* అవసరమైనప్పుడు విద్యుదుత్పత్తి చేపడుతున్న తెలంగాణ సర్కారు
* ఎక్కువనీటిని వాడుతున్నారని కృష్ణాబోర్డుకు వివరాలిస్తున్న ఏపీ
* ఈ నెల 1 నుంచి బుధవారం వరకు 4.56 టీఎంసీల నీటి వినియోగం..
* 21.23 మి.యూ. విద్యుదుత్పత్తి
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి అంశంపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య పేచీ కొనసాగుతోంది. ఐదు రోజుల పాటు విరామం ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం గత నాలుగు రోజు లుగా ఇక్కడ విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. మరోవైపు.. కృష్ణా బోర్డు సూచించిన నీటి కంటే తెలంగాణ ఎక్కువగా వాడుకుంటోందంటూ ఏపీ ప్రభుత్వం ఏరోజుకారోజు బోర్డుకు సమాచారం అందిస్తోంది. తాము అవసరం మేరకే శ్రీశైలంలో విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నామని తెలంగాణ జెన్‌కో చెబుతోంది. నవంబర్ ఒకటి నుంచి బుధవారం వరకు శ్రీశైలం ప్రాజెక్టు ఎడమ గట్టున 21.23 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరిగింది. దీనికి ఇప్పటివరకు 4.56 టీఎంసీల నీటిని వాడుకున్నామని... ఆందోళనకర స్థాయికి జలాశయంలో నీటి మట్టమేమీ పడిపోలేదని టీ జెన్‌కో వర్గాలు స్పష్టం చేశాయి.
ఇక శ్రీశైలంలో మంగళవారం 4.18, బుధవారం ఉదయం వరకు 1.06 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి చేశారు. గురువారం కూడా ప్రాజెక్టులో స్వల్పంగా ఉత్పత్తి కొనసాగింది. ప్రస్తుతం శ్రీశైలంలో 857 అడుగుల నీటిమట్టం ఉంది. నవంబర్ 2వరకూ మూడు టీఎంసీల నీటిని మాత్రమే తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తికి వాడుకోవాలని గత నెల 31న కృష్ణా బోర్డు ఉత్తర్వులు జారీచేసిన విషయం తెలిసిందే. 15 రోజుల తర్వాత మరోసారి బోర్డు సమావేశం ఏర్పాటు చేసి సమీక్షిస్తామని పేర్కొంది. ఆ గడువు కూడా సమీపించిన నేపథ్యంలో... బోర్డు తదుపరి సమావేశం నిర్వహిస్తుందా..? లేదా? అన్న దానిపై సందిగ్ధత కొనసాగుతోంది.
శ్రీశైలంపై కొనసాగుతున్న పేచీ!
Published Thu, Nov 13 2014 3:09 AM | Last Updated on Tue, Sep 18 2018 8:38 PM
Advertisement