
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన గుంప గుత్త లాభాల పన్ను (విండ్‌ఫాల్ ట్యాక్స్)కు నిరసనగా వేదాంత లిమిటెడ్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. తన గ్యాస్ క్షేత్రాల నుంచి ఆర్జించిన లాభంలో కేంద్ర ప్రభుత్వానికి చెల్లించాల్సిన 91 మిలియన్ డాలర్ల వాటాని (సుమారు రూ.773 కోట్లు) నిలిపివేసింది. జనవరి 31, ఫిబ్రవరి 20వ తేదీల్లో పెట్రోలియం, సహజవాయువు శాఖకు ఈ విషయమై వేదాంత సమాచారం కూడా ఇచ్చింది.
స్థానికంగా (దేశీయంగా) ఉత్పత్తి అయ్యే చమురుపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ డ్యూటీ (ఎస్‌ఏఈడీ)ని కేంద్రం విధించింది. ఆరంభంలో టన్నుపై రూ.23,250 ప్రకటించగా (అంటే బ్యారెల్ చమురుపై 40 డాలర్లు).. ఆ తర్వాత టన్నుకు రూ.3,500కు తగ్గించింది. ఇది కాకుండా ఉత్పత్తి దారులు చమురు, గ్యాస్ రేటుపై ఆర్జించిన మొత్తంపైనా 10–20 శాతం రాయల్టీని చెల్లించాల్సి ఉంటుంది. వీటితోపాటు ఆదాయం నుంచి ఖర్చులను తీసివేసిన తర్వాత మిగిలిన లాభంలో ముందుగా నిర్ణయించిన మేరకు ప్రభుత్వం వాటా తీసుకోవచ్చు.
ఇన్ని రకాలుగా ఉత్పత్తిదారులు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో వేదాంత రాజస్థాన్‌లోని బ్లాక్ ఉత్పత్తిపై ఈ ప్రత్యేక అదనపు ఎక్సైడ్ డ్యూటీ (ఎస్‌ఏఈడీ) చెల్లించేందుకు గాను 85.35 మిలియన్ డాలర్లు, కాంబే బేసిన్‌లో సీబీ–ఓఎస్/2 బ్లాక్‌కు సంబంధించి ఎస్‌ఏఈడీ కోసం 5.50 మిలియన్ డాలర్లను నిలిపివేసినట్టు పెట్రోలియం శాఖకు స్పష్టం చేసింది. ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ఆర్థిక ప్రయోజనాలను పునరుద్ధరించేందుకే ఈ చర్య చేపట్టినట్టు వివరించింది. కేంద్రం విధించిన ఎస్‌ఏఈడీ, కాంట్రాక్టు ఒప్పందాలకు విరుద్ధమన్నది వేదాంత వాదనగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment