
న్యూఢిల్లీ: జపనీస్ ఇన్వెస్ట్‌మెంట్ దిగ్గజం సాఫ్ట్‌బ్యాంక్ సప్లై చైన్ కంపెనీ డెల్హివరీలో 3.8 శాతం వాటాను విక్రయించింది. బీఎస్‌ఈ బ్లాక్‌డీల్ సమాచారం ప్రకారం అనుబంధ సంస్థ ఎస్‌వీఎఫ్ డోర్‌బెల్(కేమన్) ద్వారా 2.8 కోట్ల షేర్లను అమ్మివేసింది. ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా షేరుకి రూ. 340.8 సగటు ధరలో విక్రయించిన వీటి విలువ రూ. 954 కోట్లకుపైనే. షేర్లను కొనుగోలు చేసిన సంస్థల జాబితాలో సౌదీ అరేబియన్ మానిటరీ అథారిటీ, సిటీ ఆఫ్ న్యూయార్క్ గ్రూప్ ట్రస్ట్, సొసైటీ జనరాలి, బీఎన్‌పీ పరిబాస్ ఆర్బిట్రేజ్ తదితరాలున్నాయి. కాగా.. తాజా లావాదేవీ తదుపరి డెల్హివరీలో ఎస్‌వీఎఫ్ డోర్‌బెల్ వాటా 18.42 శాతం నుంచి 14.58 శాతానికి తగ్గింది.
బ్లాక్‌డీల్ వార్తల నేపథ్యంలో డెల్హివరీ షేరు బీఎస్‌ఈలో 2.2 శాతం క్షీణించి రూ. 341 వద్ద స్థిరపడింది.