సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వేగంగా పడిపోతున్న భూగర్భ జలమట్టాలు, ప్రాజెక్టుల్లో తగ్గిపోతున్న నిల్వలు.. ప్రమాద ఘంటికలు మోగి స్తున్నాయి. వేసవి పెరుగుతున్న కొద్దీ నీటి కొరత తీవ్రమయ్యే సూచనలు ఆందోళన కలిగిస్తున్నాయి. గతేడాది డిసెంబర్‌తో పోలిస్తే రాష్ట్రంలో ప్రస్తుతం భూగర్భ జలమట్టాలు 2.72 మీటర్ల మేర లోతుకు పడిపోయాయి. శ్రీశైలం ప్రాజెక్టులోనిల్వలు ఇప్పటికే డెడ్ స్టోరేజీకి చేరగా.. నాగార్జునసాగర్‌లో మరికొద్ది రోజుల్లోనే నీటి నిల్వ కనీస మట్టానికి తగ్గిపోనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో సాగునీటికే కాదు.. గుక్కెడు తాగునీటికీ కటకట ఏర్పడే పరిస్థితి ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
పాతాళానికి భూగర్భ జలాలు
రాష్ట్రంలో భూగర్భ జల మట్టం వేగంగా పడిపోతోంది. యాసంగి పంటల సాగు, వేసవి ఉధృతి పెరగడంతో నీటి మట్టం వేగంగా తగ్గుతోంది. వ్యవసాయానికి నిరంతర విద్యుత్ సరఫరాకు ముందు (డిసెంబర్ నాటికి) రాష్ట్రంలో సగటు భూగర్భ జల మట్టం 9.18 మీటర్లుగా ఉండగా.. ఇప్పుడు అది 11.90 మీటర్ల లోతుకు పడిపోయింది. మూడు నెలల వ్యవధిలోనే ఏకంగా 2.72 మీటర్ల మేర తగ్గిపోవడం ఆందోళనకరం. ఇక గతేడాది మార్చి నెలలో నమోదైన రాష్ట్ర సగటు భూగర్భ జలమట్టం 10.96 మీటర్లతో పోల్చినా.. ఈసారి 0.94 మీటర్ల మేర తగ్గిపోవడం గమనార్హం. గతేడాదితో పోలిస్తే అత్యధికంగా మెదక్ జిల్లాలో.. 4.12 మీటర్లు, సిరిసిల్లలో 3.53, పెద్దపల్లి 3.43, నిజామాబాద్ 3.93 మీటర్ల మేర మట్టాలు పడిపోయాయి. మున్ముందు భూగర్భ జలాలు మరింతగా తగ్గిపోయే ప్రమాదం కనిపిస్తోంది. భూగర్భ జలాలు తగ్గి తాగు, సాగునీటికి ఇప్పటికే ఇక్కట్లు మొదలైన నేపథ్యంలో.. అటు ప్రధాన ప్రాజెక్టుల్లోనూ నీటిమట్టాలు వేగంగా తగ్గిపోవడం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది.
సాగర్‌లోనూ అదే దుస్థితి..
నాగార్జున సాగర్‌లోనూ నీటిమట్టాలు వేగంగా పడిపోతున్నాయి. ప్రస్తుతం సాగర్లో 513.4 అడుగుల వద్ద 137.52 టీఎంసీల నీటి లభ్యత ఉంది. ఇందులో కనీస నీటిమట్టం 510 అడుగులకు పైన వినియోగార్హమైన నీరు కేవలం 5.8 టీఎంసీలే. ప్రస్తుతం రోజుకు 1,600 క్యూసెక్కుల మేర నీటిని ఇరు రాష్ట్రాలు తమ అవసరాలకు తీసుకుంటున్నాయి. కృష్ణా బోర్డు చెబుతున్న లెక్కల ప్రకారం.. సాగర్‌లో 500 అడుగుల వరకు నీటిని తీసుకునే వెసులుబాటు ఉంది. ఇలా చూసినా మొత్తంగా లభ్యత జలాలు 12.84 టీఎంసీలు మాత్రమే. ఈ నీటిలో తెలంగాణకు 7.84 టీఎంసీలు, ఏపీకి 5 టీఎంసీలు దక్కుతాయని అంచనా. వర్షాలు సమృద్ధిగా కురిసే వరకు ఈ నీటినే సాగు, తాగు అవసరాలకు వినియోగించుకోవాల్సి ఉండనుంది. కృష్ణా బేసిన్‌లో ఆగస్టు, సెప్టెంబర్ నాటికి కూడా ప్రవాహాలు వచ్చే పరిస్థితి ఉండదు. ఈ నేపథ్యంలో మే తర్వాత నీటి కష్టాలు తీవ్రమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
రెండు మూడు రోజుల్లో శ్రీశైలం ఖాళీ!
శ్రీశైలం ప్రాజెక్టు రెండు మూడు రోజుల్లో ఖాళీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. శ్రీశైలం కనీస నీటిమట్టం 834 అడుగులే అయినా.. 800 అడు గుల డెడ్ స్టోరేజీ వరకు ఉన్న నీటిని కూడా కృష్ణా బోర్డు తెలంగాణ, ఏపీలకు పంచేసిం ది. ప్రస్తుతం శ్రీశైలంలో నీటిమట్టం 803.2 అడుగులకు చేరింది. బుధవారం పవర్‌హౌజ్‌ల ద్వారా 2,797 క్యూసెక్కుల మేర నీటి వినియోగం జరిగింది. ఇలాగే కొనసాగితే రెండు మూడు రోజుల్లోనే నీటిమట్టం 800 అడుగులకు చేరనుంది. ఆ తర్వాత నీటిని తీసుకోవాలంటే కష్టమే. కృష్ణాబోర్డు అనుమతించినా.. మరో 2 నుంచి 3 టీఎంసీలకు మించి తీసుకునే అవకాశం లేదు. దాంతో నాగార్జునసాగర్‌లోని నీటిపైనే ఆధారపడాల్సి ఉండనుంది.
టెలిమెట్రీ బాధ్యత సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌కు..
నాగార్జున సాగర్, శ్రీశైలం, జూరాల, పులిచింతల తదితర ప్రాజెక్టుల పరిధిలో 42 చోట్ల టెలిమెట్రీ పరికరాల ఏర్పాటు బాధ్యతను సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్‌కు అప్పగిస్తూ కృష్ణా బోర్డు నిర్ణయం తీసుకుంది. ఇందులో మొదటి విడతలో ఇప్పటికే గుర్తించిన 18 ప్రాంతాల్లో మూడు చోట్ల మినహా.. మిగతా చోట్ల మళ్లీ కొత్త వాటిని అమర్చే బాధ్యతను కట్టబెట్టింది. దీంతోపాటు హంద్రీనీవా, పోతిరెడ్డిపాడు, బంకచర్ల తదితర చోట్ల కూడా కొత్త పరికరాలను ఏర్పాటు చేయాలని సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment