తొలగించిన 4 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలనిధర్నా
ప్లాంట్ కార్యాలయం అద్దాలు ధ్వంసం
ఈడీ బిల్డింగ్‌లోని ఉద్యోగుల దిగ్బంధం
రాతపూర్వక హామీ కోసం కార్మికుల పట్టు
అంగీకరించని యాజమాన్యం
భారీగా చేరుకున్న పోలీసులు
ఉక్కు నగరం (విశాఖ): విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో మంగళవారం కాంట్రాక్ట్ కార్మికులు నిర్వహించిన ధర్నా ఉద్రిక్తతకు దారి తీసింది. కాంట్రాక్ట్ కార్మికుల డిమాండ్లపై స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం రాత పూర్వక హామీ ఇచ్చేందుకు అంగీకరించకపోవడంతో మంగళవారం రాత్రి వరకు ధర్నా కొనసాగింది. స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం 4 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులను ఆకస్మికంగా తొలగించాలని నిర్ణయించి, వారి ఆన్‌లైన్ గేటు పాసులను నిలిపివేసిన విషయం తెలిసిందే.
చివరకు ఒత్తిడిల నేపథ్యంలో యాజమాన్యం వారిని విధుల్లోకి తీసుకుంది. ఆ తర్వాత కార్మిక సంఘాలతో జరిపిన చర్చల్లో తొలగించిన కార్మికులకు నెలవారీ పాసులు, వేరే రంగు పాసులు ఇస్తామని యాజమాన్యం ప్రతిపాదించింది. దీనికి ఆగ్రహించిన అఖిలపక్ష కార్మిక సంఘాలు ఈడీ బిల్డింగ్ వద్ద ధర్నాకు పిలుపునిచ్చాయి.
పోలీసు బలగాల మోహరింపు
ధర్నాకు ముందెన్నడూ లేనివిధంగా విధుల్లో ఉన్న కార్మికులు కూడా హాజరయ్యారు. దీంతో పోలీసు బలగాలు పెద్దఎత్తున మోహరించాయి. పోలీసులు, సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది కార్మికులను నిలువరించేందుకు ఈడీ భవనం ముందు, వెనుక గేట్లకు తాళాలు వేశారు. దీంతో కార్మికులు భవనం ఎదుట కారిడార్‌లో బైఠాయించారు.
ఈ నేపథ్యంలో ఆగ్రహించిన కొందరు కార్మికులు అక్కడి అద్దాలు పగులగొట్టారు. పూల కుండీలు ధ్వంసం చేశారు. యాజమాన్యానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. కార్మికులు రెండు గేట్ల వద్ద బైఠాయించడంతో భవనం నుంచి ఉద్యోగుల రాకపోకలు నిలిచిపోయాయి.
ఒకానొక దశలో పోలీసులు ఆందోళనాకారులను లాఠీల సాయంతో పక్కకు నెట్టారు. అప్పటికే అక్కడికి మీటింగ్‌కు వచ్చి ఉన్న వివిధ విభాగాధిపతులు మధ్యాహ్నం భోజనానికి తమ విభాగాలకు వెళ్లలేక పోయారు. సాయంత్రం 5.30కు ప్లాంట్ నుంచి బయటకు వెళ్లాల్సిన ఉద్యోగులను కూడా బిల్డింగ్ బయటకు అనుమతించక పోవడంతో వారు తమ కార్యాలయాల్లో నిలిచిపోవాల్సి వచి్చంది.
డిమాండ్లపై యాజమాన్యం ససేమిరా
డిమాండ్ల సాధన కోసం యాజమాన్యం ప్రతినిధులతో కార్మిక సంఘాల నాయకులు పలుమార్లు చర్చలు జరిపారు. గతంలో మాదిరిగా పాసులు ఇవ్వాలని, వారికి పాత రంగులో పాసులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై యాజమాన్యం రాతపూర్వకంగా హామీ కోరగా.. యాజమాన్యం ససేమిరా అనేసింది.
దీంతో రాతపూర్వక హామీ ఇచ్చే వరకు ధర్నా కొనసాగిస్తామని కార్మికులు తెగేసి చెప్పారు. వర్క్స్ ఉన్నతాధికారులు, హెచ్‌ఆర్ అధికారులు ఉన్నత యాజమాన్యం అనుమతి కోసం ప్రయత్నం చేసినా సానుకూల స్పందన రాలేదు. ఫలితంగా కార్మికులు మంగళవారం రాత్రి కూడా ఆందోళన కొనసాగిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment