National Childrens Rights Commission
-
రాహుల్ ట్విట్టర్ ఖాతా పునరుద్ధరణ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ, ట్విట్టర్ మధ్య చెలరేగిన వివాదం ఒక కొలిక్కి వచ్చింది. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ, పార్టీ అధికారిక అకౌంట్, ఇతర నేతల ఖాతాలను ట్విట్టర్ ఎట్టకేలకు పునరుద్ధరించింది. ఢిల్లీలో తొమ్మిదేళ్ల దళిత బాలికను అత్యాచారం చేసి హత్య చేశారని ఆరోపణల నేపథ్యంలో ఆ కుటుంబాన్ని పరామర్శించిన ఫొటోలు రాహుల్ తన ఖాతాలో షేర్ చేయడంతో వివాదం మొదలైంది. బాధిత కుటుంబం ఫొటోలు షేర్ చేయడం తమ సంస్థ నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్న ట్విట్టర్ అకౌంట్లను బ్లాక్ చేసింది. అయితే రాహుల్ ఆ ఫొటోలు సామాజిక మాధ్యమంలో పెట్టడానికి ఆ కుటుంబమే అనుమతించిందని, వారు ఇచ్చిన అనుమతి పత్రాన్ని ట్విట్టర్‌కు సమర్పించారు. దీంతో ట్విట్టర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల బ్లాక్ చేసిన ఖాతాలను పునరుద్ధరించింది. దీనిపై కాంగ్రెస్ తన అధికారిక ఖాతాలో సత్యమేవ జయతే అంటూ ట్వీట్ చేసింది. ఫేస్‌బుక్‌పై బాలల హక్కుల కమిషన్ ఆగ్రహం దళిత బాలిక కుటుంబీకుల వీడియోను రాహుల్ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టడంపై జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్(ఎన్సీపీసీఆర్) ఆగ్రహం వ్యక్తంచేసింది. ఘటనపై వివరణ ఇవ్వాలని కమిషన్ గతంలో ‘ఇన్స్టాగ్రామ్’ మాతృసంస్థ అయిన ఫేస్‌బుక్‌కు నోటీసులు పంపింది. నోటీసులపై ఫేస్బుక్ స్పందించలేదు. ఆగ్రహించిన ఎన్సీపీసీఆర్ ఫేస్‌బుక్‌కు సమన్లు జారీచేసింది. రాహుల్‌పై ఏం చర్యలు తీసుకున్నారనేది ఫేస్బుక్ తెలపకపోవడాన్ని కమిషన్ తప్పుబట్టింది. ఆయనపై చర్యలపై నివేదికతో ఫేస్బుక్ అధికారులు మంగళవారం సాయంత్రం ఢిల్లీలోని తమ ముందు హాజరుకావాలని ఆదేశించింది. -
స్కూల్లో చిన్నారులను తాళ్లతో కట్టి చిత్రహింసలు
సాక్షి, అనంతపురం: క్లాస్‌లో అల్లరి చేస్తున్నారనే కారణంతో ముగ్గురు విద్యార్థులను తాళ్లతో బంధించిన ఘటన కదిరి మున్సిపల్ స్కూల్లో గురువారం చోటు చేసుకుంది. ప్రధానోపాధ్యాయురాలు శ్రీదేవి ఆదేశాల మేరకు పిల్లలను గుట్టుచప్పుడు కాకుండా నిర్బంధించి ఉంచారు. అయితే అనూహ్యంగా విద్యార్థుల నిర్బంధానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తీవ్ర కలకలం రేపడంతో.. స్కూల్ హెచ్ఎం శ్రీదేవిపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. పిల్లలను నిర్బంధం గురించి హైదరాబాద్‌కు చెందిన బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు అచ్యుతరావు జాతీయ పిల్లల హక్కుల పరిరక్షణ కమిషన్‌కు(నేషనల్ చైల్డ్ కమిషన్) ఫిర్యాదు చేశారు. -
ఆ కంపెనీ షాంపూ, పౌడర్ వాడకండి
ఢిల్లీ: జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ షాంపూ, పౌడర్ అమ్మకాలను నిలుపుదల చేయాలని అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు జాతీయ బాలల హక్కుల రక్షణ సంఘం(ఎన్సీపీసీఆర్) లేఖలు పంపింది. అలాగే.. ఇప్పటికే దుకాణాల్లోకి వెళ్లిన జాన్సన్ ఉత్పత్తులను వెనక్కి పంపాలని ఆదేశాలు జారీ చేసింది. జాన్సన్ ఉత్పత్తుల శాంపిల్స్‌ను పరీక్షలకు పంపించి నివేదిక పంపాలని ఆదేశించింది. జైపూర్‌లోని డ్రగ్స్ టెస్టింగ్ లేబరేటరీలోని ప్రభుత్వ నిపుణులు ఇచ్చిన నివేదికను జాతీయ బాలల హక్కుల రక్షణ సంఘానికి రాజస్తాన్ ప్రభుత్వం అందజేసింది. జాన్సన్ ఉత్పత్తుల్లో ఫార్మల్ డీహైడ్ ఉండటంతో నాణ్యతా ప్రమాణాలు సరిగా లేవని రాజస్థాన్ ప్రభుత్వం నివేదిక ఇచ్చింది. జాన్సన్ ఉత్పత్తులలో ఆస్బెస్టాస్, కార్సినో జెనిక్ కారకాలు ఉన్నాయని మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా జాతీయ బాలల హక్కుల రక్షణ సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఏపీ, రాజస్తాన్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, అస్సాం రాష్ట్రాలు జాన్సన్ ఉత్పత్తుల నమూనాలు పరిశీలించి నివేదిక పంపాలని ఎస్సీపీసీఆర్ కోరింది. ఈ విషయంపై జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ ప్రతినిధులు స్పందిస్తూ జాతీయ బాల హక్కుల రక్షణ సంఘం ఆదేశాలు తమ దృష్టికి రాలేదని పేర్కొంది. సెంట్రల్ డ్రగ్స్ లాబరేటరీలో వచ్చిన ఫలితాల ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ తెలిపింది. -
నగ్న చిత్రాలతో టీడీపీ ఎంపీ అనుచరుల బెదిరింపులు
♦ జాతీయ బాలల హక్కుల కమిషన్‌ను ఆశ్రయించిన బాలికల తండ్రి ♦ ఎంపీ తోట సహా మరో ఆరుగురి అరెస్ట్‌కు ఆదేశాలు హైదరాబాద్ / కాకినాడ లీగల్: స్థల వివాదంలో ఓ కుటుంబాన్ని భయాందోళనలకు గురిచేసేందుకు టీడీపీ ఎంపీ తోట నర్సింహం అనుచరులు నీచానికి ఒడిగట్టారు. ఆ స్థల యజమాని మైనర్ కుమార్తెల నగ్న చిత్రాలను చూపి బెదిరింపులకు పాల్పడ్డారు. బాధితుడి ఫిర్యాదుతో జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ తీవ్రంగా స్పందించింది. 24 గంటల్లో నిందితులపై ‘ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్స్’ కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలంటూ కమిషన్ ఆదేశించిందని ఉమ్మడి రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ సంఘం సభ్యుడు అచ్యుతరావు, బాధితుడు రవికుమార్ వెల్లడించారు. హైదరాబాద్‌లో అచ్చుతరావు, కాకినాడలో బాధితుడు రవికుమార్ మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా మాధవపట్నానికి చెందిన నాయ్యవాది సూరవరపు వెంకట రవికుమార్‌కు కాకినాడ టౌన్, రూరల్ ప్రాంతాల్లో రూ.కోట్లు విలువైన భూమి ఉందన్నారు. దీన్ని తక్కువ మొత్తం ఇచ్చి కాజేయాలని ఎంపీ తోట భావించారని, అనుచరులను పంపి పలుమార్లు ఒత్తిడి చేసినా రవికుమార్ స్పందించలేదన్నారు. ఎంపీ అండదండలతో అతని బంధువులైన కోన విశ్వేశ్వరయ్య అలియాస్ శ్రీరామయ్య, బొండా సూర్యరావు, చక్కపల్లి సత్యనారాయణ, చక్కపల్లి గణేష్, చక్కపల్లి రమణ బెదిరించి వేధింపులకు గురిచేస్తున్నారన్నారు. ఈ నేపధ్యంలో రవికుమార్ పెద్దకుమార్తె ఆరోగ్యం బాగుండక పోవడంతో కాకినాడలోని మమత స్కానింగ్‌సెంటర్‌కు తీసుకువెళ్ళగా ఎక్స్‌రే తీస్తానని, బట్టలు మార్చుకోమని చెప్పి అప్పట్లో నగ్న దృశ్యాలు తీశారన్నారు. అలాగే ఆక్స్ఫర్డ్ స్కూల్లో చదువుతున్న చిన్నకుమార్తెను అబద్ధం చెప్పి సెలవు రోజు స్కూల్‌కు రప్పించిన టీచర్ తోట సత్యానందం మేడపైకి తీసుకువెళ్ళి నగ్నంగా ఫొటోలు తీశారన్నారు. వాటిని వాట్సాప్‌లో ఎంపీ అనుచరుల గ్రూపుల్లో పెట్టి ఆస్తులు అమ్మకపోతే ఈ దృశ్యాలను ఫేస్బుక్లో, యూట్యూబ్‌లో పెడతామని బెదిరించారన్నారు. ఈ విషయమై కాకినాడ ఎస్పీ, డీఎస్పీ, సిఐలకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో సీఐడీ అడిషనల్ డెరైక్టర్ జనరల్‌కు ఫిర్యాదు చేశామన్నారు. అయినా ఫలితం లేక జనవరి 24న జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. కమిషన్ సభ్యులు సుమారు నాలుగు నెలలపాటు ప్రాథమిక విచారణ చేపట్టి సోమవారం సమయంలో స్పీడ్ పోస్టు ద్వారా సీఎం చంద్రబాబుకు, తమకు నోట్‌ను పంపారన్నారు. ఈ నోట్ ఆధారంగా 24 గంటల్లో నిందితులపై ‘ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్స్’ కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలంటూ ఆదేశించిందన్నారు. ఈ ఘట నపై హోం ముఖ్య కార్యదర్శి, డీజీపీ రాముడులను బాధ్యులను చేస్తూ కమిషన్ నోటీసులు పంపిందని అచ్యుతరావు తెలిపారు. తూర్పుగోదావరి ఎస్పీ రవిప్రకాష్‌కు ఫోన్ ద్వారా విషయాన్ని వివరించి కమిషన్ ఆదేశాలు అమలు చేయాలని కోరినట్లు చెప్పారు. మానసిక స్ధితి సరిగాలేదు రవికుమార్ మానసికస్ధితి సరిగాలేదని కాకినాడ డీఎస్పీ ఎస్.వెంకటేశ్వరరావు మంగళవారం చెప్పారు. గతంలో రవికుమార్ ఇచ్చిన ఫిర్యాదుకు సంబంధించి ఎటువంటి ఆధారాలు ఇవ్వలేదు. అతను చేస్తున్న ఆరోపణల్లో నిజంలేదన్నారు. మానవ హక్కుల సంఘానికి సంతకం లేకుండా ఫిర్యాదు చేయగా ఆ ఫిర్యాదును తిరస్కరించారని తెలిపారు. ఎంపీ తోట నర్సింహంపై చేసిన ఆరోపణలు అవాస్తవమని, ఊహాజనితంగా మాట్లాడుతున్నాడని డీఎస్పీ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు.