సాక్షి, అనంతపురం : జిల్లా వ్యాప్తంగా కరెంటు కోతలు తీవ్రమయ్యాయి. కరెంటు ఎప్పుడొస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి. దీంతో జనం అల్లాడిపోతున్నారు. ముఖ్యంగా చంటి పిల్లలు, వృద్ధుల పరిస్థితి దయనీయంగా మారింది.
జిల్లా కేంద్రంతో పాటు, పట్టణాలు, మండల కేంద్రాలు, గ్రామాల వారీగా కరెంటు కోతల వేళలను సదరన్ పవర్ డిస్ట్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎస్‌పీడీసీఎల్) అధికారులు వేసవి ఆరంభం నుంచి ఇప్పటి వరకు రెండు సార్లు ప్రకటించారు. అనంతపురం నగరంలో రెండు గంటలు, మునిసిపాలిటీలలో నాలుగు, మండల కేంద్రాల్లో ఆరు, గ్రామీణ ప్రాంతాల్లో ఎనిమిది గంటల చొప్పున కోత ఉంటుందని తొలుత ప్రకటించారు. ఆ తర్వాత వేసవిలో వినియోగం పెరగడం, రాష్ట్ర విభజన వంటి కారణాలతో కోతల వేళల్లో మార్పు చేశారు.
పస్తుతం నగరంలో నాలుగు గంటలు, పట్టణాల్లో ఆరు, మండల కేంద్రాల్లో ఎనిమిది గంటల చొప్పున అధికారిక కోతలు ఉన్నాయి. అయితే.. నెల రోజులుగా ప్రకటిత కోతల వేళలు పూర్తిగా మారిపోయాయి. ఎప్పుడు పడితే అప్పుడు కరెంటు తీసేస్తున్నారు. ఎమర్జెన్సీ లోడ్ రిలీఫ్ (ఈఎల్ ఆర్) కింద హైదరాబాద్ నుంచే నేరుగా కోత పెడుతున్నారని, తాము నిమిత్తమాత్రులమని జిల్లా అధికారులు అంటున్నారు. జిల్లా కేంద్రంలో శుక్రవారం ఒక్కరోజే నాలుగు సార్లు కోత విధించారు. ఇక పట్టణాలు, గ్రామాల్లో పరిస్థితి చెప్పక్కరలేదు. పది రోజులుగా జిల్లాలో అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి. అయినా ఉక్కపోత తగ్గడం లేదు. దీనికితోడు కరెంటు లేకపోవడంతో జనం అల్లాడిపోతున్నారు. రాత్రిళ్లు దోమల బెడద కంటిమీద కనుకు లేకుండా చేస్తోంది. పరిశ్రమల్లో ఉత్పత్తికి తరచూ ఆటంకం కలుగుతుండడంతో పారిశ్రామికవేత్తలు లబోదిబోమంటున్నారు.
పెరిగిపోతున్న డిమాండ్
జిల్లాకు ప్రస్తుతం 14.5 మిలియన్ యూనిట్ల కరెంటు అవసరం. పంపిణీ సంస్థ నుంచి మాత్రం 11 మిలియన్ యూనిట్లే వస్తోంది. 3.5 మిలియన్ యూనిట్ల లోటు కొనసాగుతోంది. సరఫరాకు, డిమాండ్‌కు మధ్య వ్యత్యాసం కారణంగా హైదరాబాద్ నుంచే నేరుగా 220 కేవీ సబ్‌స్టేషన్ల నుంచి వెళ్లే 133 సబ్‌స్టేషన్ల లైన్లకు కరెంటు సరఫరా నిలిపేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.
జిల్లాలో వ్యవసాయానికి సరఫరా తగ్గినా కోతలు పెరగటానికి కారణమేమిటన్న ప్రశ్న తలెత్తడం సహజం. కానీ జిల్లాలో పండ్లతోటలు విస్తారంగా సాగులో ఉండడం, కొన్ని పంటలు దిగుబడి స్థాయిలో ఉండడం వల్ల వంద శాతం కరెంటు మళ్లించటానికి వీలు కావడం లేదని అధికారులు చెబుతున్నారు. దీంతో కోతలు తప్పడం లేదని అంటున్నారు. ఇన్వర్టర్ల వాడకం పెరగడం కూడా కరెంటు సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతోందని అధికారులు చెబుతున్నారు. ఇన్వర్టర్లు ఒకేసారి లోడు అవుతుండడంతో ఆ భారం సబ్‌స్టేషన్లపై పడుతోందని, తరచూ లైన్లు ట్రిప్ అవుతున్నాయని అంటున్నారు.
కరెంట్ కట్ కటా!
Published Sat, Jun 7 2014 2:07 AM | Last Updated on Fri, Jun 1 2018 8:47 PM
Advertisement