కరువుఛాయలు | Shadows of drought | Sakshi
Sakshi News home page

కరువుఛాయలు

Published Tue, Jul 8 2014 3:50 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM

కరువుఛాయలు - Sakshi

కరువుఛాయలు

- జిల్లాలో జాడలేని వానలు
- దుక్కులు దున్ని దిక్కులు చూస్తూ రైతులు
- ఇరవై శాతం మించని సాగు
- అదును దాటుతోందని అన్నదాతల ఆందోళన

 కరీంనగర్ అగ్రికల్చర్ : కార్తెలన్నీ కరిగిపోతున్నాయే తప్ప.. వరుణుడు మాత్రం కరుణించడం లేదు. బోర్లు, బావుల్లో నీళ్లున్న రైతులు కాస్తాకూస్తో సాగు చేసినా.. కరెంట్ కోతలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఎప్పుడు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియని కరెంట్‌తో వేసిన పంటలు కాస్తా ఎండిపోతున్నాయి. వర్షాలు లేక.. కరెంట్ ఉత్పత్తి తగ్గిపోయిందని, ఇందులో తామేమీ చేయలేమని విద్యుత్ అధికారులు చేతులెత్తేయడంతో రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది.

కాలువల కింది రైతులు కూడా ఈసారి నీటి విడుదల ఉంటుందో.. లేదోనని అయోమయానికి గురవుతున్నారు. జిల్లాలో సాధారణ వర్షపాతం (ఇప్పటివరకు) 194 మిల్లీమీటర్లు కాగా.. గతేడాది 208.4 మిల్లీమీటర్లుగా నమోదైంది. ఈ సంవత్సరం మాత్రం 83.6 మిల్లీమీటర్లకు మించలేదు. అంటే.. 57 శాతం లోటు ఏర్పడింది.

 గ్రామాల్లో కప్పతల్లి ఆడుతున్నా.. ముక్కోటి దేవుళ్లకు మొక్కుతున్నా చినుకు జాడే కరువైంది. రోజూ కారుమబ్బులు కమ్ముకుంటున్నా.. రైతన్నల ఆశలతో దోబూచులాడుతున్నాయి. వెరసి అన్నదాతలను కలవరపెడుతున్నాయి. ఖరీఫ్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు జిల్లాలో ఎక్కడా ఆశించిన వర్షం కురవలేదు. మరోవైపు అదునుదాటుతోంది. ఈ క్రమంలో రెండుమూడు భారీ వర్షాలు కురిస్తే తప్ప రైతులు ముందుకు కదలడం కష్టంగా ఉంది.
 
రోహిణి, మృ గశిర, ఆరుద్ర కార్తెలు ముగిశాయి. ఆదివారం నుంచి పునర్వసు మొదలైంది. ఈ కార్తెలో కాలం పోతే పత్తి, వరి సాగు కష్టమేనని రైతులు పేర్కొంటున్నారు. అదును దాటితే ఆరుతడి పంటలే మేలని వ్యవసాయశాఖ అధికారులు, శాస్త్రవేత్తలు సూచిస్తుండటం కరువుకు అద్దం పడుతోంది. ఇప్పటికే ఆరుతడి విత్తనాల కోసం ప్రభుత్వ ఆమోదానికి జిల్లా అధికారులు నివేదికలు పంపించారు. జిల్లావ్యాప్తంగా జూన్ నుంచి ఇప్పటివరకు సాధారణ వర్షపాతం 194 మిల్లీమీటర్లు కాగా.. రెండు మండలాల్లోనే సాధారణ వర్షపాతం నమోదైంది. 28 మండలాల్లో లోటు, 27 మండలాల్లో అత్యల్ప

వర్షపాతం నమోదైంది.
జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం 5,18,349 హెక్టార్లు కాగా ఇప్పటివరకు కేవలం 20 శాతం మాత్రమే పంటలు సాగయ్యాయి. ఓవైపు ఎండలు.. మరోవైపు జాడలేని వర్షాలు.. వీటికితోడు కరెంట్ కోతలు.. వెరసి ఖరీఫ్ సాగును ఆగమ్యగోచరంగా మార్చింది. పత్తి మొక్కలు మొలిచి ఎండిపోతుండటంతో వాటిని బతికించుకునేందుకు రైతులు నానాపాట్లు పడుతున్నారు.

పంటను కాపాడుకునేందుకు కూలీలతో నీరు పోయిస్తున్నారు. ఈనెల 4న 29 మండలాల్లో సగటున 4.3 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. 5న 44 మండలాల్లో 9.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది ఒక మోస్తరు వర్షంగానే వ్యవసాయాధికారులు చెబుతున్నారు. ఈ వర్షాలు రైతులకు కొంత ఊరటనిచ్చాయని పేర్కొంటున్నారు.
 
గడ్డుకాలం..
దాదాపు జూన్‌లోనే 50 శాతం విస్తీర్ణంలో సాగు చేయటం ఆనవాయితీ. ప్రస్తుతం పరిస్థితి అందుకు భిన్నంగా మారింది. వ్యవసాయ శాఖ రికార్డులు ప్రకారం కూడా సాగు నామమాత్రంగానే ఉంది. గతేడాది 5,61,049 హెక్టార్లలో వివిధ పంటలు సాగు చేయగా.. ఈ సమయం వరకు నాలుగు లక్షల హెక్టార్లలో సాగులో ఉన్నాయి.

ఈ ఏడాది ఇప్పటివరకు కేవలం 1,03,072 హెక్టార్లకే పరిమితమైంది. బోర్లు, బావుల్లో నీరున్న రైతులు 1071 హెక్టార్లలో వరి నార్లు పోవారు. 68,536 హెక్టార్లలో పత్తి విత్తనాలు నాటారు. మరో 20 వేల హెక్టార్లలో మొక్కజొన్న సాగు చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ రికార్డులు చెబుతున్నాయి. జూలై 15 వరకు వర్షాలు రాకుంటే మూడు దశల్లో విత్తనాలు నాటి పంటలు సాగు చేసేందుకు అధికారులు ప్రత్యామ్నాయ ప్రణాళిక రూపకల్పనలో తుదిమెరుగులు దిద్దుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement