
స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ నుంచి ప్రైవేట్ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ మాడిసన్ ఇండియా క్యాపిటల్ నిష్క్రమించింది. కంపెనీలో తనకున్న మొత్తం 1.15 శాతం వాటాను ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా సుమారు రూ. 299 కోట్లకు విక్రయించింది. ఎన్‌ఎస్‌ఈ బల్క్ డీల్ డేటా ప్రకారం అనుబంధ సంస్థ ఎంఐవో స్టార్ ద్వారా మాడిసన్ ఇండియా 67.72 లక్షల షేర్లను సగటున రూ.441.01 రేటుకు విక్రయించింది.
ప్రేమ్‌జీ ఇన్వెస్ట్‌లో భాగమైన పీఐ ఆపర్చూనిటీస్ ఏఐఎఫ్ 45.35 లక్షల షేర్లను (0.77 శాతం వాటా) రూ. 200 కోట్లకు కొనుగోలు చేసింది. 2024 మే నెలలో మాడిసన్ ఇండియా క్యాపిటల్ సహా మూడు సంస్థలు స్టార్ హెల్త్‌లో సుమారు 7.06 శాతం వాటాను రూ. 2,210 కోట్లకు విక్రయించాయి.
కాగా నగదు రహిత చికిత్సలు నిలిపివేస్తామంటూ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్‌కు అసోసియేషన్ ఆఫ్ హెల్త్‌కేర్ ప్రొవైడర్స్ ఇండియా (ఏహెచ్‌పీఐ) ఇటీవల హెచ్చరిక జారీ చేసింది. స్టార్ హెల్త్ నుంచి ఆస్పత్రులు ఎదుర్కొంటున్న పలు ఇబ్బందులను ప్రస్తావించింది. ఏహెచ్‌పీఐలో 1,500 ప్రైవేటు ఆస్పత్రులు సభ్యులుగా ఉన్నాయి.