న్యూఢిల్లీ: ఓమ్ని చానల్ రెస్టారెంట్ల నిర్వాహక కంపెనీ సఫైర్ ఫుడ్స్ ఇండియా లిమిటెడ్‌లో రెండు ప్రమోటర్ సంస్థలు తాజాగా 5.9 శాతం వాటాను విక్రయించాయి. ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా సమర క్యాపిటల్ పార్ట్‌నర్స్ ఫండ్–2.. 4,49,999 షేర్లు(0.71 శాతం వాటా), సఫైర్ ఫుడ్స్ మారిషస్ 33,37,423 షేర్లు(5.24 శాతం) అమ్మివేశాయి. బీఎస్‌ఈ బల్క్ డీల్ గణాంకాల ప్రకారం ఒక్కో షేరుకి రూ. 1,400 సగటు ధరలో విక్రయించిన వాటా విలువ రూ. 530 కోట్లు. కేఎఫ్‌సీ, పిజ్జా హట్, టాకో బెల్ తదితర యమ్ బ్రాండ్ల అతిపెద్ద ఫ్రాంచైజీగా సఫెర్ ఫుడ్స్ వ్యవహరిస్తోంది.
తాజా లావాదేవీల తదుపరి కంపెనీలో మారిషస్ ప్రమోటర్ వాటా 29.28 శాతం నుంచి 24.04 శాతానికి తగ్గింది. ఇక సమర క్యాపిటల్ పార్ట్‌నర్స్ ఫండ్–2.. కంపెనీ నుంచి పూర్తిగా వైదొలగినట్లయ్యింది. సింగపూర్ ప్రభుత్వం 10.05 లక్షల షేర్లు, హెచ్‌డీఎఫ్‌సీ ఎంఎఫ్ 22 లక్షల షేర్లు కొనుగోలు చేశాయి. కాగా.. ఈ నెల మొదట్లో మరో ప్రమోటర్ సంస్థ అరింజయ మారిషస్.. రూ. 378 కోట్లకు సఫైర్ ఫుడ్స్‌లో 4.2 శాతం వాటాను విక్రయించిన విషయం విదితమే. వాటా విక్రయం నేపథ్యంలో సఫైర్ ఫుడ్స్ షేరు బీఎస్‌ఈలో 0.26 శాతం నీరసించి రూ. 1,403 వద్ద ముగిసింది.
ఆర్కియన్ కెమ్‌లో వాటా అమ్మకం
స్పెషాలిటీ కెమికల్స్ తయారీ కంపెనీ ఆర్కియన్ కెమికల్ ఇండస్ట్రీస్‌లో ఇండియా రిసర్జెన్స్ ఫండ్ స్కీ మ్–1, స్కీమ్–2, పిరమల్ నేచురల్ రిసోర్సెస్ ఉమ్మడిగా 3.4% వాటాకు సమానమైన 42 లక్షల షేర్లను విక్రయించాయి. ఎన్‌ఎస్‌ఈ గణాంకాల ప్రకారం ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా షేరుకి రూ. 600–601 సగటు ధరలో విక్రయించిన వాటా విలువ రూ. 252 కోట్లు. టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ 14.06 లక్షల షేర్లు, డీఎస్‌పీ ఎంఎఫ్ 10 లక్షల షేర్లు, గోల్డ్‌మన్ శాక్స్ 6.23 లక్షల షేర్లు చొప్పున సొంతం చేసుకున్నాయి. వాటా విక్రయం నేపథ్యంలో ఆర్కియన్ కెమికల్స్ షేరు ఎన్‌ఎస్‌ఈలో 3.3% పతనమై రూ. 610 దిగువన ముగిసింది.
ప్రైకోల్‌లో వాటా విక్రయం
ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా ఆటో విడిభాగాల కంపెనీ ప్రైకోల్‌లో పీహెచ్‌ఐ క్యాపిటల్ సొల్యూషన్స్ 14,40,922 షేర్లను విక్రయించింది. ఎన్‌ఎస్‌ఈ గణాంకాల ప్రకారం 1.2 శాతం వాటాకు సమానమైన వీటిని షేరుకి రూ. 347 సగటు ధరలో అమ్మివేసింది. డీల్ విలువ రూ. 50 కోట్లుకాగా.. ఫ్రాంక్లిన్ టెంపుల్‌టన్ ఎంఎఫ్ వీటిని కొనుగోలు చేసింది. తాజా లావాదేవీల తదుపరి కంపెనీలో పీహెచ్‌ఐ క్యాపిటల్ వాటా 5.73 శాతం నుంచి 4.55 శాతానికి తగ్గింది. వాటా విక్రయం నేపథ్యంలో ప్రైకోల్ షేరు ఎన్‌ఎస్‌ఈలో 1 శాతం నష్టంతో రూ. 344 దిగువన ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment