సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ)ని ఉద్యోగ సంఘాలు నిరసనకు దిగనున్నాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ 2020 ప్రసంగంలో ఎల్‌ఐసీ ఐపీవో నిర్ణయాన్ని ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసనలకు సిద్ధపడుతున్నాయి. సుదీర్ఘ కాలంగా తాము వ్యతిరేకిస్తున్నప్పటికీ పబ్లిక్ ఇష్యూ, ప్రత్యక్ష పెట్టుబడులు అంశాలపై ఉద్యోగులు ఆందో ళన చేపట్టనున్నారు. ఎల్ఐసి మూడు ప్రధాన కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా ఆందోళనలోపాల్గొననున్నాయి.ఎల్‌ఐసీ బ్రాంచ్ కార్యాలయాల వద్ద సోమవారం భోజన విరామ సమయంలో ప్లకార్డ్సు, నినాదాలతో నిరసన తెలపనున్నారు. అలాగే మంగళవారం ఒక గంట నిరసన సమ్మె (వాక్-అవుట్) ను చేపట్టనున్నారు. దీంతోపాటు (ఫిబ్రవరి 3,4 తేదీల్లో నిరసనల అనంతరం) ఉమ్మడి ఫోరం ఆధ్వర్యంలో ఒకరోజు సమ్మెను కూడా చేపట్టాలని యోచిస్తున్నారు.
ఎల్‌ఐసీ ఐపీవోకు (ఐపిఓ ద్వారా ప్రభుత్వం ఈక్విటీ షేర్లను విక్రయించే ఆఫర్) తాము పూర్తిగా వ్యతిరేకమనీ, మంచి లాభాలతో ఉన్న సంస్థలో వాటాలను ఎందుకు విక్రయిస్తోందని సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేసారు. గత ఏడాది రూ. 2,600 కోట్ల డివిడెండ్ ఎల్‌ఐసీ అందజేసిందని ఫెడరేషన్ ఆఫ్ ఎల్ఐసి క్లాస్ -1 ఆఫీసర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఎస్ రాజ్‌కుమార్ చెప్పారు. ప్రభుత్వం నిధులను కోరినప్పుడల్లా, మౌలిక సదుపాయాల అభివృద్ధి, సామాజిక రంగం, గృహనిర్మాణానికి నిధులు అందిస్తూనే ఉన్నామని పేర్కొన్నారు. లాభదాయకమైన ఎల్‌ఐసీ సంస్థను లిస్టింగ్ చేయడమంటే.. బంగారు బాతును చంపేయడమేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఎల్‌ఐసీ మూడుప్రధాన కార్మిక సంఘాల ఉమ్మడి ఫోరం- ఎల్‌ఐసి క్లాస్ -1 ఆఫీసర్స్ అసోసియేషన్ల సమాఖ్య, నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఫీల్డ్ వర్కర్స్ ఆఫ్ ఇండియా, ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సంస్థ మొత్తం శ్రామిక శక్తిలో 90 శాతానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. 2019 మార్చి చివరి నాటికి ఎల్‌ఐసిలో 2.85 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. మరోవైపు ఐడీబీఐ బ్యాంక్‌లోని తన వాటాను ప్రభుత్వం ప్రైవేటు పెట్టుబడిదారులకు విక్రయిస్తామని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్-2020 ప్రసంగంలో వెల్లడించారు. ఐడీబీఐ బ్యాంకులో వాటాను పూర్తిగా విక్రయించడం ద్వారా మొత్తం రూ. 90,000 కోట్లు సమకూరుతాయని కేంద్రం ఆశిస్తోంది. ఈ ఏడాది మొత్తంగా రూ. 2.10 లక్షల కోట్లను డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా సేకరించాలని.. కేంద్రం లక్ష్యంగా నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఎల్ఐసీలో కేంద్రానికి 100 శాతం వాటా ఉండగా.. ఐడీబీఐలో 46.5 శాతం వాటా కేంద్రం వద్దే ఉంది.
చదవండి : ఐడీబీఐ, ఎల్‌ఐసీలో వాటా అమ్మకం
Comments
Please login to add a commentAdd a comment