ఓ మహిళ ట్రైనీ ఐఏఎస్ అధికారిపై మహారాష్ట్ర ప్రభుత్వం వేటు వేసింది.ప్రొబేషనరీ సమయంలోనే సదరు మహిళా అధికారి అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు ఫిర్యాదులు అందడంతో ఆమెను మరో చోటుకు బదిలీ చేసింది.
ఆమెనె.. 2023 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి డాక్టర్ పూజా ఖేద్కర్. పుణె నుంచి వాషిమ్‌కు బదిలీ అయ్యారు. ఇక మిగిలిన శిక్షణ పదవీకాలాన్ని అక్కడే పూర్తి చేయనున్నారు. జూలై 30, 2025 వరకు అక్కడ "సూపర్‌న్యూమరీ అసిస్టెంట్ కలెక్టర్"గా పనిచేస్తుందని ప్రభుత్వం తమ ఉత్వర్వుల్లో పేర్కొంది. కాగా పుణె కలెక్టర్ డాక్టర్ సుహాస్ దివాసే సీఎస్‌కు లేఖ రాసిన నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నారు.
అసలు ఆమె ఏం చేసిందంటే
ట్రైనీ అధికారి అయిన ఖేద్కర్.. పుణె కలెక్టరేట్ కార్యాలయంలో పనిచేస్తున్న సమయంలో అనేక అనుచిత ప్రవర్తనలు పాల్పడినట్లు తేలింది. ఆమె తన ప్రైవేట్ వాహనాన్ని ఉపయోగిస్తూ దానిపై వీఐపీ నంబర్ ప్లేట్‌ను పెట్టుకుంది. జిల్లా అదనపు కలెక్టర్ అజయ్ మోరే అందుబాటులో లేకపోవడంతో ఆయన కార్యాలయాన్ని కూడా ఆమె ఆక్రమించుకున్నట్లు సమాచారం. ఆయన లేని సమయంలో తన ఛాంబర్ డోర్ మీద పేరుతో బోర్డు ఉంచి ఆ స్థలాన్ని తన స్వంత కార్యాలయ గదిగా మార్చుకుంది
ఖేద్కర్ అధికారులపై అనేక డిమాండ్లను పెట్టినట్లు తెలుస్తోంది. వీఐపీ నంబర్ ప్లేట్ కలిగిన అధికారిక కారు, వసతి, తగినంత సిబ్బందితో అధికారిక ఛాంబర్, ఓ కానిస్టేబుల్ కావాలని కోరినట్లు సమాచారం. అయితే నిబంధనల ప్రకారం ట్రైనీకి పైన పేర్కొన్న సౌకర్యాలేవి ఉండవు.
అయినా ఖేద్కర్ ఇంతటితో ఆగలేదు. అదనపు కలెక్టర్ ముందస్తు అనుమతి లేకుండా కుర్చీలు, సోఫాలు, టేబుల్‌లతో సహా అన్ని మెటీరియల్‌లను కార్యాలయం నుంచి తొలగించారు. అనంతరం ఆమె పేరు మీద లెటర్ హెడ్, విజిటింగ్ కార్డ్, పేపర్ వెయిట్, నేమ్‌ప్లేట్, రాజముద్ర, ఇంటర్‌కామ్ అందించాలని రెవెన్యూ అసిస్టెంట్‌ను ఆదేశించారు.
ఇదిలా ఉండగా యూపీఎస్సీ పరీక్షలో 841 ఆల్ ఇండియా ర్యాంక్) సాధించిన ఖేద్కర,.. రిటైర్డ్ అడ్మినిస్ట్రేటివ్ అధికారి కూతురు. తండ్రి కూడా మాజీ ఐఏఎస్ కావడంతో తన కూతురు డిమాండ్‌లను నెరవేర్చాలని జిల్లా కలెక్టర్ కార్యాలయంపై ఆయన ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. కూతురికి ఏదైనా లోటు చేస్తే వారిపై చర్యలు తీసుకుంటామని అధికారులను హెచ్చరించినట్లు సమాచారం
Comments
Please login to add a commentAdd a comment