దేశవ్యాప్తంగా ఆన్‌లైన్ కిరాణా వ్యాపారాన్ని మరింత వేగవంతం చేసేందుకుగాను ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన రిటైల్ చైన్ సంస్థ రిలయన్స్ రిటైల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్ డెలివరీ ప్లాట్‌ఫాం డంజోతో కలిసే పనిచేసేందుకు రిలయన్స్ రిటైల్ సిద్దమైంది.
వాటాల కొనుగోలు....!
ఆన్‌లైన్ కిరాణా డెలివరీ వ్యాపారంలో రిలయన్స్ రిటైల్ ఉనికిని విస్తరించేందుకుగాను ప్రముఖ ఆన్‌లైన్ డెలివరీ ప్లాట్‌ఫాం డంజోలో 25.8 శాతం వాటాలను రిలయన్స్ కొనుగోలుచేసినట్లు తెలుస్తోంది. ఈ డీల్ విలువ సుమారు రూ. 1,488 కోట్లు. తాజాగా రిలయన్స్ రిటైల్ నేతృత్వంలోని ఫండింగ్ రౌండ్‌లో డంజో సుమారు 240 మిలియన్ల డాలర్లను సేకరించింది. ఈ ఫండింగ్ రౌండ్‌లో ఇప్పటికే ఈ సంస్థకు ఇన్వెస్టర్లుగా ఉన్న లైట్‌బాక్స్, లైట్‌త్రాక్, 3ఎల్ క్యాపిటల్ , ఆల్టెరియా క్యాపిటల్ కూడా ఫండింగ్ రౌండ్‌లో పాల్గొన్నాయి.
మరింత వేగవంతం..!
డంజో భాగస్వామ్యంతో జియో మార్ట్, రిలయన్స్ రిటైల్ సేవలను మరింత వేగవంతంగా అందిస్తామని రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ డైరెక్టర్ ఇషా అంబానీ తెలిపారు. ఈ భాగస్వామ్యంతో డంజో తన సేవలను విస్తరించేందుకు ఎంతగానో ఉపయోగపడుతోందని కంపెనీ సహా వ్యవస్థాపకుడు కబీర్ బిశ్వాస్ అన్నారు. డంజో ఇప్పటివరకు భారత్‌లో 7 మెట్రో నగరాల్లో వేగవంతమైన డెలివరీ సేవలను అందిస్తోంది. కొద్ది రోజుల క్రితం డంజో డైలీ పేరుతో మరింత వేగవంతమైన డెలివరీ సేవలను ప్రారంభించింది.
చదవండి: యూజర్ల ప్రైవసీతో చెలగాటం..! గూగుల్, మెటా సంస్థలకు దిమ్మతిరిగే షాక్..!
Comments
Please login to add a commentAdd a comment