సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సోమవారం నుంచి వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా ప్రారంభమైన నేపథ్యంలో బోర్లకు బిగించిన ఆటోమేటిక్ స్టార్టర్ల తొలగింపు ఎంత ముఖ్యమో బోరు మోటార్లకు డ్రై రన్ ప్రొటెక్టర్లను అమర్చుకోవడం అంతే ముఖ్యమని రైతాంగానికి విద్యుత్‌రంగ నిపుణులు సూచిస్తున్నారు. బోరు బావుల నుంచి 5 నుంచి 6 గంటలపాటే నీళ్లు వస్తున్నాయని, ఆ తర్వాత మళ్లీ వాటిలో భూగర్భ జలాల రీచార్జికి చాలా సమయం పడుతోందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో 24 గంటల విద్యుత్ సరఫరాతో నీళ్లు రాకపోయినా ఖాళీ బోర్లు నిరంతరంగా నడిచే (డ్రై రన్) అవకాశముందని, దీంతో విద్యుత్ వృథాగా ఖర్చు కావడంతోపాటు వేలాది రూపాయలు విలువ చేసే బోరు మోటార్లు కాలిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మార్కెట్లో రూ. ఐదారు వందలకే డ్రై రన్ ప్రొటెక్టర్లు లభిస్తున్నాయని, రైతులందరూ వాటిని బిగించుకోవాలని సూచిస్తున్నారు. బోర్లలో నీరు ఇంకిపోతే వెంటనే డ్రై రన్ ప్రొటెక్టర్లు ఆటోమేటిక్‌గా విద్యుత్ మోటార్లను ఆఫ్ చేస్తాయని చెబుతున్నారు.
కొన్ని రోజుల తర్వాత స్థిరత్వం...
వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా మొదలవడంతో రైతులతోపాటు విద్యుత్ సంస్థలకు కూడా ప్రయోజనం చేకూరుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ పథకం వల్ల తొలుత కొన్ని రోజులపాటు విద్యుత్, భూగర్భ జలాల వినియోగం భారీగా పెరిగే అవకాశముందని .. ఆ తర్వాతి రోజుల్లో 24 గంటల విద్యుత్ సరఫరాపై రైతుల్లో నమ్మకం ఏర్పడుతుందని ప్రముఖ విద్యుత్‌రంగ స్వచ్ఛంద సంస్థ ‘ప్రయాస్ ఎనర్జీ’ప్రతినిధి శ్రీకుమార్ ‘సాక్షి’కి తెలిపారు. సాగునీరు ఎప్పుడు అవసరముంటే అప్పుడే రైతులు విద్యుత్‌ను వినియోగించుకుంటారని, దీంతో విద్యుత్‌తోపాటు భూగర్భ జలాల వృథా వినియోగం తగ్గిపోతుందన్నారు.
ప్రస్తుతం రోజుకు 9 గంటలపాటే విద్యుత్ సరఫరా ఉండటం, మళ్లీ మర్నాటి వరకు విద్యుత్ సరఫరాకు అవకాశం లేకపోవడంతో విద్యుత్ ఉన్నప్పుడే నీటిని తోడుకోవాలనే ఉద్దేశంతో రైతులంతా అవసరమున్నా లేకున్నా బోర్లను అతిగా వినియోగిస్తున్నారని చెప్పారు. 24 గంటల విద్యుత్ సరఫరాతో అవసరమున్న మేరకే బోర్లను వినియోగిస్తారని ఆయన అభిప్రాయపడ్డారు. దీంతో విద్యుత్, భూగర్భ జలాల వినియోగంలో స్థిరత్వం వస్తుందన్నారు. నీటి కొరత ఉన్న ప్రాంతాల్లోని అపార్ట్‌మెంట్లలో నీటి వినియోగాన్ని నియంత్రించేందుకు రోజుకు కొంతసేపు మాత్రమే నీటిని సరఫరా చేస్తారని, దీంతో ఆ అపార్ట్‌మెంట్లలో నివసించే వారంతా అవసరానికి మించిన నీటిని ముందుగానే పట్టుకుని నిల్వ పెట్టుకుంటారని తెలిపారు. అదే నిరంతర నీటి సరఫరా ఉండే అపార్ట్‌మెంట్లలో అవసరమున్నప్పుడు మాత్రమే కుళాయిల ద్వారా నీటిని వాడుకుంటారని ఆయన ఉదాహరణగా పేర్కొన్నారు.
విద్యుత్ లెక్కలు అవసరం...
రాష్ట్రంలో వ్యవసాయానికి సరఫరా చేస్తున్న విద్యుత్‌పై ఇప్పటివరకు లెక్కలు లేవని, 24 గంటల విద్యుత్ సరఫరా అమలవుతున్న నేపథ్యంలో రాష్ట్ర విద్యుత్ వ్యవస్థ స్థితిగతులను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఇకపై కచ్చితమైన గణాంకాలు అవసరం ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో వ్యవసాయానికి విద్యుత్ సరఫరా చేస్తున్న ట్రాన్స్‌ఫార్మర్లకు మీటర్లు బిగించాలని విద్యుత్ సంస్థలకు సూచించారు. అప్పుడే వ్యవసాయ విద్యుత్ వినియోగంపై స్పష్టమైన గణాంకాలు తెలుస్తాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment