Hold
-
అమెరికాలో నిలిచిపోయిన విమానాలు.. కారణం ఇదే!
క్రిస్మస్ పండుగ సెలబ్రేషన్స్ మొదలైపోయాయి. ఈ తరుణంలో యూఎస్‌లో.. అమెరికన్ ఎయిర్‌లైన్స్ (American Airlines) తన అన్ని విమానాలను నిలిపివేసింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.విమాన సేవలను నిలిపివేయడానికి సాంకేతిక సమస్యలే కారణమని అమెరికన్ ఎయిర్‌లైన్స్ చెబుతోంది. అయితే కొందరు సైబర్ దాడి వల్ల ఈ పరిస్థితి నెలకొని ఉండవచ్చని చెబుతున్నారు.క్రిస్మస్ (Christmas) పండుగకు ముందు ఇలా జరగడంతో.. పలువురు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో ఒకరు 'మేము ఇంటికి వెళ్లాలా వద్దా చెప్పండి. విమానాశ్రయంలో గంటల తరబడి వేచి ఉండేలా చేయకండి' అని అన్నారు.మీరు మీ ఇళ్లకు సురక్షితంగా వెళ్లేందుకు మా బృందం పనిచేస్తోంది. మీ సహనానికి ధన్యవాదాలు అంటూ.. అమెరికన్ ఎయిర్‌లైన్స్ నెటిజన్ ప్రశ్నకు రిప్లై ఇచ్చింది.Our team is working to get this rectified so that you can be safely on your way to your family. Your continued patience is appreciated.— americanair (@AmericanAir) December 24, 2024 -
కాల్ హోల్డ్‌లో పెట్టారా..? రూ.4.6 లక్షల కోట్లు నష్టం!
మీరెప్పుడైనా సమస్య పరిష్కారం కోసం కస్టమర్‌కేర్‌కు కాల్ చేశారా..? మన సమస్య చెప్పాకా చాలా వరకు కాల్ సెంటర్ సిబ్బంది ‘కాసేపు హోల్డ్‌లో ఉండండి’ అనడం గమనిస్తాం. అయితే 2023లో అలా కస్టమర్లను హోల్డ్‌లో ఉంచిన సమయం ఎంతో తెలుసా..? ఏకంగా 15 బిలియన్ గంటలు(1500 కోట్ల గంటలు). దాంతో శ్రామికశక్తి వల్ల కలిగిన ఆర్థిక నష్టం రూ.4.6 లక్షల కోట్లు. ఈమేరకు ‘సర్వీస్ నౌ’ అనే సంస్థ విడుదల చేసిన ‘కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ 2024’ ఆసక్తికర విషయాలు వెల్లడించింది.సర్వీస్‌నౌ సంస్థ 18 ఏళ్ల కంటే ఎక్కువ వయసు ఉన్న 4,500 మంది భారతీయులపై సర్వే నిర్వహించి ఈ నివేదిక రూపొందించింది. నివేదికలోని వివరాల ప్రకారం..2023లో కాల్‌సెంటర్‌కు ఫోన్ చేసిన సగటు వ్యక్తి 30.7 గంటలు హోల్డ్‌లో గడిపాడు. 2023లో అన్ని కాల్‌సెంటర్లు కలిపి 1500 కోట్ల గంటలు కస్టమర్లను హోల్డ్‌లో ఉంచాయి. అలా వినియోగదారుల శ్రామికశక్తి వల్ల కలిగిన ఆర్థిక నష్టం రూ.4.6 లక్షల కోట్లు. కాల్ కనెక్ట్ అవ్వకపోవడంతో వెయిటింగ్లో ఉన్నవారు 50% కంటే ఎక్కువే. తమ సమస్యలను మూడు రోజుల్లోగా పరిష్కరించకపోతే 66% మంది ఇతర కంపెనీ సర్వీసుల్లోకి మారడానికి సిద్ధంగా ఉన్నారు.సర్వీస్‌నౌ ఇండియా టెక్నాలజీ అండ్ బిజినెస్ సెంటర్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, ఎండీ సుమీత్ మాథుర్ మాట్లాడుతూ..‘కస్టమర్లకు సర్వీసు అందడంలో ఆలస్యం అవుతోంది. దాంతో 2024లో కంపెనీలు మూడింట రెండొంతుల మంది కస్టమర్లను కోల్పోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే చాలామంది వినియోగదారులు చాట్బాట్లు, సెల్ఫ్-హెల్ప్ గైడ్ల వంటి ఏఐ సొల్యూషన్లపై ఆధారపడుతున్నారు. టెక్నాలజీ పెరగడంతో 62% మంది కస్టమర్లు కాల్సెంటర్లకు ఫోన్ చేయకుండా స్వయంగా సమస్యలను పరిష్కరించుకుంటున్నారు. దాదాపు 50% మంది వినియోగదారులకు టెక్నాలజీని ఉపయోగించి తమ సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో సరైన అవగాహన లేదు. కంపెనీ మేనేజ్మెంట్, సిబ్బంది మధ్య అంతర్గత కమ్యూనికేషన్ లోపించడంతో హోల్డింగ్ సమయం పెరుగుతుంది. సిబ్బందిలో నిర్ణయాధికారం లేకపోవడం ప్రధాన సమస్యగా ఉంది.ఇదీ చదవండి: ఉద్దేశపూర్వక ఎగవేతదారులపై కఠిన చర్యలుటెక్నాలజీ పెరుగుతున్న నేపథ్యంలో దాదాపు చాలామంది ప్రస్తుతం ఏఐ సొల్యూషన్స్‌పై ఆధారపడుతున్నారు. దానివల్ల కాల్సెంటర్లను ఆశ్రయించడం తగ్గింది. ఏదైనా అత్యవసరమైతే తప్పా వాటిని సంప్రదించడం లేదు. కాల్సెంటర్లకు కాల్ చేసే కస్టమర్ల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని నివేదిక చెబుతుంది. హోల్డింగ్ సమయాన్ని తగ్గించాలని, అందుకు అనువుగా ఏఐ ఆధారిత సేవలను మరింత మెరుగుపరచాలని అధ్యయనం సూచిస్తుంది. -
పూజా ఖేద్కర్‌కు బిగ్ షాక్
ఢిల్లీ: వివాదాస్పద ట్రెయినీ ఐఏఎస్ పూజా ఖేద్కర్‌కు భారీ షాక్ తగిలింది. అధికార దుర్వినియోగం, తప్పుడు ధృవీకరణ పత్రాల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పూజాపై చర్యలు తీసుకున్నారు. మహారాష్ట్రలో ఆమె ట్రైనింగ్‌ను హోల్డ్‌లో పెట్టారు. ఈ మేరకు ముస్సోరిలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ ఆడ్మినిస్ట్రేషన్ రీకాల్ ఉత్తర్వులు జారీ చేసింది. సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఎంపిక అయ్యేందుకు వైకల్యం,ఓబీసీ సర్టిఫికేట్లను తారుమారు చేశారనే ఆరోపణల నేపథ్యంలో.. పూజా ఖేద్కర్ శిక్షణను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు పేర్కొంది. అవసరమైన తదుపరి చర్యల నిమిత్తం ఆమెను జూలై 23లోగా అకాడమీకి రావాల్సిందిగా తెలిపింది.ఐఏఎస్ ఉద్యోగంలో చేరేందుకు పూజా ఖేద్కర్ తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించినట్లు ఆరోపణలు వెల్లువెత్తున్న విషయం తెలిసిందే. 2018, 2021లో అహ్మద్‌నగర్ జిల్లా సివిల్ హాస్పిటల్ అందించిన రెండు సర్టిఫికేట్లను బెంచ్‌మార్క్ డిజేబిలిటీస్ (PwBD) కేటగిరీ కింద యూపీఎస్సీకి సమర్పించారు. అయితే వైద్య పరీక్షల కోసం ఆమెను ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్‌కు యూపీఎస్సీ సిఫార్సు చేసింది. కానీ ఆమె 2022 ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు ఆరుసార్లు మెడికల్ టెస్టులకు డుమ్మా కొట్టింది.మరోవైపు పూజా ఖేద్కర్ తనకు కంటి సమస్యలు ఉన్నట్లు ఆగష్టు 2022లో పూణేలోని ఔంధ్ ప్రభుత్వ ఆసుపత్రి నుండి వైకల్య ధృవీకరణ పత్రం కోసం పూజా దరఖాస్తు చేసుకోగా.. వైద్య పరీక్షల తర్వాత ఆమె దరఖాస్తు తిరస్కరణకు గురైంది. అయినప్పటికీ ఆమె సివిల్ సర్వీసెస్ అపాయింట్మెంట్ ఏదో ఒక రకంగా పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఐఏఎస్‌గా పూజా ఖేద్కర్ ఎంపికను.. కమిషన్ ట్రిబ్యూనల్‌లో సవాలు చేయగా.. 2023 ఫిబ్రవరిలో ఆమెకు వ్యతిరేకంగా తీర్పు కూడా వచ్చింది. అయినా.. పూజా ఖేద్కర్ మాత్రం ఐఏఎస్‌గా ట్రైనింగ్ పొందడం గమనార్హం. ఈమె వివాదంపై దర్యాప్తునకు కేం ద్రం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. -
'మణిపూర్‌లో జీ20 సదస్సును జరపండి'
లక్నో: కేంద్ర ప్రభుత్వంపై సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ మండిపడ్డారు. మణిపూర్‌లో ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొంటే కేంద్రం ఎందుకు జీ20 సదస్సును అక్కడ నిర్వహించట్లేదని ప్రశ్నించారు. ఈ మేరకు 'జీ20 కా చునావ్ కనెక్షన్' సెషన్లో భాగంగా ఆయన మాట్లాడారు. 'దేశవ్యాప్తంగా జీ20 సెషన్లను కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఉత్తరప్రదేశ్, ఢిల్లీలతో సహా దేశవ్యాప్తంగా అనేక చోట్ల ఎన్నో కార్యక్రమాలు చేపడుతోంది. కానీ మణిపూర్ సమస్యపై సరిగా స్పందించడం లేదు. అక్కడ పరిస్థితులు సాధారణ స్థాయికి చేరాయని నాయకులు చెబుతున్నారు. నిజంగా అక్కడ అల్లర్లు లేకపోతే ప్రస్తుతం జరిగే జీ20 మీటింగ్‌లను మణిపూర్‌లో నిర్వహించవచ్చు.' అని అఖిలేష్ యాదవ్ అన్నారు. మణిపూర్ సమస్యపై ప్రతిపక్షాలు ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రాన్ని పట్టుబట్టాయి. ప్రధాని మోదీ ఈ సమస్యపై స్పందించాలని కోరారు. అటు.. కేంద్రంపై అవిశ్వాస తీర్మాణాన్ని కూడా ప్రవేశపెట్టాయి. అయితే.. ఈ తీర్మాణంపై కేంద్రం తన బలాన్ని నిరూపించుకుంది. ఇదీ చదవండి: ఆయుష్మాన్ భారత్‌పై ప్రశంసలు కురిపించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ -
ప్రభుత్వానికి వేదాంత షాక్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన గుంప గుత్త లాభాల పన్ను (విండ్‌ఫాల్ ట్యాక్స్)కు నిరసనగా వేదాంత లిమిటెడ్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. తన గ్యాస్ క్షేత్రాల నుంచి ఆర్జించిన లాభంలో కేంద్ర ప్రభుత్వానికి చెల్లించాల్సిన 91 మిలియన్ డాలర్ల వాటాని (సుమారు రూ.773 కోట్లు) నిలిపివేసింది. జనవరి 31, ఫిబ్రవరి 20వ తేదీల్లో పెట్రోలియం, సహజవాయువు శాఖకు ఈ విషయమై వేదాంత సమాచారం కూడా ఇచ్చింది. స్థానికంగా (దేశీయంగా) ఉత్పత్తి అయ్యే చమురుపై ప్రత్యేక అదనపు ఎక్సైజ్ డ్యూటీ (ఎస్ఏఈడీ)ని కేంద్రం విధించింది. ఆరంభంలో టన్నుపై రూ.23,250 ప్రకటించగా (అంటే బ్యారెల్ చమురుపై 40 డాలర్లు).. ఆ తర్వాత టన్నుకు రూ.3,500కు తగ్గించింది. ఇది కాకుండా ఉత్పత్తి దారులు చమురు, గ్యాస్ రేటుపై ఆర్జించిన మొత్తంపైనా 10–20 శాతం రాయల్టీని చెల్లించాల్సి ఉంటుంది. వీటితోపాటు ఆదాయం నుంచి ఖర్చులను తీసివేసిన తర్వాత మిగిలిన లాభంలో ముందుగా నిర్ణయించిన మేరకు ప్రభుత్వం వాటా తీసుకోవచ్చు. ఇన్ని రకాలుగా ఉత్పత్తిదారులు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో వేదాంత రాజస్థాన్‌లోని బ్లాక్ ఉత్పత్తిపై ఈ ప్రత్యేక అదనపు ఎక్సైడ్ డ్యూటీ (ఎస్ఏఈడీ) చెల్లించేందుకు గాను 85.35 మిలియన్ డాలర్లు, కాంబే బేసిన్లో సీబీ–ఓఎస్/2 బ్లాక్‌కు సంబంధించి ఎస్ఏఈడీ కోసం 5.50 మిలియన్ డాలర్లను నిలిపివేసినట్టు పెట్రోలియం శాఖకు స్పష్టం చేసింది. ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ఆర్థిక ప్రయోజనాలను పునరుద్ధరించేందుకే ఈ చర్య చేపట్టినట్టు వివరించింది. కేంద్రం విధించిన ఎస్ఏఈడీ, కాంట్రాక్టు ఒప్పందాలకు విరుద్ధమన్నది వేదాంత వాదనగా ఉంది. -
సర్పంచ్‌లూ అర్థం చేసుకోండి!.. కేంద్రం రూ.1,100 కోట్ల నిధులు ఆపేసింది
సాక్షి, హైదరాబాద్: ‘సర్పంచ్‌లూ అర్థం చేసుకోండి. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.1,100 కోట్ల నిధులు ఆపేశారు. అందుకే ఆర్థికంగా కొంత ఇబ్బందులు ఏర్పడ్డాయి. రైతు కల్లాలకు రూ.150 కోట్లు ఖర్చు చేయడాన్ని తప్పుగా భావించి, ఆ డబ్బులు ఆపేశారు. ఈ విషయమై సర్పంచ్‌లకు అధికారులు అవగాహన కలి్పంచాలి’అని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. కేంద్రం కావాలనే నిధులు విడుదల చేయకపోవడం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. ఈ విధంగా నిధులు ఆపడం సరికాదని విమర్శించారు. ఈ విషయాన్ని అధికారులు, సర్పంచులు అర్థం చేసుకోవాలని చెప్పారు. కొంతమంది సర్పంచులు బీజేపీ మాయలోపడి ప్రభుత్వంపై దు్రష్పచారం చేస్తున్నారన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక ఆయా గ్రామాలకు అందిన నిధుల వివరాలతో ప్రతీ పంచాయతీలో బోర్డులు ఏర్పాటు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. శనివారం మంత్రి అన్ని జిల్లాల సూపరింటెండెంట్ ఇంజనీర్లతో తొలుత సమావేశమై, ఆ తర్వాత జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, జిల్లా పంచాయతీ ఆఫీసర్లు, మండల పంచాయతీ ఆఫీసర్లు, ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గానికి రూ.5 కోట్లతో రోడ్ల నిర్మాణ ప్రతిపాదనల జాబితాలు అందజేయాలని ఆదేశించారు. వర్షాకాలంలో మొదటి వర్షం పడేటప్పటికీ ఏ ఒక్క రోడ్డు మీద గుంత కనిపించవద్దని, దెబ్బతిన్న రోడ్లన్నీ బాగు చేయాలని సూచించారు. అధికారులు, సిబ్బంది బాగా పనిచేయడం వల్ల పంచాయతీరాజ్ శాఖకు మంచి పేరు వచ్చిందని, జాతీయస్థాయిలో అనేక అవార్డులు వచ్చాయని.. ఇదే స్పూర్తిని ఇకముందు కూడా కొనసాగించాలని కోరారు. కొత్తగా నిర్మిస్తున్న గ్రామపంచాయతీ కార్యాలయాల పనులను వేగంగా చేయాలని సూచించారు. చదవండి: ‘అన్మ్యాన్డ్’.. సబ్స్టేషన్లు!.. టీఎస్ఎస్పీడీసీఎల్ ‘హైటెక్’ బాట -
చిక్కుల్లో సహారా: సుప్రీంకోర్టులో భారీ షాక్!
న్యూఢిల్లీ: సహారా గ్రూప్, ఆ సంస్థ చీఫ్ సుబ్రతా రాయ్, ఇతర అధికారులకు సుప్రీంకోర్టులో గురువారం తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది. సహారా గ్రూపునకు సంబంధించిన తొమ్మిది కంపెనీలపై సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐఓ) విచారణను నిలిపివేస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు కొట్టివేసింది. సహారా గ్రూప్ చీఫ్ సుబ్రతా రాయ్, ఇతర అధికారులపై లుక్అవుట్ సర్క్యులర్లతో సహా తదుపరి చర్యలు చేపట్టడానికి కూడా సుప్రీం రూలింగ్ వీలు కల్పిస్తోంది. దర్యాప్తుపై స్టే విధించడం ‘చాలా అసాధారణమైన ఉత్తర్వు‘ అని న్యాయమూర్తులు డీ వై చంద్రచూడ్, బేల ఎం త్రివేదిలతో కూడిన వెకేషన్ బెంచ్ వ్యాఖ్యానించింది. హైకోర్టు ఆదేశాలపై ఎస్ఎఫ్ఐఓ గత ఏడాది డిసెంబర్ 13న దాఖలు చేసిన అప్పీల్‌ను అనుమతించింది. తొమ్మిది కంపెనీలూ ఇవీ... మూడు గ్రూప్ సంస్థలు-సహారా క్యూషాప్ యూనిక్ ప్రొడక్ట్స్ రేంజ్ లిమిటెడ్, క్యూ గోల్డ్ మార్ట్ లిమిటెడ్, సహారా హౌసింగ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ వ్యవహారాలపై విచారణకు కేంద్రం 2018 అక్టోబర్ 31న ఆదేశాలు ఇచ్చింది. మరో ఆరు కంపెనీలు– ఆంబీ వ్యాలీ లిమిటెడ్, క్వింగ్ అంబి సిటీ డెవలపర్స్ కార్పొరేషన్ లిమిటెడ్, సహారా ఇండియా కమర్షియల్ కార్పొరేషన్ లిమిటెడ్, సహారా ప్రైమ్ సిటీ లిమిటెడ్, సహారా ఇండియా ఫైనాన్షియల్ కార్పొరేషన్ లిమిటెడ్, సహారా ఇండియా రియల్ ఎస్టేట్ కార్పొరేషన్ లిమిటెడ్‌లపైనా విచారణకు కేంద్రం 2020 అక్టోబరు 27న ఆదేశాలు ఇచ్చింది. వీటిని ఢిల్లీ హైకోర్టులో సవాలు చూస్తూ సహారా గ్రూప్ కేంద్రం ఉత్తర్వులపై స్టే తెచ్చుకుంది. రెండు నెలల్లో విచారణ పూర్తికి ఆదేశాలు... కాగా, సహారా గ్రూప్ ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన రిట్ పిటిషన్లకు సంబంధించి ‘మెరిట్స్’ ప్రాతిపదికన తమ తాజా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ అంశంపై దాఖలు చేసిన రిట్ పిటిషన్లు హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయన్న అంశాన్ని ప్రస్తావించింది. పెండింగ్‌లో ఉన్న రిట్ పిటిషన్లను త్వరిత గతిన పరిష్కరించాలని పేర్కొంది. వేసవి సెలవులు ముగిసి, కోర్టును తిరిగి తెరిచిన తర్వాత రెండు నెలల్లోపు వాటిని పరిష్కరించేందుకు ప్రయత్నించాలని బెంచ్ ఢిల్లీ హైకోర్టుకు సూచించింది. -
బీపీసీఎల్ ప్రెవేటైజేషన్‌కు బ్రేక్: ఎందుకంటే?
న్యూఢిల్లీ: ఇంధన రంగ పీఎస్‌యూ దిగ్గజం భారత్ పెట్రోలియం కార్పొరేషన్(బీపీసీఎల్) ప్రైవేటైజేషన్ ప్రతిపాదనకు బ్రేక్ పడింది. దాదాపు 53 శాతం వాటాను విక్రయించే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం విరమించుకుంది. ఇంధన ధరలపై స్పష్టత లేకపోవడం వంటి సమస్యలపై ఇద్దరు బిడ్డర్లు వాకౌట్ చేయడంతో కేవలం ఒక బిడ్డర్ మాత్రమే పోటీలో ఉన్నారు. దీంతో ప్రైవేటీకరణకు బ్రేక్ పడింది. అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో నెలకొన్న పరిస్థితులరీత్యా ప్రస్తుతం ప్రయివేటైజేషన్ ప్రక్రియలో పాల్గొనలేమంటూ అత్యధిక శాతం బిడ్డర్లు అశక్తతను వ్యక్తం చేసినట్లు దీపమ్ పేర్కొంది. కంపెనీలో ప్రభుత్వానికిగల మొత్తం 52.98% వాటాను విక్రయించేందుకు తొలుత ప్రభుత్వం ప్రణాళికలు వేసింది. ఇందుకు వీలుగా 2020 మార్చిలోనే ఆసక్తి వ్యక్తీకరణ(ఈవోఐ) బిడ్స్‌కు ఆహ్వానం పలికింది. అదే ఏడాది నవంబర్‌కల్లా కనీసం మూడు సంస్థలు బిడ్స్ దాఖలు చేశాయి. అయితే ఇంధన ధరల విషయంలో స్పష్టత లేకపోవడంతో రెండు సంస్థలు రేసు నుంచి వైదొలగాయి. దీంతో ఒక కంపెనీ మాత్రమే బరిలో నిలిచింది. ఫలితంగా డిజిన్వెస్ట్‌మెంట్‌పై ఏర్పాటైన మంత్రివర్గ కమిటీ ప్రైవేటైజేషన్ ప్రక్రియ రద్దుకు నిర్ణయించినట్లు దీపమ్ వెల్లడించింది. పరిస్థితుల ఆధారంగా ఈ అంశంపై భవిష్యత్‌లో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలియజేసింది. బీపీసీఎల్‌లో ప్రభుత్వ వాటా కొనుగోలుకి వేదాంతా గ్రూప్, యూఎస్ వెంచర్ ఫండ్స్ అపోలో గ్లోబల్ మేనేజ్మెంట్ ఇంక్, ఐ స్క్వేర్డ్ క్యాపిటల్ అడ్వయిజర్స్ ఈవోఐలను దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వార్తల నేపథ్యంలో బీపీసీఎల్ షేరు 0.5% నీరసించి రూ. 325 వద్ద ముగిసింది. శుక్రవారం స్వల్ప లాభంతో అక్కడే కదలాడుతోంది. -
ట్విటర్ డీల్‌కు మస్క్ బ్రేకులు
లండన్: మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్‌ను ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ కొనుగోలు చేసే అంశం కొత్త మలుపులు తిరుగుతోంది. తాజాగా ట్విటర్ చూపుతున్న స్పామ్, నకిలీ ఖాతాల సంఖ్యపై మస్క్ సందేహాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో డీల్‌ను తాత్కాలికంగా పక్కనపెడుతున్నట్లు ఆయన వెల్లడించారు. రోజువారీ యాక్టివ్ యూజర్ల సంఖ్యలో స్పామ్, నకిలీ ఖాతాలు అయిదు శాతం కన్నా తక్కువే ఉంటాయంటూ మార్చి త్రైమాసిక ఫలితాల్లో ట్విటర్ వెల్లడించిన వార్తను తన ట్వీట్‌కు ఆయన జత చేశారు. ‘మొత్తం యూజర్లలో నకిలీ ఖాతాల సంఖ్య నిజంగానే అయిదు శాతం కన్నా తక్కువే ఉందని «ధ్రువీకరించే వివరాలు అందేవరకూ ట్విటర్ డీల్‌ను తాత్కాలికంగా ఆపుతున్నాం‘ అని మస్క్ వెల్లడించారు. అయితే, ఈ ఒక్క అంశం వల్ల ట్విటర్ టేకోవర్ ఒప్పందానికి విఘాతమేదైనా కలుగుతుందా లేదా అన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. అటు ట్విటర్లో పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ఇద్దరు టాప్ మేనేజర్లను తొలగించిన ట్విటర్.. కీలక స్థానాలకు మినహా ఇతరత్రా నియామకాలను ప్రస్తుతానికి నిలిపివేస్తున్నామని పేర్కొంది. డీల్ నుంచి బైయటపడేందుకు సాకు.. డీల్ నుంచి బైటపడటానికి మస్క్.. నకిలీ ఖాతాల సాకును చూపుతున్నట్లుగా అనిపిస్తోందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడ్డాయి. తద్వారా టేకోవర్ కోసం 44 బిలియన్ డాలర్లు వెచ్చించే బదులు పరిహారం కింద గరిష్టంగా 1 బిలియన్ డాలర్లు కట్టి మస్క్ తప్పించుకునే యోచనలో ఉండొచ్చని పేర్కొన్నాయి. ఇన్వెస్టర్ల అభిమతానికి విరుద్ధంగా ట్విటర్‌పై దృష్టి పెట్టడం వల్ల టెస్లా వ్యాపారం గాడి తప్పే అవకాశం ఉండటం కూడా ఇందుకు కారణం కావచ్చని వివరించాయి. మరోవైపు, కంపెనీ షేరు కుదేలయ్యే రకంగా చేసి, మరింత చవకగా దక్కించుకోవాలని మస్క్ భావిస్తుండవచ్చని మరికొందరు పరిశీలకులు అభిప్రాయపడ్డారు. ట్విటర్ షేరు కుదేల్.. టేకోవర్ డీల్‌కు బ్రేకులు పడ్డాయన్న వార్తలతో ట్విటర్ షేరు శుక్రవారం ఒక దశలో ఏకంగా 10 శాతం పైగా పతనమై 40.01 డాలర్ల వద్ద ట్రేడయ్యింది. అటు టెస్లా ఆరు శాతం పైగా ఎగిసి 775 డాలర్ల వద్ద ట్రేడయ్యింది. షేరు ఒక్కింటికి 54.20 డాలర్లు ఇస్తానంటూ మస్క్ ఆఫర్ ఇచ్చిన రోజున ట్విటర్ షేరు సుమారు 45 డాలర్ల వద్ద ట్రేడయ్యింది. ఆ తర్వాత డీల్ వార్తలతో 50 డాలర్ల పైకి ఎగిసింది. కానీ తాజా పరిస్థితులతో 40 డాలర్ల స్థాయికి పడిపోయింది. -
ట్విటర్ డీల్ తాత్కాలికంగా నిలిపివేస్తున్నాం: ఎలన్ మస్క్
ప్రపంచ అపరకుబేరుడు ఎలన్ మస్క్ మరో ట్విస్ట్ ఇచ్చాడు. ట్విటర్ డీల్‌ను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ప్రకటించారాయన. ఈ మేరకు తన ట్విటర్ అకౌంట్లోనే ఓ పోస్ట్ చేశారు. సుమారు 44 బిలియన్ డాలర్లతో ట్విటర్-ఎలన్ మస్క్ మధ్య కొనుగోలు ఒప్పందం జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరో ఆరు నెలలో పూర్తిగా ఎలన్ మస్క్ చేతికి ట్విటర్ వెళ్లాల్సి ఉంది. ఈలోపే ట్విటర్ డీల్‌ను తాత్కాలికంగా పక్కనపెడుతున్నట్లు ఎలన్ మస్క్ ప్రకటించారు. స్పామ్, నకిలీ ఖాతాలపై పెండింగ్‌లో ఉన్న వివరాల వల్లే ఈ డీల్ తాత్కాలికంగా హోల్డ్‌లో పెట్టాం అని ఆయన స్పష్టం చేశారు. Twitter deal temporarily on hold pending details supporting calculation that spam/fake accounts do indeed represent less than 5% of usershttps://t.co/Y2t0QMuuyn — Elon Musk (@elonmusk) May 13, 2022 ఈ ప్రకటనతో మార్కెట్ ట్రేడింగ్‌లో ట్విటర్ షేర్లు పతనం అయ్యాయి. మరోవైపు ఈ డీల్ నిలిపివేతపై ట్విటర్ ఇంకా స్పందించలేదు. స్పామ్, నకిలీ ఖాతాలపై పెండింగ్‌లో ఉన్న వివరాల వల్లే ఈ డీల్ తాత్కాలికంగా హోల్డ్‌లో పెట్టగా.. ఇది ఐదు శాతం కంటే తక్కువగా ఉండొచ్చని తెలుస్తోంది. గతంలో ఎలన్ మస్క్ ట్విటర్ నుంచి స్పాట్ బోట్స్‌ను తొలగించడమే తన ప్రాధాన్యత అంటూ వ్యాఖ్యలు చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇదిలా ఉంటే.. మొదటి త్రైమాసికంలో.. డబ్బు ఆర్జించగల రోజువారీ క్రియాశీల వినియోగదారులలో(ట్విటర్ యూజర్లు) 5% కంటే తక్కువ మంది తప్పుడు లేదంటే స్పామ్ ఖాతాలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయని కంపెనీ ఈ నెల ప్రారంభంలో అంచనా వేసింది. మస్క్‌తో ఒప్పందం ముగిసే వరకు, ప్రకటనదారులు ట్విట్టర్లో ఖర్చు చేయడం కొనసాగించాలా వద్దా అనే దానితో సహా అనేక నష్టాలను ఎదుర్కొన్నట్లు కూడా పేర్కొంది. -
Sedition Order: లక్ష్మణ రేఖను గౌరవించాలి.. దాటకూడదు!
సాక్షి, న్యూఢిల్లీ: వివాదాస్పదమైన రాజద్రోహ చట్టం విషయంలో ఇవాళ సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ సమీక్షలు పూర్తయ్యేదాకా రాజద్రోహ చట్టాన్ని నిలిపివేయాలంటూ కేంద్రానికి చెప్పింది. అంతేకాదు కొత్త కేసులు.. అరెస్టులు నమోదు చేయొద్దని చెబుతూనే.. ఇప్పటికే రాజద్రోహం కింద అరెస్టయిన వాళ్లు బెయిల్ కోసం న్యాయస్థానాలను ఆశ్రయించొచ్చని స్పష్టం చేసింది. ఈ పరిణామంపై పలువురు రాజకీయ నేతలు స్పందిస్తున్నారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజిజు Kiren Rijiju కోర్టు ఆదేశాలపై.. ‘కోర్టులకు ఉన్న స్వతంత్ర్య హోదాను, వాటిని తీర్పును గౌరవిస్తామని అన్నారు. అంతేకాదు లక్ష్మణ రేఖను దాటకూడదు కదా అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ చట్టం విషయంలో మేం చాలా స్పష్టంగా ఉన్నాం. మా ప్రధాని నరేంద్ర మోదీ ఉద్దేశం ఏంటో కూడా న్యాయస్థానానికి తెలియజేశాం. న్యాయస్థానాలను, వాటి స్వతంత్ర్య హోదాను మేం గౌరవిస్తాం. కానీ, అంతా లక్ష్మణ రేఖను గౌరవించాలి. అంతేగానీ దాటకూడదు కదా అంటూ మంత్రి కిరెన్ రిజిజు మీడియాతో మాట్లాడారు. బ్రిటిష్ కాలంలో భారతీయుల అణచివేతకు కారణమైన ఐపీసీ సెక్షన్ 124-ఏను.. ఇప్పటికీ అమలు చేస్తుండడంపైనే ప్రధాన అభ్యంతరాలు వ్యక్తంకాగా, కేంద్రం మాత్రం ఈ సెక్షన్‌పై దోబుచులాడుతూ వస్తోంది. తాజాగా ఈ సెక్షన్ సవరణ సమీక్షకు తాము సిద్ధమంటూ అఫిడవిట్లో పేర్కొనడం.. ఆపై సుప్రీం కోర్టు జోక్యంతో రాజద్రోహం సెక్షన్‌కు ఇప్పుడు బ్రేకు పడింది. చదవండి: ‘రాజద్రోహం చట్టం’పై స్టే విధించిన సుప్రీంకోర్టు -
లాంఛ్‌కు ముందే బుకింగ్‌కు టయోటా బ్రేకులు!
భారత్‌లో లాంచ్ చేయడానికి కంటే ముందే హైలక్స్ ట్రక్ బుకింగ్‌ను నిలిపివేసినట్లు కంపెనీ ప్రకటించుకుంది. ఈ మేరకు జపనీస్ ఆటోమేకర్ టయోటా కిర్లోస్కర్ మోటార్ గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. మోస్ట్ అవెయిటింగ్ మోడల్‌గా ఉన్న ‘హైలక్స్’ కోసం కిందటి నెలలోనే బుకింగ్స్‌ను ప్రారంభించింది. మార్చ్‌లో లాంఛింగ్‌కు రంగం సిద్ధం చేసుకుంటోంది. ఈ మేరకు డీలర్షిప్స్ వద్ద లక్ష రూ., కంపెనీ ఆన్లైన్ పోర్టల్‌లో రూ. 50వేలతో బుకింగ్స్ కొనసాగించింది. అయితే ఉన్నపళంగా ఆ బుక్సింగ్‌ను ఆపేస్తున్నట్లు గురువారం ప్రకటించింది. కానీ, ఇది తాత్కాలికమే అని పేర్కొంది. వాస్తవానికి బుకింగ్‌కు మంచి స్పందన వచ్చింది. ఇది సప్లయ్‌కి ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. అందుకే బుకింగ్‌ను టెంపరరీగా ఆపేశామని, త్వరలో మళ్లీ బుక్సింగ్స్‌ను కొనసాగిస్తామని కంపెనీ క్లారిటీ ఇచ్చింది. Hilux టయోటా ఫార్చ్యూనర్ SUV వలె.. సేమ్ ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది, అయితే ప్రస్తుతం ఇక్కడ మైక్రోస్కోపిక్‌గా ఉన్న విభాగంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సృష్టించుకోవాలని చూస్తోంది. హైలక్స్కు సమీప ప్రత్యర్థిగా ఇసుజు V-క్రాస్‌ను భావిస్తున్నారు. -
రాహుల్ ట్విట్టర్ ఖాతా పునరుద్ధరణ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ, ట్విట్టర్ మధ్య చెలరేగిన వివాదం ఒక కొలిక్కి వచ్చింది. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, పార్టీ అధికారిక అకౌంట్, ఇతర నేతల ఖాతాలను ట్విట్టర్ ఎట్టకేలకు పునరుద్ధరించింది. ఢిల్లీలో తొమ్మిదేళ్ల దళిత బాలికను అత్యాచారం చేసి హత్య చేశారని ఆరోపణల నేపథ్యంలో ఆ కుటుంబాన్ని పరామర్శించిన ఫొటోలు రాహుల్ తన ఖాతాలో షేర్ చేయడంతో వివాదం మొదలైంది. బాధిత కుటుంబం ఫొటోలు షేర్ చేయడం తమ సంస్థ నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్న ట్విట్టర్ అకౌంట్లను బ్లాక్ చేసింది. అయితే రాహుల్ ఆ ఫొటోలు సామాజిక మాధ్యమంలో పెట్టడానికి ఆ కుటుంబమే అనుమతించిందని, వారు ఇచ్చిన అనుమతి పత్రాన్ని ట్విట్టర్‌కు సమర్పించారు. దీంతో ట్విట్టర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల బ్లాక్ చేసిన ఖాతాలను పునరుద్ధరించింది. దీనిపై కాంగ్రెస్ తన అధికారిక ఖాతాలో సత్యమేవ జయతే అంటూ ట్వీట్ చేసింది. ఫేస్‌బుక్‌పై బాలల హక్కుల కమిషన్ ఆగ్రహం దళిత బాలిక కుటుంబీకుల వీడియోను రాహుల్ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టడంపై జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్(ఎన్సీపీసీఆర్) ఆగ్రహం వ్యక్తంచేసింది. ఘటనపై వివరణ ఇవ్వాలని కమిషన్ గతంలో ‘ఇన్స్టాగ్రామ్’ మాతృసంస్థ అయిన ఫేస్‌బుక్‌కు నోటీసులు పంపింది. నోటీసులపై ఫేస్బుక్ స్పందించలేదు. ఆగ్రహించిన ఎన్సీపీసీఆర్ ఫేస్‌బుక్‌కు సమన్లు జారీచేసింది. రాహుల్‌పై ఏం చర్యలు తీసుకున్నారనేది ఫేస్బుక్ తెలపకపోవడాన్ని కమిషన్ తప్పుబట్టింది. ఆయనపై చర్యలపై నివేదికతో ఫేస్బుక్ అధికారులు మంగళవారం సాయంత్రం ఢిల్లీలోని తమ ముందు హాజరుకావాలని ఆదేశించింది. -
కరోనా వ్యాప్తి: టెకీలకు బోనస్‌ల కోత
ముంబై: సాఫ్ట్వేర్ రంగంపై కరోనా వైరస్ పంజా విసురుతోంది. అసలే ఆర్థిక మాంధ్యం ముంచుకొస్తున్న తరుణంలో కరోనా ప్రభావంతో ఉద్యోగుల జీతాల పెంపును వాయిదా వేస్తున్నట్లు కంపెనీలకు చెందిన ఉన్నతాధికారులు తెలిపారు. కొన్ని కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ అమలు చేస్తుంటే మరికొన్ని కంపెనీలు సెలవులు ప్రకటించాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో బోనస్‌లు, ఇంక్రిమెంట్లు తాత్కాళికంగా నిలిపివేసినట్లు టెక్ మహీంద్రా సీఈఓ సీపీ గుర్నాని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగుల ఆరోగ్య భద్రతపైనే దృష్టి సారించామని ఆయన తెలిపారు. కరోనా నేపథ్యంలో ప్రముఖ సాఫ్ట్వేర్ దిగ్గజం అసెంచర్ వృద్ది శాతాన్ని 6-8శాతం నుంచి 3-6శాతానికి తగ్గించినట్లు పేర్కొంది. ప్రస్తుత సంక్షోభంలో కంపెనీల ఆదాయం భారీగా తగ్గుతాయని.. తమ హేతుబద్ద నిర్ణయాన్ని ఉద్యోగులు స్వాగతించాలని ఎవరెస్ట్ గ్రూప్ సీఈఓ పీటర్ బెండర్ తెలిపారు. ఐటీ కంపెనీలు కొనసాగుతున్న ప్రాజెక్టులపైనే దృష్టి సారించాయని కొత్త ప్రాజెక్టుల స్వీకరించడానికి సిద్దంగా లేవని నాస్‌కమ్‌కు చెందిన ఉన్నతాధికారి అభిప్రాయపడ్డారు. -
ఏసీసీ-అంబుజా మెర్జర్‌కు బ్రేక్: షేర్ల పతనం
సాక్షి, ముంబై: సిమెంట్ రంగ దిగ్గజ కంపెనీలు ఏసీసీ, అంబుజా మధ్య విలీనాకి చెక్ పడిందన్న వార్తలతో మంగళవారం నాటి మార్కెట్లో ఈ రెండు షేర్లు భారీగా నష్టపోతున్నాయి. ముఖ్యంగా అంబుజా 4శాతం, ఏసీసీ2 శాతం నష్టపోయాయి. విలీనం చర్చలను నిలిపివేయాలని నిర్ణయించినట్టు ఇరు కంపెనీలూ స్టాక్ ఎక్స్చేంజెస్‌కు అందించిన సమాచారంలో వెల్లడించాయి. సంస్థ ప్రత్యేక కమిటీ, బోర్డు డైరెక్టర్లు రెండింటి ద్వారా జరిపిన సమగ్ర పరిశీలన ఆధారంగా ప్రస్తుతం ఈ విలీనం అమలులో కొన్ని పరిమితులు ఉన్నాయని అభిప్రాయపడినట్టు ఏసీసీ తెలిపింది. కానీ భారతదేశం రెండవ అతిపెద్ద సిమెంటు తయారీ సంస్థను సృష్టించాలనేదే తమ "అంతిమ లక్ష్యం" మని ఏసీసీ, అంబూజా పేర్కొన్నాయి. మైనింగ్ ఆస్తుల బదిలీకి సమస్యలు ఎదురుకావడంతో ప్రస్తుతానికి ఏసీసీ లిమిటెడ్, అంబుజా సిమెంట్ విలీనానికి తెరపడినట్లు తెలుస్తోంది. 18-20 రాష్ట్రాలలో మైనింగ్ ఆస్తుల హక్కుల బదిలీకి సంబంధించి సమస్యలు ఎదురుకావచ్చని విలీన కమిటీ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. అయితే రెండు కంపెనీలూ కార్యకలాపాల నిర్వహణకు సంబంధించి పరస్పరం సహకరించుకోనున్నట్లు పరిశ్రమవర్గాల సమాచారం. కాగా సిమెంట్ రంగంలో ఇటీవల కీలక విలీనాలకు అడుగులు పడుతున్నాయి. గతేడాది మే నెలలో ఏసీపీ, అంబుజా విలీనానికి ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఇదే బాటలో బినాని సిమెంట్‌ను విలీనం చేసుకునేందుకు అల్ట్రా టెక్ సిమెంట్ ప్రయత్నిస్తోంది. -
బాలసదన్‌కు బాలిక అప్పగింత
యాదగిరిగుట్ట : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో తప్పిపోయిన ఓ బాలికను బాలసదన్‌కు అప్పగించారు. ఆదివారం సెలవు దినం కావడంతో యాదాద్రిలో భక్తుల రద్దీ పెరిగింది. ఈ క్రమంలో ఓ బాలిక ఏడ్చుతూ తిరువీధుల వెంట తిరుగుతుంది. స్థానికులు, వ్యాపారస్తులు యాదగిరిగుట్ట ఎస్ఐ రాజశేఖర్‌రెడ్డికి సమాచారం అందించారు. ఈ మేరకు ఆయన ఆ బాలికను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. 5 నుంచి 7 సంవత్సరాల మధ్య వయస్సులో ఉన్న ఆ బాలిక తల్లిదండ్రులు, ఊరు పేర్లను వెల్లడించడం లేదని ఎస్ఐ తెలిపారు. దీంతో భువనగిరి బాలసదన్‌కు సమాచారం అక్కడి ఐసీడీఎస్ అధికారులకు అప్పగించినట్లు ఎస్ఐ తెలిపారు. -
నేపాల్ లో సమావేశమైన సుష్మా, అజీజ్
పొఖారా : నేపాల్ లో జరుగుతున్న సార్క్ సమావేశాలకు హాజరైన భారత విదేశ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్ గురువారం పాకిస్తాన్ విదేశ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజీజ్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంలో ఈ ఏడాది నవంబర్‌లో ఇస్లామాబాద్‌లో జరిగే సార్క్ శిఖరాగ్ర సదస్సుకు హాజరు కావాలని భారత ప్రధాని నరేంద్రమోదీకి పాక్ ప్రభుత్వం ఆహ్వానించింది. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ పంపిన ఆహ్వాన ప్రతిని సర్తాజ్ అజీజ్ సుష్మా స్వరాజ్‌కు అందచేశారు. అలాగే ఈ నెల 31న అమెరికాలో ఇరు దేశాల ప్రధానులు భేటీ అయ్యే అవకాశముందని సర్తాజ్ అజీజ్ అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా పఠాన్‌కోట్ ఉగ్రదాడిపై దర్యాప్తు సహా ద్వైపాక్షిక అంశాలపై సుష్మాస్వరాజ్ సర్తాజ్ అజీజ్ చర్చలు జరిపారు. ముఖ్యంగా పఠాన్‌కోట్ ఉగ్రదాడిపై దర్యాప్తును వేగవంతం చేయాలని భారత్ గట్టిగా సూచించినట్లు సమాచారం. ఇదిలా ఉంటే పఠాన్‌కోట్ ఉగ్రదాడిపై దర్యాప్తు జరిపేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంయుక్త విచారణ బృందం ఈ నెల 27న భారత్ రానుంది. 28 ఉదయం పఠాన్ కోట్కు వెళ్లి వివరాలు సేకరించనుంది. ఈ ఏడాది జనవరి 2న పంజాబ్ లోని పఠాన్ కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రదాడి జరిగి ఏడుగురు భారత భద్రతాసిబ్బంది మరణించిన విషయం తెలిసిందే. అనంతరం పాకిస్తాన్, భారత దేశాల నాయకుల మధ్య జరిగిన మొదటి అధికారిక సమావేశం ఇది. గతేడాది డిసెంబర్ తర్వాత ఇస్లామాబాద్, న్యూ ఢిల్లీ మధ్య సమగ్ర ద్వైపాక్షిక సంబంధాలపై జనవరిలో జరగాల్సిన విదేశాంగ కార్యదర్శి స్థాయి చర్చలు పఠాన్ కోట్ దాడుల కారణంగా వాయిదా పడ్డాయి. -
లక్షలమందిని ఆకట్టుకుంటున్న కవలలు!
కవల పిల్లలు పుట్టడమే ఓ వింతగా కనిపిస్తుంది. నవజాత శిశువుల్ని చూసేందుకు కూడ అందరూ ఎంతో ఇష్టపడతారు. అటువంటిది ఆ పిల్లలు ఒకరికొకరు చేతులు పట్టుకొని మరీ పుట్టారంటే నిజంగా అది వింతే కదా! అందుకేనేమో ఇప్పుడు ఆ పసివాళ్ళ వీడియో ఫేస్ బుక్ యూజర్లను కట్టి పడేస్తోంది. ఆంథియా జాక్సన్, రూస్ ఫోర్డ్ ల కు పుట్టిన నవజాత శిశువులు క్రిస్టినా, క్రిస్టియన్ లు. ఒకరి చేతులు ఒకరు పట్టుకొని పుట్టిన ఆ పిల్లలు తల్లిదండ్రులకే ఎంతో ఆశ్చర్యం కలిగించారు. అందుకేనేమో ఆ పిల్లల మురిపాన్ని అందరితో పంచుకోవాలనుకున్న తల్లిదండ్రులు వారిద్దరినీ వీడియో తీసి ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. ఇప్పుడా వీడియోను కోటీ డెభ్భై లక్షలమంది చూశారు. అంతే కాదు లక్షా అరవై వేల మంది షేర్ కూడ చేశారు. అసలు తల్లి గర్భంలో ఉండాల్సిన కన్నా 11 వారాల ముందే... అంటే 28 వారాలకే పుట్టిన ఆ నవజాత శిశువులు ఒక్కొక్కరూ ఓ కేజీ మాత్రమే బరువున్నారు. అయితేనేం చేయీ చేయీ పట్టుకొని ముందుకు నడుద్దాం అన్నట్లుగా ఎంతో ఉత్సాహంగా కనిపించడం ఇప్పుడు అందర్నీఅకట్టుకుంటోంది. వీడియోను అనేకమంది ఇష్టంగా చూస్తుండటంతో తల్లి ఆంథియా.. ఆ కవల పిల్లల మరిన్ని ఫోటోలను ఎప్పటికప్పుడు అప్ డేట్స్ తో పోస్ట్ చేసింది. అయితే దానికి వెనుక ఆతల్లి మనసు ఆరాటం ఉంది. తన పిల్లలు ప్రీమెట్యూర్డ్ గా పుట్టడంతో వారి శ్రేయస్సును కాంక్షిస్తూ ఇతర తల్లిదండ్రులు ఇచ్చే సలహాలను ఆమె ఆశిస్తోంది. అటువంటి పిల్లల పెంపకంపై అనుభవజ్ఞులైనవారి నుంచి సలహాలను కూడ ఆ తల్లి కోరుకుంటోంది. '' ప్రిమెట్యూర్ కవలలు పుట్టడంతో నేను చాలా ఖంగారు పడ్డాను. అయితే వారు కాస్త స్థిరపడటంతో ఊపిరి పీల్చుకున్నాను. నేను వీడియోలు, ఫొటోలు పోస్ట్ చేయడానికి చిన్న కారణం ఉంది. తల్లిదండ్రులంతా ఇచ్చే కామెంట్లతో నాలో ధైర్యం కలుగుతుందని ఆశించాను.'' అంటూ ఆంథియా ఫేస్ బుక్ లో తన కామెంట్ ను కూడ పోస్ట్ చేసింది. '' మా పిల్లలకు ఇంతటి ఆదరణ దొరకడం నేను ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే నా పిల్లలకు కూడ మంచి జరగాలని కోరుకుంటున్నాను'' అని కూడ తన భావాలను వ్యక్తం చేసింది.