నెల్లూరు(హరనాథపురం), న్యూస్‌లైన్: అసలే వేసవి కాలం. ఆపై కరెంట్ కోతలు. రెండూ కలిసి ప్రజలకు ఉక్కపోత. ఇదీ జిల్లాలో దుస్థితి. బుధవారం ఏకంగా 10 గంటలు విద్యుత్ కోత విధించడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. జిల్లాలో రోజురోజుకూ విద్యుత్ కోతలు పెరుగుతున్నాయి. పాలకులు, అధికారులకు ముందుచూపు లేకపోవడంతో ప్రతి వేసవిలో ప్రజలకు కరెంట్ కష్టాలు తప్పడం లేదు. అధికార, అనధికార కోతలతో ప్రజలు అల్లాడుతున్నారు. పల్లెల్లో పగలంతా కరెంట్ ఉండటం లేదు. కరెంట్ కోతలపై అధికారులు ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంతో జనం ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కొత్తగూడెం థర్మల్ విద్యుత్ కేంద్రంలో నాలుగు యూనిట్లు మరమ్మతులకు గురి కావడంతో జిల్లా వ్యాప్తంగా అంధకారం నెలకొంది. మధ్యాహ్నం 12 గంటలకు సరఫరాను నిలిపివేసి సాయంత్రం 5కు పునరుద్ధరించారు. గంటల తరబడి సరఫరా నిలిచిపోవడంతో కరెంట్ ఎప్పుడు వస్తుందా అని జిల్లా ప్రజలు ఎదురు చూశారు. విద్యుత్ కోతలపై సమాచారం తెలుసుకునేందుకు సంబంధిత అధికారులను సెల్ ఫోన్‌లలో సంప్రదించేందుకు ప్రయత్నించగా ఎస్‌ఈ మొదలుకుని డీఈఈ, ఏఈల వరకు అందరి ఫోన్లు బిజీ అని తప్ప సమాధానం రావడం లేదు.
నెల్లూరు నగరంతో పాటు, పట్టణాల్లో విద్యుత్ కోతలు విధించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే మండల కేంద్రాలు, పట్టణాల్లో కరెంట్‌పై ఆధారపడి జీవిస్తున్న చిరు వ్యాపారులు కుదేలవుతున్నారు. వేసవి ప్రారంభంలోనే ఈ రకంగా ఎడా పెడా విద్యుత్ కోతలను విధిస్తుండడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. పట్టణాల్లో అధికారికంగా గంట, అనధికారికంగా మరో గంట కోత విధిస్తున్నారు. గ్రామాల్లో అయితే పగలంతా కరెంట్ ఉండటం లేదు. పల్లెల్లో ప్రజలకు కంటిపై కునుకు లేకుండాపోతోంది.
ఈ కోతల వల్ల తాగునీటి పథకాలకు ఆటంకం ఏర్పడుతున్నది. మున్ముందు ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. భూగర్భ జలాలు అడుగంటుతుండటంతో మోటార్ల ద్వారా నీటిని తోడేందుకు విద్యుత్ వినియోగం పెరుగుతున్నది. మరోవైపు ఏసీల వినియోగం పెరుగుతుండటంతో విద్యుత్ డిమాండ్, సరఫరా మధ్య తీవ్ర వ్యత్యాసం ఉంటోందని అధికారులు పేర్కొంటున్నారు.
అయితే నిర్దేశించిన కోతలతో పాటు అనధికారికంగా మరో 3 గంటలు కోతలను విధిస్తున్నారు. జిల్లా కేంద్రంలో 3 గంటలు, మున్సిపల్ పట్టణ కేంద్రాల్లో 4 గంటలు, మండల కేంద్రాల్లో 6 గంటలు అని అధికారులు చెబుతున్నా ఆచరణలో ఎమర్జెన్సీ కోతలు అంటూ అనధికారికంగా కోతలు విధిస్తున్నారు. జిల్లాలో బుధవారం మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో 10 గంటల పాటు ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. కరెంట్ కోతల కారణంగా పలు వ్యాపార సంస్థలు వెలవెలబోయాయి.
జెరాక్సు షాపులు, జ్యూస్ సెంటర్లు, పిండి మిల్లులు, వెల్డింగ్ షాపులు, ఆటోనగర్ వర్క్‌షాపుల్లో ఎక్కడికక్కడ పనులు నిలిచిపోయాయి. పనులపై వచ్చిన వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గ్రామీణ ప్రాంతాల్లో రక్షిత మంచినీటి ట్యాంకుల నుంచి తాగునీరు సరఫరా లేక ప్రజలు కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆస్పత్రుల్లో సైతం అత్యవసర సేవలు మినహా మిగిలిన అన్ని రకాల సేవలు నిలిచిపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
కరెంట్ కోత ఉక్కపోత..
Published Thu, Apr 24 2014 3:24 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement