పొఖారా : నేపాల్ లో జరుగుతున్న సార్క్ సమావేశాలకు హాజరైన భారత విదేశ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్ గురువారం పాకిస్తాన్ విదేశ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజీజ్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంలో ఈ ఏడాది నవంబర్‌లో ఇస్లామాబాద్‌లో జరిగే సార్క్ శిఖరాగ్ర సదస్సుకు హాజరు కావాలని భారత ప్రధాని నరేంద్రమోదీకి పాక్ ప్రభుత్వం ఆహ్వానించింది. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ పంపిన ఆహ్వాన ప్రతిని సర్తాజ్ అజీజ్ సుష్మా స్వరాజ్‌కు అందచేశారు. అలాగే ఈ నెల 31న అమెరికాలో ఇరు దేశాల ప్రధానులు భేటీ అయ్యే అవకాశముందని సర్తాజ్ అజీజ్ అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా పఠాన్‌కోట్ ఉగ్రదాడిపై దర్యాప్తు సహా ద్వైపాక్షిక అంశాలపై సుష్మాస్వరాజ్ సర్తాజ్ అజీజ్ చర్చలు జరిపారు. ముఖ్యంగా పఠాన్‌కోట్ ఉగ్రదాడిపై దర్యాప్తును వేగవంతం చేయాలని భారత్ గట్టిగా సూచించినట్లు సమాచారం. ఇదిలా ఉంటే పఠాన్‌కోట్ ఉగ్రదాడిపై దర్యాప్తు జరిపేందుకు పాకిస్థాన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంయుక్త విచారణ బృందం ఈ నెల 27న భారత్ రానుంది. 28 ఉదయం పఠాన్ కోట్‌కు వెళ్లి వివరాలు సేకరించనుంది.
ఈ ఏడాది జనవరి 2న పంజాబ్ లోని పఠాన్ కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రదాడి జరిగి ఏడుగురు భారత భద్రతాసిబ్బంది మరణించిన విషయం తెలిసిందే. అనంతరం పాకిస్తాన్, భారత దేశాల నాయకుల మధ్య జరిగిన మొదటి అధికారిక సమావేశం ఇది. గతేడాది డిసెంబర్ తర్వాత ఇస్లామాబాద్, న్యూ ఢిల్లీ మధ్య సమగ్ర ద్వైపాక్షిక సంబంధాలపై జనవరిలో జరగాల్సిన విదేశాంగ కార్యదర్శి స్థాయి చర్చలు పఠాన్ కోట్ దాడుల కారణంగా వాయిదా పడ్డాయి.