న్యూఢిల్లీ: దేశీయంగా ఎల్రక్టానిక్ చిప్ తయారీ తొలి ప్లాంటు ఏడాదిలోగా ఏర్పాటయ్యే వీలున్నట్లు కేంద్ర టెలికం, ఐటీ శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. దేశంలో వేఫర్ ఫ్యాబ్రికేషన్ ప్లాంటుసహా.. సెమీకండక్టర్ తయారీ ఎకోసిస్టమ్(వ్యవస్థ)ను నెలకొల్పే బాటలో తొలిగా ప్రభుత్వం 10 బిలియన్ డాలర్ల ప్రోత్సాహకాలకు తెరతీసినట్లు తెలియజేశారు. అన్ని రకాల హైటెక్ ఎల్రక్టానిక్ ప్రొడక్టులలో వినియోగించే ఫిజికల్ చిప్స్ తయారీకి వేఫర్ ఫ్యాబ్రికేషన్ ప్లాంట్లను తొలి దశ బ్లాకులుగా వ్యవహరిస్తారు.
అంతర్జాతీయంగా నాయకత్వ స్థాయిలో ఎదిగేందుకు కొన్ని ప్రత్యేక విభాగాలపై దృష్టి పెట్టినట్లు అశ్వినీ వెల్లడించారు. ప్రధానంగా సెమీకండక్టర్లకు టెలికం, ఎలక్ట్రిక్ వాహనాలు(ఈవీ) అతిపెద్ద విభాగాలుగా ఆవిర్భవించినట్లు వివరించారు. వెరసి ఈ విభాగాలలో వినియోగించే చిప్స్ అభివృద్ధి, తయారీలపై దృష్టి పెట్టడం ద్వారా టెలికం, ఈవీలకు గ్లోబల్ లీడర్లుగా ఎదిగే వీలున్నట్లు తెలియజేశారు. ఈ రెండు విభాగాలపై ప్రత్యేక దృష్టితో పనులు జరుగుతున్నట్లు వెల్లడించారు. రానున్న కొన్ని నెలల్లో చెప్పుకోదగ్గ విజయాలను అందుకోనున్నట్లు అంచనా వేశారు.
వేఫర్ ఫ్యాబ్రికేషన్, డిజైన్, తయారీ ద్వారా పూర్తి వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేశారు. దేశీయంగా చిప్ తయారీ యూఎస్ దిగ్గజం మైక్రాన్ పెట్టుబడుల విజయంతో ప్రపంచమంతటా దేశీ సామర్థ్యాలపై విశ్వాసం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. మైక్రాన్ గత నెలలో గుజరాత్‌లోని సణంద్‌లో సెమీకండక్టర్ అసెంబ్లీ ప్లాంటు నిర్మాణాన్ని ప్రారంభించింది. ఈ ప్లాంటుతోపాటు టెస్టింగ్ యూనిట్ ఏర్పాటుకు జూన్‌లో మొత్తం 2.75 బిలియన్ డాలర్ల(రూ. 22,540 కోట్లు) పెట్టుబడి ప్రణాళికలు ప్రకటించింది. వీటిలో మైక్రాన్ 82.5 కోట్లు ఇన్వెస్ట్ చేయనుండగా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మిగిలిన పెట్టుబడులను సమకూర్చనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment