హైదరాబాద్, సాక్షి: హైదరాబాద్‌కు చెందిన స్పెషాలిటీ జనరిక్స్ ఫార్మా కంపెనీ సెలన్ ల్యాబ్స్‌లో జెడ్‌ఎన్‌జెడ్ ఫార్మా2 మెజారిటీ వాటాను కొనుగోలు చేసింది. యూకే బయోఫార్మా కంపెనీ జెడ్‌ఎన్‌జెడ్ ఫార్మా ఇందుకు రూ. 364 కోట్లను వెచ్చిస్తోంది. తద్వారా సెలన్ ల్యాబ్స్‌లో 74 శాతం వాటాను సొంతం చేసుకుంది. జెడ్‌ఎన్‌జెడ్ ఫార్మా2లో సీడీసీ గ్రూప్, డెవలప్‌మెంట్ పార్టనర్స్ ఇంటర్నేషనల్, పునర్‌నిర్మాణ, అభివృద్ధి యూరోపియన్ బ్యాంక్ ప్రధాన వాటాలు కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. కాగా.. ఇటీవల మూడు ఇన్వెస్ట్‌మెంట్ సంస్థల ద్వారా జెడ్‌ఎన్‌జెడ్ ఫార్మా 25 కోట్ల డాలర్లను(రూ. 1,850 కోట్లు) సమీకరించింది. ఈ నిధులలో రూ. 200 కోట్లను సెలన్ ల్యాబ్స్ విస్తరణకు వినియోగించనున్నట్లు తెలుస్తోంది.
26 శాతం వాటా
క్రిటికల్ కేర్, అంకాలజీ విభాగాలలో ఓరల్, ఇంజక్టబుల్స్ ఔషధాల తయారీకి వీలుగా హైదరాబాద్‌లో కొత్త ప్లాంటును ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు సెలన్ ల్యాబ్స్ ఎండీ మిద్దే నగేష్ కుమార్ తెలియజేశారు. గత ఆర్థిక సంవత్సరం(2019-20)లో సెలన్ ల్యాబ్స్ రూ. 200 కోట్ల ఆదాయం సాధించింది. ఈ ఆర్థిక సంవత్సరం(2020-21)లో రూ. 250 కోట్ల అమ్మకాలు నమోదుకాగలవని అంచనా వేస్తున్నట్లు నగేష్ పేర్కొన్నారు. సెలన్ విక్రయం నేపథ్యంలో కంపెనీ ప్రమోటర్లు విమల్ కుమార్ కావూరు, విజయ్ కుమార్ వాసిరెడ్డి తమ ఫార్మసీ బిజినెస్‌పై దృష్టి సారించనున్నట్లు చెప్పారు. సెలన్‌లో 26 శాతం వాటాతో ప్రమోటర్లు కొనసాగనున్నట్లు నగేష్ తెలియజేశారు. జెడ్‌ఎన్‌జెడ్ ఫార్మా అజమాయిషీలో కంపెనీని ప్రొఫెషనల్స్ నిర్వహించనున్నట్లు చెప్పారు.
ఫార్మా సిటీలో
సెలన్ ల్యాబ్స్ కొత్తగా ఏర్పాటు చేయతలపెట్టిన ప్లాంటును హైదరాబాద్‌లోని షామీర్‌పేట లేదా త్వరలో ప్రారంభంకానున్న ఫార్మా సిటీ వద్ద ఏర్పాటు చేసే అవకాశమున్నట్లు నగేష్ కుమార్ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్త రెగ్యులేటెడ్ మార్కెట్లపై దృష్టితో ఈ ప్లాంటును ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు. ప్రస్తుతం కంపెనీ ఆసియా పసిఫిక్, లాటిన్ అమెరికా, సీఐఎస్ తదితర 45 దేశాలకు ప్రొడక్టులను విస్తరించినట్లు తెలియజేశారు. అయితే కొత్త ప్లాంటు ద్వారా రెగ్యులేటెడ్ మార్కెట్లకు సైతం విస్తరించే యోచనలో ఉన్నట్లు వివరించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని పారిశ్రామికవాడలోగల రెండు యూనిట్ల ద్వారా కంపెనీ అంకాలజీ, క్రిటికల్ కేర్ విభాగాలలో ప్రొడక్టులను రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment