వేళాపాళా లేని కరెంట్ కోతలు
♦ రోజుకు 15 లక్షల యూనిట్లుకు పెరిగిన వినియోగం
♦ తరచూ సరఫరాలో అంతరాయం
♦ ఇబ్బందులు పడుతున్న వినియోగదారులు
నెల్లూరు (టౌన్) : గృహ అవసరాలకు నిరంతరం (24 గంటలు) విద్యుత్ సరఫరా ఇస్తున్నామని ప్రభుత్వ పాలకులు గొప్పలు చెబుతున్నారు. అయితే నెల్లూరు నగరంతో పాటు మున్సిపాలిటీల్లో రోజుకు గంటల తరబడి మధ్య మధ్యలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది. పల్లెల్లో అయితే కరెంట్ పోతే ఎన్ని గంటలకు వస్తుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. అనధికార కోతలతో వినియోగదారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. గత రెండు వారాలుగా పెరిగిన ఎండలు చూస్తే మళ్లీ ఎండాకాలం వచ్చినట్లుగా ఉంది. ఉష్ణోగ్రతలు కూడా 40 డిగ్రీలకు పైగా నమోదవుతుంది.
దీనికి తోడు జిల్లాలో ఖరీఫ్ సీజన్ కూడా ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో విద్యుత్ వినియోగం అనూహ్యంగా పెరిగింది. విద్యుత్ డిమాండ్ పెరగడంతో సరఫరాలో తరచూ అంతరాయం ఏర్పడుతుంది. పగలు, రాత్రి అనే తేడా లేకుండా కరెంట్ పోతుండటంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమాచారం తెలుసుకుందామన్న అధికారుల నుంచి స్పందన కరువుతుందని వాపోతున్నారు. మంగ ళవారం మినీబైపాస్‌లోని టీడీపీ ఆఫీసు, మరి కొన్ని ప్రాంతాల్లో మధ్యాహ్నం నుంచి రాత్రి 9 గంటల వరకు, రామ్మూర్తినగర్, బాలాజీనగర్, రామలింగాపురం ప్రాంతాల్లో రాత్రి మొత్తంలో 2 గంటలు మాత్రమే సరఫరా ఉంది.
పెరిగిన వినియోగం
జిల్లాలో మొత్తం 12 లక్షలకు పైగా విద్యుత్ సర్వీసులు ఉన్నాయి. జిల్లాకు రోజుకు 1.26 కోట్లు యూనిట్లును కోటాగా నిర్ణయించినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే డిమాండ్ మాత్రం 1.40 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా. ప్రస్తుతం రోజుకు 1.25 కోట్లు వినియోగం జరుగుతున్నట్లు అధికార వర్గాలు లెక్కలు చెబుతున్నారు. సరఫరా, వినియోగానికి మధ్యలో తేడా ఉండటంతో తరచూ అంతరాయం ఏర్పడుతుంది. సరఫరాలో 50 శాతం వినియోగం వ్యవసాయానికి అవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. వినియోగానికి తగ్గ సరఫరా లేకపోవడంతో అధికారులు అనధికార కోతలు విధిస్తున్నారు. ఈ విషయంపై విద్యుత్ శాఖ టెక్నికల్ డీఈ వెంకటేశ్వరరావును సాక్షి సంప్రదించగా జిల్లాలో ఈఎల్‌ఆర్ లేదన్నారు. మరమ్మతులకు గురైనప్పుడు మాత్రమే సరఫరా నిలిపివేస్తున్నామన్నారు.