
న్యూఢిల్లీ : అప్పుల్లో కూరుకుపోయిన ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాను కొనేవారే కరువయ్యారు. ఈ సంస్థను కొనుగోలు చేసేందుకు గతంలో ఆసక్తి చూపించిన కంపెనీలు కూడా ఒక్కొక్కటిగా పక్కకి తప్పుకున్నాయి. టాటా గ్రూప్ సైతం దీన్ని కొనేందుకు విముఖత వ్యక్తం చేసింది. ఒక్క బిడ్డర్ కూడా రావడం లేదు. దీంతో ఎన్నికలకు ముందు ఎయిరిండియా అమ్మకానికి వెళ్లకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. సంస్థ నిర్వహణ కోసం నిధులను సమకూర్చాలని నిర్ణయించినట్టు ప్రభుత్వ సీనియర్ అధికారి చెప్పారు. ఎయిరిండియాలో 76 శాతం వాటా విక్రయించడంలో ప్రభుత్వం విఫలం చెందిన కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది. సంస్థ రోజువారీ నిర్వహణ కార్యకలాపాలను కొనసాగించడానికి ప్రభుత్వం త్వరలోనే నిధులను సమకూర్చబోతుందని ప్రభుత్వ అధికారులు తెలిపారు. ఈ నిర్ణయాన్ని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ఆధ్వర్యంలో జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో తీసుకున్నారు.
ఈ సమావేశానికి పీయూష్ గోయల్, సురేష్ ప్రభు, నితిన్ గడ్కారీ, ఆర్థిక, ఏవియేషన్ శాఖలకు చెందిన పలువురు సీనియర్ అధికారులు కూడా హాజరయ్యారు. ఈ ఎయిర్‌లైన్ లాభాలను పోస్ట్ చేస్తుందని, ఏ విమానం కూడా ఖాళీగా లేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఎయిరిండియా నిర్వహణ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తామన్నారు. ప్రస్తుతం ఎయిరిండియా డిజ్‌ఇన్వెస్ట్‌మెంట్ ప్రక్రియ చేయడానికి ఎలాంటి తొందరలేదని పేర్కొన్నాయి. అయితే త్వరలోనే ఎయిరిండియా మార్కెట్‌లో లిస్టింగ్‌కు రావాలని చూస్తోంది. ఈ లిస్టింగ్‌కు వచ్చే ముందే కంపెనీ లాబాలను ఆర్జించాల్సి ఉంది. ఏదైనా కంపెనీ స్టాక్ ఎక్స్చేంజ్‌లో లిస్ట్ కావాలంటే, దాని కంటే ముందు మూడు ఆర్థిక సంవత్సరాలు లాభాలను పోస్టు చేయాల్సి ఉన్న క్రమంలో ఎన్నికలకు ముందు డిజ్‌ఇన్వెస్ట్‌మెంట్‌కు వెళ్లకుండా.. ప్రభుత్వం నుంచే నిధులు సమకూర్చాలని చూస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment