలెక్టర్ల నేతృత్వంలోని కమిటీలు వీటికి ఆమోదం తెలపనున్నాయి. 20వ తేదీ.. పెరిగిన ఈ విలువలను సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లోని నోటీసు బోర్డులో అంటించడంతోపాటు రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్‌సైట్‌లో పెట్టి ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించాలని సూచించారు.
అభ్యంతరాల స్వీకరణ, వాటికి వివరణలు ఇవ్వడం, డేటా ఎంట్రీ పనులన్నీ 26వ తేదీలోపు పూర్తి చేసి.. 27న మార్కెట్ విలువకు జేసీ కమిటీల నుంచి తుది ఆమోదం తీసుకోవాలని ఆదేశించారు. జనవరి 1 నుంచి ఈ విలువలను అమల్లోకి తెచ్చి, వాటి ప్రకారమే రిజి్రస్టేషన్ల చార్జీలు వసూలు చేయాలని స్పష్టం చేశారు. తదనుగుణంగా సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో పని జరుగుతోంది.
పూరి పాకలనూ వదల్లేదు
ఇప్పటికే నిర్మాణాల విలువను ప్రభుత్వం ఖరారు చేసి ఉత్తర్వులిచ్చింది. కార్పొరేషన్లు, మున్సిపాల్టీలు, నగర పంచాయతీలు, గ్రామ పంచాయతీల వారీగా రెసిడెన్షియల్, కమర్షియల్ నిర్మాణాలు, నాన్ ఆర్‌సీసీ రూఫ్‌లతోపాటు పూరిళ్లు, గోడలు లేని ఇళ్ల విలువనూ పెంచేసింది. కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో ఉన్న అపార్టుమెంట్లలోని ఫ్లాట్లు, నివాస భవనాలకు చదరపు అడుగు విలువను రూ.1,490కి పెంచింది.
నగర పంచాయతీల్లో చదరపు అడుగు రూ.1,270, గ్రామ పంచాయతీల్లో చదరపు అడుగుకు రూ.900కు పెంచింది. సెల్లార్, పార్కింగ్ ఏరియాతోపాటు ప్రతి అంతస్తులో అదనపు ఫ్లోర్లకు రేటు పెంచారు. వాణిజ్య భవనాల విలువను కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో రూ.1,800కు, నగర పంచాయతీల్లో రూ.1,540కి, పంచాయతీల్లో రూ.1060కు పెంచారు.
ఇతర ఆర్‌సీసీ నిర్మాణాలే కాకుండా ఆర్‌సీసీ రూఫ్‌లు లేని ఇళ్ల విలువను సైతం పెంచేశారు. చివరికి పెంకుటిళ్లు, పాకలు, గోడలు లేని ఇళ్లను సైతం వదలకుండా వాటి విలువను చదరపు అడుగుకు రూ.5 నుంచి రూ.20 వరకూ పెంచింది. అన్ని రకాల నిర్మాణాల్లోనూ ఎస్‌ఎఫ్‌టీ రేటు రూ.30 నుంచి రూ.90 వరకు పెంచారు.
Comments
Please login to add a commentAdd a comment