వేసవికి ముందే ‘కోతలు’
• సిరిసిల్లలో అప్రకటిత విద్యుత్ కోతలు
• వస్త్రోత్పత్తి కి విఘాతం
• తరచూ అంతరాయాలతో ఇబ్బందులు
సిరిసిల్ల : కార్మిక క్షేత్రంలో అప్రకటిత విద్యుత్ కోతలు మొదలయ్యాయి. వేసవికి ముందే కరెంట్ కోతలు షురూ కావడంతో వస్రో్తత్పత్తి ఖిల్లా సిరిసిల్లలో నేతన్నలు ఇబ్బం దులు పడుతున్నారు. సిరిసిల్లలో మరమగ్గాలపై వస్త్రం ఉత్పత్తి అవుతుండగా.. విద్యుత్‌కోతలు లేకుండా గతంలో సరఫరా చేశారు. ఇప్పుడు మాత్రం కరెంట్ కోతల వేళలు ప్రకటించకుండానే ఎప్పుడు పడితే అప్పుడే విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. గత మూడు రోజులుగా సిరిసిల్లలో అప్రకటిత విద్యుత్ కోతలు అమలు జరుగుతున్నాయి. దీంతో వినియోగదారులు అవస్థలు పడుతున్నారు.
కోతలతో వస్రో్తత్పత్తికి విఘాతం..
సిరిసిల్ల పట్టణంలోనే మరమగ్గాలపై పాలిస్టర్, కాటన్ వస్రా్తలు ఉత్పత్తి అవుతాయి. కరెంట్ లేకుండా గుడ్డ ఉత్పత్తి సాధ్యం కాదు. దీంతో సిరిసిల్ల పట్టణానికి చాలా కాలంలో నిరంతరం విద్యుత్ సరఫరా చేస్తున్నారు. సిరిసిల్లలో 34 వేల మరమగ్గాలు ఉండగా.. నిత్యం 34లక్షల మీటర్ల వస్త్రం ఉత్పత్తి అవుతుంది. పాతిక వేల మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. మధ్యతరగతి పేదలున్న సిరిసిల్ల కరెంట్ కోతలు ఉండొద్దని గతంలో నిర్ణయించి కొనసాగిస్తున్నారు. గత ఐదు రోజులుగా అప్రకటిత విద్యుత్ కోతలతో నేతన్నలు పని కోల్పోతున్నారు. సాంచాల మధ్య ఉంటూ గంటల తరబడి కరెంట్‌లేక ఉపాధి కరువు అవుతుంది. విద్యుత్ కోతలతో వస్రో్తత్పత్తికి విఘాతం కలుగుతుంది.
చిరువ్యాపారుల ఇబ్బందులు..
సిరిసిల్ల కార్మిక క్షేత్రంలో కరెంట్ కోతలతో చిరువ్యాపారులు సైతం అవస్థలు పడుతున్నారు. గురువారం మధ్యాహ్నం కరెంట్ లేక జనం ఇబ్బందులు పడ్డారు. వెల్డింగ్ షాపు, మోటార్ రీవైండింగ్, ఫోటో స్టూడియోలు, టేలరింగ్ షాపుల్లో పని లేక దిక్కులు చూశారు. వేసవికి ముందే కరెంట్ కోతలతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సిరిసిల్లలో విద్యుత్ కోతలను నివారించాలని నేత కార్మికులు, చిరు వ్యాపారులు కోరుతున్నారు.
సాంకేతిక సమస్యలతో కోతలు
సిరిసిల్ల ‘సెస్’ పరిధిలో నాణ్యమైన విద్యుత్‌ను పంపిణీ చేస్తున్నాం. పట్టణానికి విద్యుత్‌ను అందించే సబ్ స్టేషన్లలో సాంకేతిక సమస్యలు రావడంతో సరఫరాలో అవాంతరాలు ఏర్పాడ్డాయి. అధికారికంగా విద్యుత్ కోతలు లేవు. తాత్కాలిక సాంకేతిక సమస్యలతోనే కరెంట్ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ అవాంతరాలు లేకుండా చర్యలు తీసుకుంటాం.
– దోర్నాల లక్ష్మారెడ్డి, ‘సెస్’ చైర్మన్