వాళ్లు కనీసం గవర్నర్ వద్దకూ వెళ్లలేదు: జైట్లీ
గోవా అసెంబ్లీలో తమకు 17 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, అతి పెద్ద పార్టీ తమదే అయినా.. బీజేపీ మాత్రం తమ నుంచి అవకాశాన్ని దొంగిలించిందని కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలను కేంద్ర ఆర్థిక, రక్షణ శాఖల మంత్రి అరుణ్ జైట్లీ ఖండించారు. ఈ విషయమై ఆయన స్పందించారు. గోవా ప్రజలు విభిన్నమైన తీర్పును ఇచ్చారని.. దాంతో అక్కడ హంగ్ అసెంబ్లీ ఏర్పడిందని అన్నారు. అందుకే అక్కడ ఎన్నికల తర్వాత పొత్తులు పెట్టుకోవాల్సి వచ్చిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అనవసరంగా లేనిపోని అభాండాలు వేస్తోందని.. సుప్రీంకోర్టులో వాళ్లు దాఖలు చేసిన పిటిషన్ కూడా ఏమాత్రం వాళ్లకు పనికిరాకుండా పోయిందని చెప్పారు.
గోవా గవర్నర్ మృదులా సిన్హా వద్దకు మనోహర్ పరీకర్ నేతృత్వంలోని 21 మంది ఎమ్మెల్యేల ప్రతిపాదన మాత్రమే వెళ్లిందని.. తమ వద్ద 17 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెబుతున్న కాంగ్రెస్ పార్టీ కనీసం ప్రభుత్వం ఏర్పాటుచేస్తామని గవర్నర్ వద్దకు కూడా వెళ్లలేని ఆయన విమర్శించారు. మనోహర్ పరీకర్ నేతృత్వంలోని బీజేపీ మరో రెండు చిన్న పార్టీలు, స్వతంత్రుల మద్దతుతో గోవాలో ప్రభుత్వం ఏర్పాటుచేస్తున్న విషయం తెలిసిందే.