తాటికొండ(స్టేషన్‌ఘన్‌పూర్) : కరెంట్ కోతలు ఓ రైతును కాటేశారుు. అతడు గత ఏడాది సాగు చేసిన పంటలు చేతికొచ్చే దశలో వడగండ్లతో నాశనం కాగా, ఈసారి కరెంటు కోతలతో ఎండిపోయూరుు. దీంతో పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పులను తీర్చే మార్గం లేకపోవడంతో మనోవేదనకు గురైన యువరైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మండలంలోని తాటికొండలో బుధవారం రాత్రి జరిగింది. మృతుడి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఎడమ పెద్దాపురం, సుజాత దంపతులకు ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు.
చిన్నకుమారుడు చదువుకుంటుండగా పెద్దకుమారుడు సాంబరాజు(27) వ్యవసాయం చేస్తున్నాడు. వారికి గ్రామంలో రెండు ఎకరాల పొలం ఉండగా గత ఏడాది ఐదెకరాలు కౌలుకు తీసుకున్నారు. అప్పట్లో రూ.3 లక్షలు అప్పు చేసి వరి, పత్తి, మిర్చి, మక్క పంటలు సాగు చేశాడు. పంటలు ఏపుగా పెరగడంతో చేసిన అప్పులు తీరుతాయని ఆశించాడు. మరో నెల రోజుల్లో పంట చేతికి వస్తుందనుకుంటున్న తరుణంలో ఒక్కసారిగా వడగండ్లుపడి పంటంతా నాశనమైంది.
ఈ ఏడాది మరో రూ.లక్ష అప్పు చేసి రెండెకరాల్లో వరి, మరో రెండు ఎకరాల్లో పత్తి, మిర్చి, మక్క వేశాడు. ఇటీవల కురిసిన వర్షాలకు తోడు గత 15 రోజుల వరకు కరెంటు బాగానే ఉండడంతో కొంత అప్పు తీర్చవచ్చని ఆశించారు. కానీ కరెంటు కోతలు మొద లు కావడంతో పంటలు ఎండిపోయే దశకు చేరుకున్నాయి. ఈ క్రమంలోనే గురువారం పంటలపై పిచికారీ చేసేందుకు క్రిమిసంహారక మందు తెచ్చాడు.
బుధవారం రాత్రి కరెంట్ పోవడంతో అతడి తల్లిదండ్రులతోపాటు భార్య ఆరుబయట కూర్చుని ఉండగా.. అతడు మరో రెండు రోజులు కరెంట్ ఇలాగేపోతే పంట పూర్తి ఎండుతుందని మనోవేదనకు గురై క్రిమిసంహారక మందు తాగి పడిపోయూడు. రాత్రి 10 గంటల ప్రాంతంలో కరెంట్ వచ్చాక ఇంట్లోకి వెళ్లిన కుటుంబ సభ్యులకు సాంబరాజు కిందపడి కనిపించాడు. నోట్లో నుంచి నురగలు రావడం, పక్కనే పురుగుల మందు డబ్బాను గమనించి బోరున విలపిస్తూ స్థానికుల సాయంతో ఆర్‌ఎంపీ వద్ద కు తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు.
మేము బయటకు వెళ్లకున్నా బతికేటోనివి బిడ్డా..
అన్నం తిన్నంక మేము బయటకు పోకున్నా బతికెటోనివి బిడ్డా.. ఈ కరంటు పాడుగాను నీ చావుకు వచ్చిందా బిడ్డా.. అంటూ తల్లి సుజాత గుండెలు బాదుకుంటూ రోదించిన తీరు చూసి స్థానికులు కన్నీటిపర్యంతమయ్యూరు.
పొలం కాడికి తప్ప ఎక్కడికి పోయేటోడు కాదు
పొలంకాడికి తప్ప తన కొడుకు ఎక్కడికి పోయెటోడు కాదని మృతుడి తండ్రి పెద్దాపురం తెలిపారు. రోజు పొలంకాడికి ఎందుకురా బిడ్డా.. నేను పనిచేస్తానన్నా వినకపోయేదని గుర్తు చేస్తూ గుండెలవిసేలా రోదించాడు.
రైతును కాటేసిన కరెంట్ కోతలు
Published Fri, Oct 17 2014 3:39 AM | Last Updated on Sat, Sep 2 2017 2:57 PM
Advertisement
Advertisement