5 గంటలే..
వ్యవసాయ విద్యుత్ సరఫరాలో కోత
మార్చి నుంచి 9 గంటల విద్యుత్ ఉత్తి మాటే..
ఏడు గంటలు కూడా రావడం లేదంటున్న రైతులు
చేతికందే దశలో ఎండుతున్న పంటలు
నగరంలోనూ కరెంట్ కోతలు
ఈ కింది ఫొటోలో ఎండిన వరిని చూపిస్తున్న రైతు పేరు బొంత నర్సయ్య. లింగాలఘణపురం మండలం కుందారం గ్రామానికి చెందిన ఈయనకు నాలుగు బోర్లు ఉన్నాయి. బోర్లలో నీరు ఉండడంతో మూడు ఎకరాల్లో వరి సాగుచేశాడు. కరెంట్ కోతతో పంట చేతికొచ్చే దశలో వరి ఎండిపోతోంది. మూడు ఎకరాల్లో ఇప్పటికే ఎకరం వరకు ఎండిపోయింది. కరెంట్ ఐదు గంటలే వస్తోంది. లాభం లేదని రూ.52వేలు పెట్టి జనరేటర్ కొనుగోలు చేశాడు. అయినప్పటికీ వరి రోజుకు కొంత ఎండుతూనే ఉంది. వేల రూపాయలు పెట్టుబడులు పెట్టి తీరా.. చేతికొచ్చే దశలో ఎండిపోతుండడంతో లబోదిబోమంటున్నాడు. జనరేట ర్‌తో రాత్రింబవళ్లు నీళ్లు పెడుతూనే ఉన్నాడు. డీజిల్‌కు రోజుకు రూ.1000 ఖర్చు చేస్తున్నాడు. నెల రోజుల ముందే 9 గంటల క రెంట్ ఇస్తే బాగుండేదని నర్సయ్య అంటున్నాడు.
హన్మకొండ :మార్చి నుంచి వ్యవసాయానికి 9 గంటల పాటు పగటి పూట విద్యుత్ సరఫరా చేస్తామని చెప్పిన ప్రభుత్వం చేతులెత్తేసింది. పగలు, రాత్రి పూట కలిపి కూడా ఏడు గంటల విద్యుత్ సరఫరా కావడం లేదు. ప్రస్తుతం వ్యవసాయానికి ఆరు గంటల పాటు విద్యుత్ సరఫరా చేస్తున్నామని ఎన్పీడీసీఎల్ అధికారులు చెపుతున్నా ఆచరణలో మాత్రం కనపడడం లేదు. రోజుకు అయిదు గంటలే ఇస్తున్నారని, అది కూడా సక్రమంగా సరఫరా కావడం లేదని రైతులు అంటున్నారు. ఏడు గంటలు ఇస్తామని చెప్పడంతో తాము నమ్మి వరి పంటను సాగు చేసుకున్నామని, పంటకు చేతికందే ద శలో విద్యుత్ సరఫరా తగ్గించడంతో వేసిన వ రి పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా జనగామ డివిజన్‌లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. విద్యుత్ సరఫరా మెరుగుకు చేపట్టిన పనులు నత్తనడకన సాగుతున్నారుు. జిల్లాలో విద్యుత్ సబ్ స్టేషన్‌ల నిర్మాణం చేపట్టినా అవి పూర్తి కాలేదు. పలు చోట్ల కొత్తగా లైన్లు వేయాలని ప్రతిపాదనలు రూపొందించినా వాటిని పూర్తి చేయలేదు. దీంతో వ్యవసాయానికి 9 గంటల విద్యుత్ సరఫరా చేస్తామని చెప్పిన ప్రభుత్వం మాట ఉత్తదే అని తేలిపోయింది.
నగరంలోనూ కోతలు..
నగరంలోను విద్యుత్ కోతలు విధిస్తున్నారు. నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నామని చెపుతూనే మరమ్మతుల పేరుతో రోజుకు మూడు నుంచి తొమ్మిది గంటల పాటు విద్యుత్ కోతలు విధిస్తున్నారు. ప్రతీరోజు 3 నుంచి 8గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నారు. విద్యుత్ కోతలతో తమకు నష్టం వాటిల్లుతోందని వ్యాపార వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరమ్మతుల పేరుతో కోతలు విధించడంపై వినియోగదారులు మండిపడుతున్నారు.
నాటు వేసిన పొలం ఎండిపోయింది
ఉన్న బోరు కింద రెండు ఎకరాల వరి పొలం నాటు వేశాను. కరెంట్ ఐదు గంటలే రావడంతో రోజుకో మడి చొప్పున రెండు ఎకరాల వరి ఎండిపోయింది. నెల రోజుల క్రితమే అప్పులు చేసి కూతురు పెండ్లి చేసిన. పంటను నమ్ముకుని జీవిస్తున్న నాకు పంట ఎండిపోయి, అప్పులు ఎలా తీర్చాలని దుఖం వస్తున్నది. - పెద్దటి కేశయ్య, బచ్చన్నపేట రైతు
కరెంట్ రాక ఎకరం ఎండింది
బావి వద్ద ఉన్న రెండు బోర్ల కింద రెండు ఎకరాల వరి పొలం నాటు వేశా ను. వరి పొట్టకు వచ్చి ఈనే దశలో ఎకరం పొలం ఎండిపోరుుంది. వ్యవసాయానికి ఏడు గంటలు ఇస్తామని ఆరు గంటలు కూడా ఇస్తలేరు. కేవలం ఐదు గంటల కరెంట్ ఇస్తుండడంతో పొలం ఎండిపోయింది. -భైరి వెంకటేశ్వర్లు, బచ్చన్నపేట