న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ, ట్విట్టర్ మధ్య చెలరేగిన వివాదం ఒక కొలిక్కి వచ్చింది. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, పార్టీ అధికారిక అకౌంట్, ఇతర నేతల ఖాతాలను ట్విట్టర్ ఎట్టకేలకు పునరుద్ధరించింది. ఢిల్లీలో తొమ్మిదేళ్ల దళిత బాలికను అత్యాచారం చేసి హత్య చేశారని ఆరోపణల నేపథ్యంలో ఆ కుటుంబాన్ని పరామర్శించిన ఫొటోలు రాహుల్ తన ఖాతాలో షేర్ చేయడంతో వివాదం మొదలైంది. బాధిత కుటుంబం ఫొటోలు షేర్ చేయడం తమ సంస్థ నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్న ట్విట్టర్ అకౌంట్లను బ్లాక్ చేసింది. అయితే రాహుల్ ఆ ఫొటోలు సామాజిక మాధ్యమంలో పెట్టడానికి ఆ కుటుంబమే అనుమతించిందని, వారు ఇచ్చిన అనుమతి పత్రాన్ని ట్విట్టర్‌కు సమర్పించారు. దీంతో ట్విట్టర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల బ్లాక్ చేసిన ఖాతాలను పునరుద్ధరించింది. దీనిపై కాంగ్రెస్ తన అధికారిక ఖాతాలో సత్యమేవ జయతే అంటూ ట్వీట్ చేసింది.
ఫేస్‌బుక్‌పై బాలల హక్కుల కమిషన్ ఆగ్రహం
దళిత బాలిక కుటుంబీకుల వీడియోను రాహుల్ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టడంపై జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్(ఎన్‌సీపీసీఆర్) ఆగ్రహం వ్యక్తంచేసింది. ఘటనపై వివరణ ఇవ్వాలని కమిషన్ గతంలో ‘ఇన్‌స్టాగ్రామ్’ మాతృసంస్థ అయిన ఫేస్‌బుక్‌కు నోటీసులు పంపింది. నోటీసులపై ఫేస్‌బుక్ స్పందించలేదు. ఆగ్రహించిన ఎన్‌సీపీసీఆర్ ఫేస్‌బుక్‌కు సమన్లు జారీచేసింది. రాహుల్‌పై ఏం చర్యలు తీసుకున్నారనేది ఫేస్‌బుక్ తెలపకపోవడాన్ని కమిషన్ తప్పుబట్టింది. ఆయనపై చర్యలపై నివేదికతో ఫేస్‌బుక్ అధికారులు మంగళవారం సాయంత్రం ఢిల్లీలోని తమ ముందు హాజరుకావాలని ఆదేశించింది.
రాహుల్ ట్విట్టర్ ఖాతా పునరుద్ధరణ
Published Sun, Aug 15 2021 2:38 AM | Last Updated on Sun, Aug 15 2021 6:53 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment