
ముంబై: లాజిస్టిక్స్ సర్వీసు ప్రొవైడర్ డెల్హివరీ వ్యాపార విస్తరణ ప్రణాళికల్లో భాగంగా ఈకామ్ ఎక్స్‌ప్రెస్ లిమిటెడ్‌ను సొంతం చేసుకోనుంది. ఇందుకు సుమారు రూ.1400 కోట్లు వెచ్చించనుంది. పూర్తి నగదు రూపంలోనే చెల్లింపు చేసేలా ఒప్పందం ఖరారు చేసుకుంది. ‘‘ఈకామ్ ఎక్స్‌ప్రెస్‌లో మెజారిటీ వాటా కొనుగోలుకు వ్యూహాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాము. 99.4 శాతం వాటాను రూ.1407 కోట్లకు కొనుగోలు చేసేందుకు కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది’’ అని డెల్హివరీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.
గురుగ్రామ్‌కు చెందిన ఈకామర్స్ ఎక్స్‌ప్రైస్ 2012 ఆగస్టులో ప్రారంభమైంది. అప్పటి నుంచి 200 కోట్ల షిప్‌మెంట్లు డెలివరీ చేసింది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో రూ.2,607.3 కోట్ల టర్నోవర్ నమోదు చేసింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో టర్నోవర్ రూ.2,548.1 కోట్లుగా ఉంది. విలీన ప్రక్రియకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలపాల్సి ఉంది.
ఈ డీల్ ఆరు నెలల్లో పూర్తయ్యే అవకాశం ఉందని డెల్హివరీ అంచనా వేస్తోంది. ఈ విలీనంతో కస్టమర్లకు మరింత మెరుగ్గా సేవలందించే అవకాశం లభిస్తుందని కంపెనీ ఎండీ, సీఈఓ సాహిల్ బారువా తెలిపారు. డెల్హివరీతో భాగస్వామ్యం వల్ల మరింత వృద్ధి చెందేందుకు అవకాశం లభిస్తుందని ఈకామ్ ఎక్స్‌ప్రెస్ వ్యవస్థాపకులు కే సత్యనారాయణ పేర్కొన్నారు.