న్యూఢిల్లీ: స్వచ్ఛందంగా దివాలా ప్రకటించిన విమానయాన సంస్థ గో ఫస్ట్‌ను విక్రయించే అవకాశాలపై కసరత్తు జరుగుతోంది. ఇందుకు సంబంధించి ఆసక్తి వ్యక్తీకరణ పత్రాలను (ఈవోఐ) ఆహ్వానిస్తూ రిజల్యూషన్ ప్రొఫెషనల్ (ఆర్‌పీ) శైలేంద్ర అజ్మీరా ప్రకటన జారీ చేశారు. ఈవోఐల దాఖలుకు ఆగస్టు 9 ఆఖరు తేది.
అర్హత కలిగిన సంస్థల పేర్లను ఆగస్టు 19న ప్రకటిస్తారు. ప్రొవిజనల్ లిస్టుపై అభ్యంతరాలను తెలియజేసేందుకు ఆగస్టు 24 ఆఖరు తేది. ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్ల సరఫరా సమస్య కారణంగా భారీగా ఆదాయ నష్టం వాటిల్లుతోందంటూ గో ఫస్ట్ సంస్థ మే 3 నుంచి ఫ్లయట్ సర్వీసులు నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఆర్థిక సంస్థలకు, ఇతరత్రా రుణదాతలకు కంపెనీ రూ. 11,463 కోట్లు చెల్లించాల్సి ఉంది.
నోటీసు ప్రకారం 2022 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో సంస్థ ఆదాయం రూ. 4,183 కోట్లుగా నమోదు కాగా, 4,200 మంది ఉద్యోగులు ఉన్నారు. రుణదాతల కమిటీ ఆమోదించిన పునరుద్ధరణ ప్రణాళికను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)కు గో ఫస్ట్ గత నెలలో సమర్పించింది. డీజీసీఏ జూలై 4–6 మధ్య ప్రత్యేక సేఫ్టీ ఆడిట్ నిర్వహించింది. ఈ వారంలో నివేదిక ఇచ్చే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment