కూర ‘గాయాల’ సాగు | Vegetable cultivation | Sakshi
Sakshi News home page

కూర ‘గాయాల’ సాగు

Published Sun, Jan 18 2015 4:45 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM

కూర ‘గాయాల’ సాగు - Sakshi

కూర ‘గాయాల’ సాగు

వరంగల్ : రైతులకు ఆర్థికంగా చేదోడుగా నిలిచిన కూరగాయల సాగు ఇప్పుడు భారంగా మారుతోంది. వర్షాభావ పరిస్థితులు, కరెంట్ కోతలు, పెట్టుబడి పెరగడంతో రైతులకు కనీస లాభదాయకంగా లేక ఈ సాగుకు దూరమవుతున్నారు. తక్కువ భూమి, మార్కెట్ అందుబాటులో ఉన్న నగర పరిసర గ్రామాల రైతుల్లో ఇప్పుడు కూరగాయ పంటల సాగుపై ఆసక్తి సన్నగిల్లుతోంది. రోజువారీ ఆదాయం లభిస్తుందనే ఆశతో రెండు దశాబ్దాలుగా ఈ సాగును నమ్ముకున్న రైతులు క్రమంగా దూరమవుతున్నారు.

కూరగాయల సాగు పూర్తిగా బోర్లు, బావులపైన్నే ఆధారపడి సాగుతోంది. వేళాపాలాలేని విద్యుత్‌కోతలు, భూగర్భ జలాల సమస్యతోపాటు పెట్టుబడికి తగిన గిట్టుబాటు లేక పోవడంతో రైతుల్లో క్రమంగా మోజు తగ్గింది. నిన్నమొన్నటి వరకు కూరగాయలపైనే ఆధారపడిన రైతులు సైతం క్రమంగా దూరమవుతున్నారు. డిమాండ్‌కు తగిన స్థాయిలో కూరగాయల ఉత్పత్తి లేకపోవడం, దళారీల కారణంగా ధరలు పెరుగుతున్నాయి. ప్రజావసరాలు తీర్చేందుకు దూర ప్రాంతాల నుంచి కూరగాయాలను దిగుమతి చేసుకుంటున్నారు. దీనివల్ల రవాణా చార్జీల భారం, కమీషన్లు తడిసి మోపెడవుతున్నాయి.
 
తగ్గిన సాగు
ఖిలావరంగల్, కరీమాబాద్, న్యూశాయంపేట ప్రాంతాల్లో కూరగాయల సాగు పెద్ద విస్తీర్ణంలో సాగేది. నగరం చుట్టూ 20 కిలోమీటర్ల పరిధిలో ఉన్న హన్మకొండ, వర్ధన్నపేట, సంగెం, గీసుకొండ, ఆత్మకూరు, నర్సంపేట, ధర్మసాగర్ మండలాల పరిధిలోని గ్రామాల్లో కూరగాయల సాగుపైనే ఆధారపడే వారు. ఎక్కడ చూసినా కూరగాయల తోటలే కన్పించేవి. చిన్న, సన్నకారు రైతులు తమకున్న తక్కువ భూమిలోనే సాగు చేసేవారు... ఇంటిల్లిపాది శ్రమించేవారు. వేలాది మంది ఇదే ప్రధాన ఆదాయంగా ఎంచుకునేవారు.  

సీజన్‌వారీగా అన్ని రకాల ఆకుకూరలు, కాయగూరలతో పాటు ఉల్లి, కొత్తిమీర, పచ్చిమిర్చి పండించే వారు. వరంగల్ లక్ష్మీపురంలోని పెద్ద మార్కెట్ దగ్గర ఉండం, సానుకూల రవాణా వసతి కారణంగా కూరగాయల సాగు చేపట్టేవారు. రోజువారీ ఆదాయాన్ని తమ కుటుంబాల అభివృద్ధికి వినియోగించేవారు. ఇటీవల ఈ గ్రామాల్లో పరిస్థితి మారింది. ఈ సాగు లాభసాటిగా  లేకపోవడంతో ఇతరత్రా పనులవైపు మొగ్గు చూపుతున్నారు. కూరగాయాల సాగుకు సస్యరక్షణ సమస్యలు అడ్డుగా నిలుస్తాయి.

