ముంబై : దేశీ మీడియా దిగ్గజం సుభాష్ చంద్రకు చెందిన జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రెజెస్‌ను చేజిక్కించుకునేందుకు సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్, అంతర్జాతీయ మీడియా దిగ్గజం ముర్ధోక్‌ల మధ్య పోరు నెలకొంది. జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ను కైవసం చేసుకునేందుకు ఫేస్‌బుక్ సంకేతాలు పంపగా ముర్ధోక్, ఆయన కుటుంబ సభ్యులతో పాటు బ్లాక్‌స్టోన్‌లతో కలిసి అమెరికా కేబుల్ దిగ్గజం కామ్‌కాస్ట్ కన్సార్షియంగా ఏర్పడి జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ని కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
జీ ఎంటర్‌టైన్‌మెంట్ విలువను మదించే ప్రక్రియనూ కామ్‌కాస్ట్ కన్సార్షియం చేపట్టిందన్న ప్రచారం సాగుతోంది. సీఎన్‌బీసీ, యూనివర్సల్ పిక్చర్స్ వంటి గ్లోబల్ మీడియా బ్రాండ్లను కలిగిఉన్న కామ్‌కాస్ట్ కన్సార్షియం భారత మీడియాలో మెరుగైన మార్కెట్ వాటా కోసం జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ను కైవసం చేసుకునే ప్రయత్నాలను ముమ్మరం చేసినట్టు సమాచారం. మరోవైపు జీ ప్రమోటర్లు వ్యాపార నిర్వహణలో తాము చురుకైన పాత్రను కొనసాగించేందుకు మొగ్గుచూపుతుండగా కొనుగోలుదారులు మాత్రం కంపెనీపై పూర్తి నియంత్రణ కోసం పట్టుబడుతున్నారు.
జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ ప్రస్తుత ధర ప్రకారం ప్రమోటర్ల వాటాలో సగం విలువ రూ 6,603 కోట్లుగా అంచనా వేస్తుండగా మదింపు విలువను మరింత పెంచాలని జీ ప్రమోటర్లు పట్టుబడుతున్నట్టు తెలిసింది. జీ ఎంటర్‌టైన్‌మెంట్ విక్రయ ఒప్పందం ఓ కొలిక్కివస్తే రుణభారంతో సతమతమవుతున్న ప్రమోటింగ్ కంపెనీ ఎస్సెల్ గ్రూప్‌కు ఊరట కలుగుతుందని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment