గంటల తరబడి ఆలస్యంగా నడుస్తున్న సర్వీసులు
వారంరోజుల్లో నాలుగు పర్యాయాలు విశాఖపట్నం రైలు జాప్యం
వారం క్రితం ఏకంగా ఐదు గంటల ఆలస్యం
రెండు రోజుల క్రితం రెండు గంటల జాప్యం
హైదరాబాద్‌కు చెందిన ప్రసాద్ విజయవాడకు అత్యవసరంగా వెళ్లాల్సి వచ్చి వందేభారత్‌లో టికెట్ బుక్ చేసుకున్నాడు. కానీ, ఆ రోజు రైలు దాదాపు మూడు గంటలు ఆలస్యంగా బయలుదేరింది. తక్కువ టికెట్ ధర ఉన్న రైళ్ల కంటే ఆలస్యంగా అది విజయవాడకు చేరింది.
వందేభారత్ సర్విసు మొదలైన 16 నెలల కాలంలో ఈ తరహా సమస్యలు తక్కువే, కానీ, ఇటీవల తరచూ చోటు చేసుకుంటున్నాయి. వెంటవెంటనే ఏర్పడుతుండటం ఇటు ప్రయాణికులకు చికాకు తెప్పిస్తుండగా, రైల్వే అధికారులను కలవరపెడుతున్నాయి.
సాక్షి, హైదరాబాద్: భారతీయ రైల్వే ఆధునికతకు అద్దంపడుతూ దూసుకొచ్చిన ‘వందేభారత్’కూ సాంకేతిక సమస్యలు తప్పడం లేదు. రైళ్లలో సాంకేతిక సమస్యలు సాధారణమే అయినా, క్రమంగా ఆ సమస్య పెరుగుతోంది. దూర ప్రాంతాల మధ్య తిరిగే సాధారణ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లకు మూడు జతల రేకు(ఓ రైలు సెట్) ఉంటుంది.
ప్రయాణ సమయం దాదాపు 26 గంటలు తీసుకునే హైదరాబాద్–ఢిల్లీ తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ను తీసుకుంటే.. హైదరాబాద్‌లో ఉదయం ఒక రైలు బయలు దేరగా, దాని ఒక జత రైలు అదే రోజు ఢిల్లీలో బయలుదేరుతుంది. మరో జత రైలు దారిలో ఉంటుంది. తక్కువ దూరం తిరిగే వాటికి రెండు జతలుంటాయి.
» హైదరాబాద్–విశాఖపట్నంలాంటి సాధారణ దూరం తిరిగే (సగం రోజు ప్రయాణ సమయం) సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను తీసుకుంటే.. ఒక రైలు హైదరాబాద్‌లో బయలుదేరుతుంటే, అదే సమయానికి దాని జత రైలు విశాఖపట్నంలో బయలుదేరుతుంది.
» హైదరాబాద్‌లో ఉదయం బయలుదేరే తిరుపతి వందేభారత్ రైలు, అదే రోజు మధ్యాహ్నం తిరుపతి చేరుకొని, కాసేపటికే అక్కడ బయలుదేరి రాత్రి హైదరాబాద్‌కు చేరుకుంటుంది. దేశంలోని అన్ని వందేభారత్ రైళ్లది ఇదే తీరు. ఇక్కడే ఇప్పుడు సమస్య ఏర్పడుతోంది. ఒక చోట రైలు బయలుదేరేప్పుడు సాంకేతిక సమస్య ఏర్పడి ఆలస్యంగా బయలుదేరితే, గమ్యస్థానం చేరి, తిరిగి అక్కడ బయలుదేరేందుకు జాప్యం తప్పటం లేదు.
» ఈనెల 16న విశాఖపట్నంలో హైదరాబాద్ వచ్చే వందేభారత్ రైలు మూడు గంటలు ఆలస్యంగా బయలుదేరింది. విజయవాడలో మరో రెండు గంటలు ఆలస్యమైంది. వెరసి ఐదు గంటలు ఆలస్యంగా హైదరాబాద్ చేరుకుంది. సాధారణ రోజుల్లో హైదరాబాద్‌లో మధ్యాహ్నం 3 గంటలకు తిరుగుప్రయాణం ఉండాల్సి ఉండగా, ఐదు గంటలు ఆలస్యంగా రాత్రి 8 గంటలకు ఆ రైలు బయలుదేరాల్సి వచ్చింది.
ఒక కోచ్‌లో సాంకేతిక సమస్య తలెత్తితే రైలు ఆగిపోవాల్సిందే..
ఇక వందేభారత్ డిజైన్ కూడా ఈ జాప్యానికి మరో కారణమవుతోంది. ఇది సంప్రదాయ ఎక్స్‌ప్రెస్ రెళ్లకు భిన్నంగా ఉంటుంది. డెమూ, మెమూ తరహాలో రెండు ఇంజిన్లు రైలులో అంతర్భాగంగా ఉంటాయి. మూడునాలుగు కోచ్‌లు కలిపి ఒక సెట్‌గా ఉంటుంది. దీనికి పవర్‌కార్ జత కలిసి ఉంటుంది.
హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్ రైళ్లు కూడా ఇదే డిజైన్‌తో ఉంటాయి. ఓ కోచ్‌లో సాంకేతిక సమస్య తలెత్తితే, ఆ కోచ్ ఉండే సెట్ మొత్తాన్ని తొలగించి దాని స్థానంలో మరో సెట్ చేర్చి రైలును పంపేస్తారు. తర్వాత.. సాంకేతిక సమస్య తలెత్తిన కోచ్‌ను డిపోనకు తీసుకెళ్లి మరమ్మతు చేస్తారు. ఇందుకోసం స్పేర్ కోచ్‌లను అందుబాటులో ఉంచుతారు.
హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్ సర్విసుకు 12 కోచ్‌లతో కూడిన రెండు రేక్‌లు స్పేర్ విధుల్లో ఉన్నాయి. కానీ వందేభారత్‌కు స్పేర్ చోక్ సెట్‌లు లేవు. ఓ కోచ్‌లో సమస్య తలెత్తితే దానికి మరమ్మతు చేసేవరకు మొత్తం రైలును నిలిపివేయాల్సిందే. వారంరోజుల క్రితం విశాఖపట్నం నుంచి ఐదు గంటలు ఆలస్యంగా రావటానికి ఇదే కారణమైంది.
Comments
Please login to add a commentAdd a comment