విత్తనాలు, పురుగుల మందులు, ఎరువుల ధరలు రెట్టింపు పెరిగాయి. ఇంతచేస్తే పంట చేతికొచ్చే సమయానికి మార్కెట్‌లో ధర లేకపోవడంతో పూర్తిగా నష్టపోతున్నారు. చేతికొచ్చిన పంటలను ధరవచ్చే వరకు నిల్వ చేసుకునే అవకాశం లేకపోవడంతో ఒక్కోసారి పంటను పెంటపాలు చేయాల్సి వస్తోంది. పెట్టుబడి కూడా చేతికి రాకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ కారణంగా మొక్కజొన్న, పత్తి, పొద్దుతిరుగుడు వాణిజ్యపంటవైపు దృష్టిసారిస్తున్నారు.
 
తగ్గిన దిగుబడులు
వరంగల్ లక్ష్మీపురంలోని మార్కెట్‌లో 400 మంది హోల్‌సేల్, 600 మంది రిటైల్ వ్యాపారులు లావాదేవీలు సాగిస్తున్నారు. క్రమం తప్పకుండా వ్యాపారం చేసే వారు సగం మాత్రమే ఉంటారు. మరో  200 మంది చిరువ్యాపారులు రోడ్డుపై అమ్మకాలు సాగిస్తున్నారు. రైతుల నుంచి కమీషన్ పద్ధతిలో సరుకులు తీసుకుని వ్యాపారం చేస్తున్నారు. క్వింటాల్‌కు రూ. 4శాతం నుంచి 6శాతం క మీషన్ వసూలు చేస్తున్నారు.

మంచి సీజన్‌లో ఈ మార్కెట్‌కు ఆకుకూరలు, కూరగాయలు కలిపి 1200 నుంచి 1500 క్వింటాళ్ల సరుకు వచ్చేది. ప్రస్తుతం సరుకు రాక తగ్గుతోంది. ఈ కారణంగా ఒక్కసారిగా ధరలకు రెక్కలొచ్చాయి. దీనికి తోడు సరుకు చేతులు మారి వినియోగదారుడి వద్దకు చేరే సరికి ధర రెట్టింపవుతోంది. సీజన్‌లో రూ. 20 నుంచి 25లక్షల టర్నోవర్ ఉంటుంది. ప్రస్తుతం టర్నోవర్ తగ్గిపోయింది.
 
పెరిగిన దిగుమతులు
జిల్లా నుంచి కూరగాయల రాక తగ్గడంతో ఇతర జిల్లాల నుంచి దిగుమతి చేసుకుంటున్నందున రవాణాచార్జీలు, శ్రమ కలిసి ధర పెరుగుతోంది. చిత్తూరు జిల్లా మదనపల్లి, అనంతపురం, కర్నూలు, చింతామణి, ఆదిలాబాద్ జిల్లా ధనోరా, కరీంనగర్ రైతుబాజర్, సిద్ధిపేట, ఒంటిమామిడిపల్లి ప్రాంతాల నుంచి టమాట, బీరకాయ, పచ్చిమిర్చి, కందలు తీసుకొస్తున్నారు. రోజుకు ఈ ప్రాంతాల నుంచి 150 నుంచి 200 క్వింటాళ్ల టమాట దిగుమతి చేసుకుంటున్నారు. స్థానికంగా 20 శాతం సరుకు మాత్రమే వస్తున్నది. మిగిలిన ప్రాంతాల నుంచి 80శాతం దిగుమతి చేసుకుంటున్నారు. ఈ కారణంగా ధరలు పెరిగి జనం బేజారవుతున్నారు.
 
ధరల భారం
కూరగాయల ధరలు బాగా పెరిగాయి. మండుతున్న కూరగాయల ధరలతో పాటే సామాన్యుని గుండె మండుతోంది. చేతినిండా డబ్బు తీసుకపోయినా చేయి సంచి నిండని పరిస్థితి  నెలకొంది. నగరంలోని లక్షలాది మందితో పాటు జిల్లాలోని డివిజన్, మండల కేంద్రాలకు సైతం వరంగల్ ప్రధాన మార్కెట్ నుంచే వ్యాపారులు, వినియోగదారులు కొనుగోలు చేస్తారు. ఇక్కడ హోల్‌సేల్‌తో పాటు రిటేల్ వ్యాపారం సాగుతోంది. రైతుల చేతిలున్నపుడు ధర లభించడంలేదు. దళారీల పాత్ర వల్ల ధరలు బాగా పెరుగుతున్నాయి. క్రమంగా సాగు తగ్గి ధరలు పెరుగుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement