ఢిల్లీ: వివాదాస్పద ట్రెయినీ ఐఏఎస్ పూజా ఖేద్కర్‌కు భారీ షాక్ తగిలింది. అధికార దుర్వినియోగం, తప్పుడు ధృవీకరణ పత్రాల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పూజాపై చర్యలు తీసుకున్నారు. మహారాష్ట్రలో ఆమె ట్రైనింగ్‌ను హోల్డ్‌లో పెట్టారు. ఈ మేరకు ముస్సోరిలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ ఆడ్మినిస్ట్రేషన్ రీకాల్ ఉత్తర్వులు జారీ చేసింది.
సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఎంపిక అయ్యేందుకు వైకల్యం,ఓబీసీ సర్టిఫికేట్‌లను తారుమారు చేశారనే ఆరోపణల నేపథ్యంలో.. పూజా ఖేద్కర్ శిక్షణను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు పేర్కొంది. అవసరమైన తదుపరి చర్యల నిమిత్తం ఆమెను జూలై 23లోగా అకాడమీకి రావాల్సిందిగా తెలిపింది.
ఐఏఎస్ ఉద్యోగంలో చేరేందుకు పూజా ఖేద్కర్ తప్పుడు ధ్రువపత్రాలు సమర్పించినట్లు ఆరోపణలు వెల్లువెత్తున్న విషయం తెలిసిందే. 2018, 2021లో అహ్మద్‌నగర్ జిల్లా సివిల్ హాస్పిటల్ అందించిన రెండు సర్టిఫికేట్‌లను బెంచ్‌మార్క్ డిజేబిలిటీస్ (PwBD) కేటగిరీ కింద యూపీఎస్సీకి సమర్పించారు. అయితే వైద్య పరీక్షల కోసం ఆమెను ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్‌కు యూపీఎస్సీ సిఫార్సు చేసింది. కానీ ఆమె 2022 ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు ఆరుసార్లు మెడికల్ టెస్టులకు డుమ్మా కొట్టింది.
మరోవైపు పూజా ఖేద్కర్ తనకు కంటి సమస్యలు ఉన్నట్లు ఆగష్టు 2022లో పూణేలోని ఔంధ్ ప్రభుత్వ ఆసుపత్రి నుండి వైకల్య ధృవీకరణ పత్రం కోసం పూజా దరఖాస్తు చేసుకోగా.. వైద్య పరీక్షల తర్వాత ఆమె దరఖాస్తు తిరస్కరణకు గురైంది. అయినప్పటికీ ఆమె సివిల్ సర్వీసెస్ అపాయింట్‌మెంట్ ఏదో ఒక రకంగా పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఐఏఎస్‌గా పూజా ఖేద్కర్ ఎంపికను.. కమిషన్ ట్రిబ్యూనల్‌లో సవాలు చేయగా.. 2023 ఫిబ్రవరిలో ఆమెకు వ్యతిరేకంగా తీర్పు కూడా వచ్చింది. అయినా.. పూజా ఖేద్కర్ మాత్రం ఐఏఎస్‌గా ట్రైనింగ్ పొందడం గమనార్హం. ఈమె వివాదంపై దర్యాప్తునకు కేం ద్రం నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment