న్యూఢిల్లీ: వ్యాపార దిగ్గజం వేదాంత లిమిటెడ్ వచ్చే ఎనిమిదేళ్లలో 100 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 8 లక్షల కోట్లు) కంపెనీగా ఎదగాలని నిర్దేశించుకుంది. ప్రస్తుతం ఇది 18 బిలియన్ డాలర్ల (రూ. 1.3 లక్షల కోట్లు) సంస్థగా ఉంది. వృద్ధి ప్రణాళికలను దూకుడుగా అమలు చేయడంపైనా, వివిధ వ్యాపార విభాగాల్లో సామర్థ్యాలను పెంచుకోవడంపైనా మరింతగా దృష్టి పెట్టనున్నట్లు బుధవారం వేదాంత వార్షిక సర్వసభ్య సమావేశంలో సంస్థ చైర్మన్ అనిల్ అగర్వాల్ వెల్లడించారు.
సెమీకండక్టర్లు, డిస్‌ప్లే ఫ్యాబ్రికేషన్ విభాగాల్లోకి వ్యూహాత్మకంగా ప్రవేశిస్తున్నట్లు ఆయన తెలిపారు. ‘అంతర్జాతీయంగా సెమీకండక్టర్ల కొరత నెలకొంది. భారత్ 100 శాతం దిగుమతులపైనే ఆధారపడాల్సి ఉంటున్నందున ఇది సమస్యగా మారింది. దేశీయంగా సెమీకండక్టర్ల వినియోగం 2026 నాటికి 80 బిలియన్ డాలర్లకు, ఆ తర్వాత 2030 నాటికి 110 బిలియన్ డాలర్లకు చేరుతుందన్న అంచనాలు ఉన్నాయి‘ అని అగర్వాల్ వివరించారు. దేశీయంగా సమగ్ర సెమీకండక్టర్ తయారీ ప్లాంటు ఏర్పాటు చేసేందుకు వేదాంత ఇప్పటికే దిగ్గజ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ ఫాక్స్‌కాన్‌తో చేతులు కలిపింది.
దేశ వృద్ధిలో సహజ వనరుల కీలక పాత్ర..
భారతదేశ ఆర్థిక వృద్ధిలో సహజ వనరుల రంగం కీలక పాత్ర పోషిస్తోందని అనిల్ అగర్వాల్ అన్నారు. ఒక చిన్న విధానపరమైన మార్పు ఈ రంగం ‘నిజమైన సామర్థ్యాన్ని వెలికితీస్తుంది‘ అని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘భారత్ స్వావలంబన దిశలో వేగంగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో దేశ వృద్ధి, ఉపాధి కల్పనలో సహజ వనరుల రంగం కీలక పాత్ర పోషిస్తోంది. చిన్న విధాన సంస్కరణలు కూడా సహజ వనరుల విభాగ నిజమైన సామర్థ్యాన్ని వెలికితీస్తాయి’’ అని చెప్పారు. ఇంకా ఆయన ఏమన్నారంటే...
► మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితుల మధ్య ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులకు గమ్యస్థానంగా చైనాను మాత్రమే కాకుండా భారత్‌ను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు.
► ‘చైనాతోపాటు మరొక దేశం వ్యూహాన్ని’ అవలంబిస్తున్న అంతర్జాతీయ పెట్టుబడిదారులకు ‘భారత్ ఖచ్చితంగా ఒక ఆకర్షణీయమైన ప్రదేశంగా కనబడుతుంది. తమ పెట్టుబడులకు కేవలం చైనానే కాకుండా, ప్రత్యామ్నాయంగా మిగిలిన దేశాలవైపూ చూడటం ఈ వ్యూహం ప్రధాన ఉద్దేశం.
► మహమ్మారి కోవిడ్–19, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. అయితే ఈ సమయంలో భారత ఆర్థిక వ్యవస్థ చాలా దేశాల కంటే మెరుగ్గా పనిచేస్తోంది.
► భారత్ దాదాపు ఏడు శాతం వృద్ధి రేటుతో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ఉంది. అమెరికా, బ్రిటన్‌లు దాదాపు రెండంకెల స్థాయిల్లో ద్రవ్యోల్బణం సవాలును ఎదుర్కొంటుండగా, ఆయా దేశాలతో పోల్చితే భారత్‌లో ఒక మోస్తరు ద్రవ్యోల్బణమే కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment