24 గంటల విద్యుత్ సరఫరాతో అర్ధరాత్రి, అపరాత్రి పొలాల వెంట తిరిగే పని తప్పింది.. అవసరమున్నప్పుడే మోటార్ ఆన్ చేసుకొనే అవకాశం కలిగింది.. అయితే, భూగర్భ జలాలతోనే అసలు సమస్య వచ్చింది. నీటి మట్టాలు ఇప్పుడే పాతాళానికి పడిపోయాయి. వేసవిలో మరింత పడిపోయే ప్రమాదం నెలకొంది. గతేడాది మే నెలలో జిల్లాలో సగటున 10.85 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోగా, ఈసారి జనవరిలోనే ఆ మేరకు తగ్గిపోయాయి. రానున్న రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందోననే ఆందోళన ఇప్పుడే మొదలైంది.
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: వ్యవసాయానికి నిరంతర విద్యుత్ సరఫరాతో రైతన్నలకు అర్ధరాత్రి నీటి పారకం కష్టా ల నుంచి విముక్తి లభించింది. అయితే రోజురోజుకూ అడుగంటుతున్న భూగర్భ జలాలే ప్రధా న అవరోధంగా మారింది. లోలోతుకు పడిపోయిన నీటిమట్టంతో ఇబ్బందులు తలెత్తుతున్నా యి. తొమ్మిది గంటల విద్యుత్ సరఫరా సమయంలో రైతులు తమ పంటలకు నీళ్లు పారిం చేందుకు పడరాని పాట్లు పడ్డారు. అర్ధరాత్రి వేళ ల్లో పొలాల్లోకి వెళ్లి నీళ్లు పారించుకోవాల్సి వచ్చేది. ప్రస్తుతం నిరంతర కరెంట్ సరఫరాతో రైతులకు ఆ కష్టాల నుంచి విముక్తి లభించినట్లయింది. ఎప్పుడు అవసరమైతే అప్పుడు వెళ్లి బోరు ఆన్ చేసుకునేందుకు వీలుంటోందని రైతులు చెబుతున్నారు. కానీ భూగర్భ జలాలే ప్రధాన అవాంతరంగా మారిందని వాపోతున్నారు.
రోజురోజుకూ పడిపోతున్న భూగర్భ జలమట్టంతో కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. ప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటల పాటు విద్యుత్ సరçఫరా చేయడంతో బాగాలోతులో ఉన్న బోర్లు భూగర్భ జలాలను అధికంగా తోడేస్తున్నా యి. కొన్నిచోట్ల 800 నుంచి వెయ్యి అడుగుల లోతులో కూడా బోర్లు తవ్వుకున్న వారు ఉన్నారు. ఈ బోర్లు 24 గంటలు నడుస్తుండటంతో తక్కువ లోతులో ఉన్న బోర్ల లో నీటి ప్రవాహం తగ్గుతోందని రైతులు చెబుతున్నారు. దీనికితోడు జిల్లాలో భూగర్భ జలాలు పాతాళానికి పడిపోతున్నాయి. ఎండతీవ్రత అధికంగా ఉండే మే నెలలో ఎంత లోతుకు పడిపోతాయో.. 2017 మేలో జిల్లాలో సగటున 10.85 మీటర్ల లోతుకు భూగర్భ జలాలుంటే.. గతనెల (2017 డిసెంబర్)లో జిల్లాలో సగటు భూగర్భ జలమట్టం 10.01 మీటర్ల లోతులో ఉంది. దీన్ని బట్టి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఈ పరిస్థితుల్లో 24గంటల విద్యుత్ సరఫరా ప్రారంభం కావడంతో రైతులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
పెరగనున్న విద్యుత్ వినియోగం..
రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో బోర్లు ఉన్న జిల్లాల్లో నిజామాబాద్ రెండో స్థానంలో ఉంది. ఉమ్మడి జిల్లా పరిధిలో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు 2.41 లక్షల వరకు ఉంటాయి. వ్యవసాయ కనెక్షన్లకు తొమ్మిది గంటలు విద్యుత్ సరఫరా చేస్తున్న సమయంలో రోజుకు సుమా రు పది లక్షల మిలియన్ విద్యుత్ వినియోగమైంది. ఇందులో సుమారు ఆరు మిలియన్ యూనిట్లు వ్యవసాయానికి వినియోగమవుతున్నట్లు ఎన్పీడీసీఎల్ అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పుడు 24 గంటలు విద్యుత్ సరఫరా చేయడంతో సుమారు 14 మిలియన్ యూనిట్లకు వినియోగం పెరిగిందని అధికారులు చెబుతున్నారు. సాధారణ సమయంలో 450 మెగావాట్లు ఉన్న లోడ్, 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తే సుమారు 700 మెగావాట్ల వరకు పెరిగిందని అభిప్రాయపడుతున్నారు.
బోరు మోటారు కాలిపోయింది..
మూడు రోజుల క్రితం పంట పొలంలో బోరు మోటారు ఆన్ చేసి ఊరికి వెళ్లాను. తొందరగా వస్తానని అనుకుంటే కొద్దిగా లేటయ్యింది. నేను వచ్చేసరికి బోరు మోటారు కాలిపోయింది. 24 గంటల కరెంట్‌తో బోరు మోటార్లు కాలిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. ఒకసారి బోరు మోటారు ఆన్ చేస్తే మనం మళ్లీ పొలం వద్దకు వెళ్లి బంద్ చేసే వరకు మోటారు నడుస్తూనే ఉంటుంది. 24 గంటలకు బదులుగా ఒకే విడతలో 10 గంటలు కరెంట్ ఇస్తే బాగుంటుంది. – కుంటనర్సారెడ్డి, రైతు, నల్లవెల్లి, ఇందల్వాయి మండలం
నీళ్లు తొందరగా ఇంకిపోతున్నాయి..
సర్కారు ఇస్తున్న 24 గంటల కరెంట్‌తో భూమిలో ఉన్న నీళ్లు తొందరగా ఇంకిపోతాయి. దీంతో బోరు మోటార్లు తరచూ కాలిపోయే ప్రమాదం ఉంటుంది. 24 గంటల కరెంట్ అవసరం లేదు. పగటి పూట 9 గంటల నాణ్యమైన కరెంట్ సరఫరా చేస్తే రైతులకు ఎంతో బాగుంటుంది. ట్రాన్స్‌ఫార్మర్లపై లోడు తగ్గుతుంది. – పాతకుంట తిరుపతి రెడ్డి, రైతు, నల్లవెల్లి.
ఆనందంగా ఉంది... కానీ..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి 24 గంటల పాటు ఉచిత విద్యుత్‌ను అందించడం ఆనందంగానే ఉంది. కాని మా వ్యవసాయ క్షేత్రాల్లో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. ఇలాంటి సమయంలో 24 గంటల కరెంటు ఒక విధంగా ఇబ్బందికరంగానే ఉంది. పగలనకా, రాత్రనకా బోర్లు నడిపిస్తూనే ఉన్నారు. దీంతో మా బోర్ల నుంచి చుక్క నీళ్లు రావడం లేదు. 24 గంటలకు కరెంటు ఉంటుంది కాబట్టి ఆటో స్టార్టర్లు కూడా తొలగిస్తున్నాము. – చిన్నయ్య, రైతు, శ్రీరాంపూర్, ఆర్మూర్ మండలం
ఏం చేయాలో పాలు పోవడం లేదు..
ఇంతకు ముందు కరెంటు లేక.. నీళ్లు అందక నానా కష్టాలు పడేవాళ్లం. ఇప్పుడు 24 గంటలు కరెంటు ఉన్నప్పటికీ బోర్లు ఎండిపోయి చుక్క నీళ్లు రావడం లేదు. కరెంటుతో పాటు కాలువల ద్వారా ఊళ్లలో చెరువులు, కుంటలు నింపుతూ భూగర్భ జలాలు అభివృద్ధి అయ్యేలా పాలకులు చర్యలు తీసుకుంటే బాగుంటుంది. – రాజన్న, రైతు, శ్రీరాంపూర్, ఆర్మూర్ మండలం
Comments
Please login to add a commentAdd a comment