సాక్షి, అమరావతి: ప్రజా సంకల్పయాత్ర చేస్తున్న ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆక్వా రైతుల కష్టాలపై స్పందించి తాము అధికారంలోకి రాగానే విద్యుత్తు ధరలు తగ్గించి యూనిట్ రూ.1.50కే అందచేస్తామని ప్రకటించటంతో రాష్ట్ర ప్రభుత్వం మేలుకుంది. శనివారం కొందరు ఆక్వా రైతులు, అనుబంధ పరిశ్రమలకు చెందిన వారితో సమావేశమైన సీఎం చంద్రబాబునాయుడు ఈ ఏడాది మాత్రం యూనిట్ విద్యుత్ రూ. 2కే సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పాదయాత్ర సందర్భంగా ప్రతిపక్ష నేత జగన్‌కు ఆక్వా రైతులు తమ కష్టాలను వివరించిన సంగతి తెలిసిందే. తాము అధికారంలోకి రాగానే విద్యుత్తు ధరలు తగ్గించటంతోపాటు కోల్డ్ స్టోరేజీలు, ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పుతామని జగన్ వారికి భరోసా ఇచ్చారు.
ధరల స్థిరీకరణపై హామీ లేదు
ఆక్వా సాగుదారుల ఇబ్బందులపై ప్రతిపక్ష నేత తక్షణమే స్పందించటం, మరోవైపు ఇది ఎన్నికల ఏడాది కావటంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు శనివారం సచివాలయంలో హడావుడిగా సమావేశం నిర్వహించి ఆక్వాకు విద్యుత్తు చార్జీలు తగ్గించనున్నట్లు ప్రకటించారు. అయితే రొయ్యల మార్కెట్ ధర స్థిరీకరణపై నిర్ధిష్టమైన హామీ ఇవ్వలేదు. ఆక్వా ఉత్పత్తుల నాణ్యత నిర్ధారణకు అత్యాధునిక పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని రైతులు కోరారు. ప్రతిపక్ష నేత జగన్ చూపిన చొరవ వల్లే ఆక్వా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ముందుకు వచ్చిందని, ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే సీఎం తాజా ప్రకటన చేసినట్లు కొందరు రైతులు బహిరంగంగానే చర్చించుకోవటం గమనార్హం.
విద్యుత్ సబ్సిడీతో అదనపు భారం
ఆక్వా రంగానికి ఇప్పటికే సబ్సిడీపై విద్యుత్ సరఫరా చేస్తున్నామని, ఇప్పుడు అదనంగా ఇచ్చే సబ్సిడీతో రూ. 350 కోట్లకు పైగా ప్రభుత్వంపై భారం పడుతుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. కోస్తాంధ్రలో ఆక్వా, రాయలసీమలో ఉద్యాన రంగాన్ని ప్రోత్సహిస్తున్నామన్నారు. ఆక్వా రైతులు బాగుండాలనే విద్యుత్ ధరలు తగ్గించామన్నారు. పర్యావరణ పరిరక్షణకు ఆక్వా రైతులు ప్రాధాన్యం ఇవ్వాలని, ఇష్టానుసారంగా యాంటీబయాటిక్స్ వినియోగించడం మంచిది కాదన్నారు. అధికంగా వాడితే ఎగుమతులపై నిషేధం విధించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కాలుష్య నియంత్రణ కోసం జోన్లవారీగా ఆక్వాసాగుకు అనుమతులు ఇస్తామని చెప్పారు. పెట్టుబడి వ్యయాన్ని తగ్గించుకుని ఆక్వా రంగంలో సమస్యల పరిష్కారానికి కమిటీని నియమించుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు.
రిజిస్ట్రేషన్ చేయకుండా సాగు సరికాదని ఆక్వా రైతులతో భేటీ సందర్భంగా సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పేందుకు ముందుకొచ్చే వారికి రైతులు సహకరించినప్పుడే గిట్టుబాటు ధర లభిస్తుందని చెప్పారు. రొయ్యల ఫీడ్ ధరలపై ఉత్పత్తిదారులు, రైతులు కలసి సమస్య పరిష్కరించుకోవాలని స్పష్టం చేశారు. అన్ని ప్రయోజనాలు తానే కల్పిస్తే ఇంట్లోకి వెళ్లి పడుకుంటారని రైతులు, ఎగుమతిదారులను ఉద్దేశించి సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించడంతో సమావేశంలో పాల్గొన్నవారు నొచ్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment