చీకటి బతుకులు | Employment of laid-off workers | Sakshi
Sakshi News home page

చీకటి బతుకులు

Published Thu, Oct 23 2014 4:38 AM | Last Updated on Sat, Sep 2 2017 3:15 PM

చీకటి బతుకులు

చీకటి బతుకులు

* కాంట్రాక్ట్ కార్మికులు, దినసరి కూలీల మీద తీవ్ర ప్రభావం
* ఆర్డర్లు రద్దవుతున్నాయంటూ యాజమాన్యాల ఆందోళన
* ఉపాధి కోల్పోతున్న కార్మికులు

 సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: కరెంటు కోతలు కార్మికుల ఉపాధికి వాతలు పెడుతున్నాయి. వారి జీవితాల్లో చీకట్లు నింపుతున్నాయి. పవర్ హాలీడేతో నెలలో 10 రోజుల పాటు పరిశ్రమలు మూతపడుతున్నాయి. దీంతో యాజమాన్యాలు కాంట్రాక్ట్ కార్మికులను, దినసరి కూలీలను తగ్గించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఉపాధి వెతుక్కుంటూ పల్లె నుంచి పట్నం వచ్చి
బడుగు జీవుల బతుకులు రోడ్డున పడుతున్నాయి. ప్రస్తుత అంచనాల ప్రకారం జిల్లాకు రోజుకు 22.80 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం ఉంది. కానీ ఇప్పటికీ 2001 లెక్కల ఆధారంగానే రోజుకు 17.51 మిలియన్ యూనిట్ల విద్యుత్‌నే అధికారులు కేటాయించారు.

ఇందులో 9.40 మిలియన్ యూనిట్లు పరిశ్రమల కోసం వినియోగిస్తున్నట్లు టాన్స్‌కో రికార్డులు చెప్తున్నాయి. డిమాండ్‌కు తగినంత సరఫరా లేకపోవడంతో అధికారులు పరిశ్రమలకు రెండు రోజుల పవర్ హాలీడే ప్రకటించారు. వారానికి రెండు రోజులతో పాటు, మధ్యమధ్యలో కరెంటు కోతలు విధిస్తున్నారు. దీంతో నెలకు కనీసం 10 నుంచి 12 రోజుల పాటు పరిశ్రమలు నడవడం లేదు. ఈ నేపథ్యంలో అనుకున్న లక్ష్యంలో దాదాపు 40 శాతం ఉత్పత్తులు ఆగిపోతున్నాయి. జిల్లాలోని చాలా పరిశ్రమల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. సమయానికి ఉత్పత్తులు ఇవ్వడం లేదన్న కారణంతో బయ్యర్లు ముందస్తు ఆర్డర్లను తిరస్కరించి, మరో రాష్ట్రం కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటున్నారు.

ఉత్పత్తులు నిలిచిపోవడంతో ఆదాయ వ్యయాల్లో  తీవ్ర వ్యత్యాసం వస్తోంది. దీంతో ఉద్యోగులు, కార్మికుల వేతనాల చెల్లింపులు కూడా పరిశ్రమల యాజమాన్యాలకు కష్టంగా మారుతోంది. జిల్లాలో ఒక్కొక్క భారీ పరిశ్రమలో  కనీసం 350 నుంచి 500 వరకు కార్మికులు పనిచేస్తున్నారు. దినసరి కూలీల సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంటుంది. మధ్య, చిన్నతరహా పరిశ్రమల్లో సగటున 50 నుంచి 100 మంది కూలీల పని చేస్తున్నారు.
 
జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ప్రత్యక్షంగా దాదాపు 2 లక్షల మంది కార్మికులు, పరోక్షంగా మరో లక్ష మంది పరిశ్రమల మీద ఆధారపడి బతుకుతున్నారు. నెలకు 10 రోజుల పాటు పరిశ్రమల ఆగిపోవడం వల్ల అందులో పని చేసే కార్మికుల జీతాల్లో యాజమాన్యం కోత పెడుతోంది. ఇంకొన్ని పరిశ్రమలు సిబ్బందిని కుదించుకుంటున్నాయి. దీంతో దినసరి కూలీలు, కాంట్రాక్టు కార్మికుల ఆర్థిక పరిస్థితి భారంగా మారుతోంది.
 
కాంటాక్ట్ కార్మికుల మీద ప్రభావం...
డిమాండ్‌కు తగినంతగా విద్యుత్‌ను సరఫరా లేకపోవడంతో పరిశ్రమల్లో ఉత్పుత్తులు ఆగిపోతున్నాయి. చిన్న మధ్య తరహా పరిశ్రమలకు వారానికి రెండు రోజులు పవర్ హాలీడే ప్రకటించడంతో ఈ ప్రభావం నేరుగా దినసరి కూలీల మీద పడుతోంది. ప్రస్తుతం సరఫరా అవుతున్న విద్యుత్తులో వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇవ్వాల్సి వస్తుండటంతో పరిశ్రమలకు  వారానికి కనీసం 2 రోజుల పవర్ హాలీడే ప్రకటించాల్సి వచ్చింది. జిల్లాలో భారీ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు అధికంగానే ఉన్నాయి. 11 కేవీ విద్యుత్‌తో నడిచే  భారీ పరిశ్రమలు దాదాపు 1,500 వరకు ఉన్నాయి. 10 కేవీ విద్యుత్తుతో నడిచే అంటే మధ్యతరహా, చిన్న పరిశ్రమలు 7,500 వరకు ఉన్నాయి.

ప్రస్తుతం బొల్లారం పారిశ్రామిక వాడలో సోమవారం, మంగళవారం, జిల్లాలోని మిగిలిన  పారిశ్రామిక వాడల్లో బుధ, గురువారాల్లో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో ఈ పరిశ్రమల్లో ఉత్పత్తి ఆగిపోతోంది. ఫార్మా, ఐరన్, స్టీల్, బాయిల్డ్, విత్తన, జౌళి పరిశ్రమలపై విద్యుత్ కోతల ప్రభావం తీవ్రంగా ఉంటోంది. ఐరన్, బాయిల్డ్  పరిశ్రమల్లో  బాయిలర్స్ వేడెక్కాలంటే దాదాపు 1000  ిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత అవసరం. ఇందుకోసం దాదాపు 5 నుంచి 10 మెగావాట్ల విద్యుత్ అవసరం ఉంటుందని పరిశ్రమల యాజమాన్యాలు చెబుతున్నాయి.

కరెంటు  కోతల నేపథ్యంలో ప్రత్యామ్నాయంగాా హైటెన్షన్ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన జనరేటర్లు ప్రస్తుతం అందుబాటులో లేవని, ఒకవేళ అందుబాటులో ఉన్నప్పటికీ అంత ఖర్చు భరించి పరిశ్రమలు నడపటం సాధ్యం కాదని యాజమాన్యాలు అంటున్నాయి. విధిలేని పరిస్థితిలోనే పవర్ హాలీడే ప్రకటించిన రెండు రోజులు ఉత్పత్తి నిలిపివేస్తున్నామని వారు చెప్తున్నారు. మిగిలిన 5 దినాల్లో కూడా నిరంతరాయంగా కరెంటు రావడం లేదని, మధ్యమధ్యలో కనీసం మూడు నుంచి నాలుగు గంటల పాటు సరఫరా నిలిచిపోతున్నట్లు పరిశ్రమల యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
 
అన్ని వర్గాల మీదా ప్రభావం...
రసాయన పరిశ్రమలు 24 గంటలు 365 రోజులు నడవాల్సిందే. కెమికల్ జోన్‌లో రసాయన గుణాన్ని బట్టి 24 గంటలు, 36 గంటల ప్రతిచర్యలు (రియాక్షన్స్) ఉంటాయి. కరెంటు కోతలతో  రసాయనిక ప్రతి చర్యలు ఆగిపోయి ఉత్పత్తులు తగ్గడం, నాసిరకం ఉత్పత్తులు తయారవుతున్నాయి. ఇలాంటి ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్ ఉండటం లేదు. ఫలితంగా భారీగా నష్టపోవాల్సి వస్తోంది.

పరిశ్రమల ఆగటంతో యాజమాన్యం, కార్మికులు మాత్రమే కాదు.. పారిశ్రామిక ఉత్పత్తులను తరలించడం..విక్రయించడం.. వాటిని వివిధ రూపాల్లోకి మార్చే అనేక వర్గాల మీద ప్రభావం చూపుతుంది. రవాణ వాహనాలు, డ్రైవర్లు, ఏజెన్సీలు, డీలర్లు, దుకాణదారులు, మధ్యవ ర్తులు ఇలా ప్రతి వారి మీదా ప్రభావం పడుతుంది. ముఖ్యంగా కాంట్రాక్టు కార్మికులు, దినసరి కూలీల మీద తీవ్ర ప్రభావం పడుతుంది.
-అంజిరెడ్డి, ఎస్సార్ కెమికల్స్, ఎస్సార్ ట్రస్టు అధినేత

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement