goa government
-
చిక్కుల్లో క్రికెటర్ యువరాజ్ సింగ్..
టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ చిక్కుల్లో పడ్డాడు. గోవా ప్రభుత్వం యువరాజ్‌కు నోటీసులు జారీ చేసింది. విషయంలోకి వెళితే.. గోవాలోని మోర్జిమ్ ప్రాంతంలో యువీకి 'కాసా సింగ్' పేరిట ఒక విల్లా ఉంది. గత సెప్టెంబర్‌లో ఈ విల్లాను అద్దెకు ఇస్తానంటూ యువీ తన ట్విటర్ వేదికగా ప్రకటన చేశాడు. గోవా రూల్స ప్రకారం ఇది ఒక విధంగా పేయింగ్ గెస్ట్ విధానం కిందకు వస్తుంది. దీనికి గోవా రాష్ట్ర పర్యాటక శాఖ అధికారులు అభ్యంతరం తెలిపారు. పేయింగ్ గెస్ట్ విధానం కింద విల్లాను అద్దెకు ఇవ్వాలంటే గోవా రిజిస్ట్రేషన్ ఆఫ్ టూరిస్ట్ ట్రేడ్ యాక్ట్ 1982 ప్రకారం గోవా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ యూవీ ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకుండానే అద్దె ఇవ్వడం అతనికి చిక్కులు తెచ్చిపెట్టింది. దీనిని గోవా అధికారులు తప్పుబడుతూ రూ.లక్ష జరిమానా విధించారు. అంతేకాదు డిసెంబర్ 8న తమ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీచేశారు. పర్యాటక శాఖ చట్టాన్ని ఉల్లంఘించిన క్రమంలో ఎందుకు రూ. లక్ష జరిమానా విధించకూడదో చెప్పాలని నోటీసుల్లో ప్రశ్నించారు. ఎవరైనా సరే గోవాలో హోటల్/గెస్ట్ హౌస్ కార్యకలాపాలు నిర్వహించాలంటే కచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందేనని ఆ రాష్ట్ర టూరిజం శాఖ ఇదివరకే స్పష్టం చేసింది. I’ll be hosting an exclusive stay at my Goa home for a group of 6, only on @Airbnb. This is where I spend time with my loved ones & the home is filled with memories from my years on the pitch. Bookings open Sep 28, 1pm IST at https://t.co/5Zqi9eoMhc 🏖️#AirbnbPartner @Airbnb_in pic.twitter.com/C7Qo32ifuE — Yuvraj Singh (@YUVSTRONG12) September 21, 2022 చదవండి: 'నెంబర్ వన్ స్థానం నావల్లే.. వాడుకొని వదిలేశారు' బంధం ముగిసింది.. రొనాల్డోతో మాంచెస్టర్ యునైటెడ్ తెగదెంపులు -
New Rules In Goa: గోవాలో ఈ పనులు చేస్తే భారీగా జరిమానా
పనాజీ: గోవా వెళ్లి స్నేహితులతో పార్టీ చేసుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే, ఈ కొత్త నిబంధనలను తప్పనిసరిగా తెలుసుకోవాలి. లేదంటే భారీగా జరిమానా పడే అవకాశం ఉంది. గోవాలో పర్యటకాన్ని మరింత బలోపేతం చేసే దిశగా, టూరిస్టు ప్రాంతాలు పరిశుభ్రంగా, సురక్షితంగా ఉండేందుకు అక్కడి ప్రభుత్వం కఠిన నిబంధనలను తీసుకొచ్చింది. ఆయా నిబంధనలను అతిక్రమిస్తే భారీగా జరిమానాలు విధిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు అక్టోబర్ 31వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. ‘ఓ వ్యక్తి, కంపెనీ, సంఘం, సంస్థ ఏదైనా నిబంధనలు ఉల్లఘిస్తే రూ.5000 జరిమానా విధిస్తాం. ఆ ఫైన్ రూ.50,000 వరకు సైతం ఉండవచ్చు. ఐపీసీలోని సెక్షన్ 188 ప్రకారం చర్యలు ఉంటాయి.’ అని గవర్నమెంట్ ఆర్డర్లో పేర్కొంది. కొత్త నిబంధనల ప్రకారం బీచ్‌లోని బహిరంగ ప్రదేశాల్లో వంట చేయటం, డ్రైవింగ్ వంటివి నిషేదం. బీచ్‌లో చెత్త పారవేయటం, మద్యం బాటిళ్లను పగలగొడితే చట్టపరంగా చర్యలు తీసుకుంటారు. కొద్ద నిబంధనలు ఇలా.. ► ఇకపై బీచ్‌లో డ్రైవింగ్ చేయకూడదు. బహిరంగ ప్రదేశంలో వంట వండటం నిషేదం. ► బీచ్‌లో చెత్త వేయటం, తాగి పడేసే బాటిళ్లను పగలగొట్టటం నేరం. ► టూరిస్టులతో పాటు వారికి సేవలందిస్తున్న వివిధ సంస్థలు, వ్యాపారస్తులకు సైతం కొత్త నిబంధనలు వర్తిస్తాయి. ► వాటర్ స్పోర్ట్స్ కేవలం గుర్తింపు పొందిన ప్రాంతాల్లోనే నిర్వహించాలి. ► టికెట్ల జారీ గుర్తింపు పొందిన కౌంటర్ల వద్దే నిర్వహించాలి. బహిరంగంగా టికెట్లు జారీ చేయకూడదు. ► తోపుడి బండిపై వ్యాపారం చేసే వారు పర్యటకులకు అడ్డుపడితే జరిమానా పడుతుంది. ► ఎవరైనా టూరిస్టులను డబ్బులు అడగడం, అల్లర్లు సృష్టించటం చేస్తే చర్యలు తప్పవు. ► నిబంధనలను అతిక్రమించిన వారికి రూ.5వేల నుంచి రూ.50వేల వరకు జరిమానా విధించనున్నారు. ఇదీ చదవండి: పీఎంగా రిషి సునాక్ తొలిసారి బిగ్ యూ-టర్న్.. ఆ నిర్ణయంలో మార్పు -
ఆత్మపరిశీలన అవసరం ఎవరిది?
మాట పొదుపుగా వాడాలి! చేత అదుపులో ఉండాలి!! అధికారంలో ఉన్నవాళ్ళకు అన్ని రకాలుగా వర్తించే మహావాక్యాలివి. గద్దె మీద ఉన్న పెద్దలు ఏం మాట్లాడుతున్నా, ఏం చేస్తున్నా తప్పనిసరిగా జాగ్రత్తగా ఉండాల్సిందే! లేదంటే తర్వాతి పర్యవసానాలకు వారు తమను తాము తప్ప, వేరెవరినీ నిందించలేరు. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్‌కు ఆ సంగతి ఇప్పుడు తెలిసొచ్చి ఉండాలి. వారం క్రితం జూలై ఆఖరు ఆదివారం రాత్రి గోవాలోని ఓ బీచ్‌లో పోలీసులమంటూ ఇద్దరు మైనర్ బాలికలపై నలుగురు దుండగులు చేసిన సామూహిక అత్యాచారం సంచలనం రేపింది. ఆ సామూహిక అత్యాచార ఘటనపై అనాలోచితంగా చేసిన ‘ఆత్మపరిశీలన’ వ్యాఖ్యలు సీఎంకు తలబొప్పి కట్టించాయి. హోమ్‌శాఖ పగ్గాలు కూడా తన చేతిలోనే ఉన్న ముఖ్య మంత్రి ‘పట్టుమని 14 ఏళ్ళ కన్నకూతుళ్ళు అంత రాత్రివేళ బీచ్‌లో ఎందుకున్నారో వాళ్ళ తల్లి తండ్రులు ఆత్మపరిశీలన చేసుకోవాలి’ అంటూ అసెంబ్లీ సాక్షిగా నోరుజారారు. పనిలో పనిగా, ‘పిల్లలు తమ మాట వినరని, బాధ్యతంతా ప్రభుత్వం మీద, పోలీసుల మీద పెట్టకూడదు’ అని హితవు పలికారు. తీవ్రవిమర్శల పాలయ్యారు. గోవా సీఎం వ్యాఖ్యల దెబ్బతో ఇలాంటి సమయాల్లో పాలకుల బాధ్యత ఏమిటన్నది చర్చనీ యాంశమైంది. ఇది ఓటు రాజకీయాల్లో నష్టం తెస్తుందని గ్రహించగానే, సీఎం సర్దుబాటు మొదలు పెట్టారు. తన మాటల్ని తప్పుగా అర్థం చేసుకున్నారన్నారు. ఆయన నష్టనివారణలో ఉండగానే, సహచర సాంస్కృతిక మంత్రి ‘ప్రతి ఆడపిల్ల వెనుకా భద్రతకు ఓ పోలీసును పెట్టడం ఎంతవరకు సాధ్యం’ అంటూ ప్రజలనే ఎదురు ప్రశ్నించడం విచిత్రం. అలా మరిన్ని విమర్శలకు తావిచ్చారు. తప్పొప్పుల తరాజు ఎలా ఉన్నా, ముందుగా బాధితులకు అండగా నిలవాలి. ఆ పని చేయకుండా బాధితులనే తప్పుబట్టే సామాజిక, రాజకీయ దురలవాటుకు గోవా ఉదంతం మరో ఉదాహరణ. గమనిస్తే, గోవాలో వారం రోజుల వ్యవధిలో మూడు అత్యాచారాల సంఘటనలు జరిగాయి. ఒక ఘటనలో బీచ్‌లో మైనర్ బాలికల రేప్. మరో ఘటనలో ఉద్యోగమిస్తారని ఈశాన్యం నుంచి నమ్మి వచ్చిన పాతికేళ్ళ యువతిని ఇంట్లో బంధించి, రోజుల తరబడి అత్యాచారం. వేరొక ఘట నలో... 19 ఏళ్ళ ఆడపిల్లపై ట్రక్ డ్రైవర్ల అమానుషం. 2019తో పోలిస్తే 2020లో గోవాలో నేరాల రేటు 17 శాతం పెరిగిందనేది నిష్ఠురసత్యం. అలాంటి ఘటనల్ని అరికట్టి, ఆడవాళ్ళకు భద్రత, భరోసా కల్పించాల్సింది పాలకులేగా! కానీ దీన్ని ‘పురుషుల హింస’గా కాక ‘స్త్రీల భద్రత’ అంశంగా చిత్రిస్తూ, గోవా పెద్దలు మొద్దుబారిన మనసుతో వ్యాఖ్యలు చేయడమే విస్మయం కలిగిస్తోంది. పిల్లల పెంపకం, బాగోగుల విషయంలో తల్లితండ్రులదే ప్రథమ బాధ్యత అనేది ఎవరూ కాదనరు. కానీ ఆ వాదనను అడ్డం పెట్టి, ఆడవాళ్ళు ఇంటికే పరిమితం కావాలనీ, చీకటి పడితే బయటకు రాకూడదనీ పాతకాలపు పితృస్వామ్య భావజాలంతో ప్రభుత్వాలు ప్రవర్తిస్తేనే అసలు చిక్కు. శాంతిభద్రతల్ని పరిరక్షించాల్సిన ప్రభుత్వాలు పిల్లల పెంపకం పాఠాలు చెబుతుంటే ఏమనాలి? పౌరుల భద్రతకు బాధ్యత వహించాల్సిన పాలకులే... పొద్దుపోయాక బయటకొస్తే తమ పూచీ లేదన్నట్టు మాట్లాడితే ఇంకెవరికి చెప్పుకోవాలి? పర్యాటకానికి మారుపేరైన గోవా, అక్కడి బీచ్‌లు వివాదాలతో వార్తల్లోకి ఎక్కడం ఆనవా యితీగా మారింది. అంతర్జాతీయ పర్యాటకులు కూడా పెద్దయెత్తున వచ్చే ఆ సముద్రతీరాలలో నిర్ణీత సమయం దాటాక ఎవరినీ అనుమతించకపోవడం ప్రభుత్వాలు తలుచుకుంటే అసాధ్యం కాదు. అలాగే, పెరిగిన సాంకేతికత, ఆధునిక డ్రోన్ టెక్నాలజీతో బీచ్‌ల వెంట గస్తీ కూడా కష్టమేమీ కాదు. డ్రోన్ పరిజ్ఞానంలో ఎంతో పురోగతి సాధించిన ఇజ్రాయెల్, అమెరికా, చైనా లాగా మనమూ శాంతి భద్రతల పరిరక్షణకూ, పోలీసు పహారాకూ డ్రోన్ల వినియోగాన్ని విస్తరించవచ్చు. నేరాలను అరికట్టవచ్చు. ప్రాణాలను కాపాడవచ్చు. ఇలా చేయదగినవి చేతిలో ఎన్నో ఉండగా, ‘లైంగిక హింస అనివార్యం... తప్పు మాది కాదు మీదే’ అన్నట్టు పాలకులు మాట్లాడడమే అసలు తప్పు. గోవా జనాభాలో నూటికి 35 మంది పర్యాటక రంగంపైనే ఆధారపడ్డారు. ఆ రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 16.43 శాతం ఆదాయం (దాదాపు 200 కోట్ల డాలర్లు) పర్యాటకానిదే. కరోనా వల్ల వేల కోట్ల నష్టం, సగం మందికి పైగా ఉపాధి కోల్పోయిన పరిస్థితుల్లో గోవా మళ్ళీ పుంజుకోవాలంటే సర్కారు చేయాల్సింది ఎంతో ఉంది. కానీ, తాజా ఉదంతాలతో ఆ రాష్ట్రం సురక్షితం కాదనే భావన పర్యాటకులకు కలిగితే ఆ తప్పు ఎవరిది? ఆ మాటకొస్తే అత్యాచారాల్లోనే కాదు... ఇంకా అనేక విషయాలలో గోవా సర్కారు అలక్ష్యం, అశ్రద్ధ దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి. రెండున్నర నెలల క్రితం మే 16న విరుచుకుపడ్డ టౌక్టే తుపానులో గుజరాత్, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లతో పాటు గోవా తీవ్రంగా నష్టపోయింది. కానీ, ఇప్పటి వరకు సరైన లెక్కలు చెప్పి, కేంద్ర ఇస్తానన్న సాయం అందుకోవడం కూడా గోవా సర్కారుకు కష్టంగా ఉన్నట్టుంది. సాయం కోరడంపై సర్కారు సరైన దృష్టి పెట్టనే లేదు. పైపెచ్చు, తుపాను నష్టం రూ. 146 కోట్ల దాకా ఉందని సీఎం అంటుంటే, రూ. 9 కోట్లని అదే రాష్ట్ర డిప్యూటీ సీఎం పేర్కొనడం మరీ ఆశ్చర్యకరం. మరి, రాష్ట్రంలో అత్యాచారాల మొదలు ఇలాంటి ఎన్నో అంశాలలో తక్షణం ఆత్మపరిశీలన అవసరమైంది ఎవరికి? అందరికీ అర్థమవుతున్న ఆ జవాబును గోవా సీఎంకు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం ఉందంటారా? -
ఇక షూటింగ్‌కి అనుమతి లేదు
కోవిడ్ కారణంగా ఆయా రాష్ట్రాల్లో చిత్రీకరణలకు వీలు కుదరకపోవడంతో చాలామంది తమ సినిమా షూటింగ్‌ను గోవాకు షిఫ్ట్ చేశారు. అక్కడి లొకేషన్స్‌లో షూటింగ్ ఆరంభించారు. అయితే దర్శక–నిర్మాతలకు అక్కడి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. కోవిడ్ సెకండ్ వేవ్ విపత్కర పరిస్థితుల నేపథ్యంలో ఇకపై గోవాలో సినిమాలు, సీరియల్స్ చిత్రీకరణలకు అనుమతులు ఇచ్చేది లేదని ఈఎస్జీ (ఎంటర్టైన్మెంట్ సొసైటీ ఆఫ్ గోవా) స్పష్టం చేసింది. ‘‘కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్స్‌కి మేం ఇచ్చిన అనుమతులను రద్దు చేస్తున్నాం. ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటున్న సినిమాలు, సీరియల్స్ల చిత్రయూనిట్స్కు వీలైనంత త్వరగా షెడ్యూల్ ప్యాకప్ చెప్పాలని ఆదేశాలు జారీ చేశాం. సాధారణ పరిస్థితులు వచ్చే వరకు షూటింగ్‌లు రద్దు నిర్ణయంలో మార్పు ఉండకపోవచ్చు. కానీ ఎప్పటికప్పుడు కోవిడ్ పరిస్థితులను సమీక్షిస్తూనే ఉంటాం’’ అని ఈఎస్జీ ప్రతినిధులు పేర్కొన్నారు. -
Goa Lockdown: గోవాలో లాక్డౌన్
పణజీ/చండీగఢ్: కరోనా టెస్టు పాజిటివిటీ రేటు 50 శాతాన్ని మించడంతో గోవా ప్రభుత్వం నాలుగు రోజుల లాక్ డౌన్ ప్రకటించింది. ప్రజలెవరూ బయటకు రావద్దని సూచిస్తూ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. 16 లక్షల జనాభా ఉన్న ఈ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య ఇటీవల గణనీయంగా పెరుగుతుండంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గురువారం 5,910 శాంపిళ్లను పరీక్షించగా అందులో ఏకంగా 3,019 శాంపిళ్లకు పాజిటివ్‌గా తేలడంతో లాక్ డౌన్ మార్గాన్ని ఎంచుకుంది. గురువారం రాత్రి 9 గంటల నుంచి సోమవారం ఉదయం 6 గంటల వరకూ లాక్డౌన్ కొనసాగుతుందని ప్రకటించింది. వీక్లీ మార్కెట్లు కూడా అందుబాటులో ఉండబోవని ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ వెల్లడించారు. అత్యవసర విభాగాలన్నీ యథావిధిగా పని చేస్తాయని చెప్పింది. పలు ప్రముఖ బీచ్‌లు లాక్ డౌన్ కారణంగా బోసిపోయి కనిపించాయి. హరియాణాలో వీకెండ్ లాక్ డౌన్ కరోనాను కట్టడి చేసేందుకు హరియాణా ప్రభుత్వం కూడా లాక్ డౌన్ బాటను ఎంచుకుంది. రాష్ట్రంలోని 9 జిల్లాల్లో వీకెండ్ లాక్ డౌన్ విధిస్తున్నట్లు ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. శుక్రవారం రాత్రి 10 గంటల నుంచి లాక్ డౌన్ అమల్లోకి వస్తుందని, సోమవారం ఉదయం 5 గంటల వరకూ అది కొనసాగుతుందని ఆరోగ్య శాఖ మంత్రి అనిల్ విజ్ వెల్లడించారు. కరోనా రెండో సారి పంజా విసురుతున్న నేపథ్యంలో ఈ చర్య తీసుకోవాల్సి వచ్చిందని ప్రభుత్వం తెలిపింది. లాక్ డౌన్ లో ప్రజలంతా ఇంట్లోనే ఉండి ప్రభుత్వానికి సహకరించాలని కోరింది. ఇక్కడ చదవండి: రెండోవేవ్: అక్కడ ఒక్క పాజిటివ్ కేసు కూడా లేదు! ఎన్నికల ఫలితాల తర్వాత పెట్రో సెగ -
గోవా ప్రభుత్వానికి ఐఓఏ హెచ్చరిక
న్యూఢిల్లీ : మూడేళ్లుగా జాతీయ క్రీడల నిర్వహణను వాయిదా వేస్తోన్న గోవా ప్రభుత్వాన్ని భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) కార్యదర్శి రాజీవ్ మెహతా హెచ్చరించారు. ముందే చెప్పినట్లుగా ఈ నవంబర్‌లో క్రీడల్ని నిర్వహించలేకపోతే వాటిని మరో వేదికకు తరలించాల్సి వస్తుందని స్పష్టం చేశారు. ఈ అంశంపై చర్చించేందుకు త్వరలోనే ఐఓఏ ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇప్పటికే క్రీడల నిర్వహణను నాలుగు సార్లు వాయిదా వేసిన గోవా ప్రభుత్వం తాజాగా మరోసారి ఇదే పోకడను అనుసరిస్తూ వచ్చే ఏడాది నిర్వహిస్తామంటూ కొత్త వాదనను వినిపించింది. దీంతో గోవా ప్రభుత్వ తీరుపై రాజీవ్ మెహతా అసహనం వ్యక్తం చేశారు. ‘మా ఓపిక నశించిపోతోంది. గోవా ప్రభుత్వానికి నిబద్దత లేదనే విషయం మాకిప్పుడే అర్థమవుతోంది. ప్రతీసారి క్రీడల్ని వాయిదా వేయలేం. వేరే వేదికకు మార్చడం అనివార్యమనిపిస్తుంది’ అని అన్నారు. చివరిసారిగా 2015లో కేరళ జాతీయ క్రీడలకు ఆతిథ్యమిచ్చింది. -
అనిశ్చితిలో గోవా సర్కార్
పనాజీ : గోవా సీఎం మనోహర్ పారికర్ అస్వస్ధతతో ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న క్రమంలో బీజేపీ సర్కార్‌లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులను చక్కదిద్దేందుకు పార్టీ చీఫ్ అమిత్ షా రంగంలోకి దిగారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ గవర్నర్‌ను కోరడంతో బీజేపీ అప్రమత్తమైంది. సీఎం పారికర్ కోలుకునే వరకూ భాగస్వామ్య పక్షానికి చెందిన మంత్రి సుధీన్ ధవాలికర్‌ను డిప్యూటీ సీఎం పగ్గాలు చేపట్టాలన్న ప్రతిపాదనను మిత్రపక్షాలు తిరస్కరించడంతో అమిత్ షా గోవా ఫార్వార్డ్‌కు చెందిన మంత్రి విజయ్ సర్ధేశాయ్‌తో ఫోన్లో మాట్లాడారు. మరోవైపు బీజేపీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు, గోవా ఫార్వార్డ్ పార్టీ ఎమ్మెల్యేలు ముగ్గురు, ముగ్గురు ఇండిపెండెంట్లు ఫ్రంట్‌గా ఏర్పడటంతో తదుపరి సంకీర్ణ సర్కార్ భవితవ్యాన్ని ఈ ఫ్రంట్ నిర్ధేశిస్తుందని భావిస్తున్నారు. 40 మంది సభ్యులు కలిగిన గోవా అసెంబ్లీలో 16 మంది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీ కాగా, బీజేపీకి 14 మంది ఎమ్మెల్యేలున్నారు. 2017లో జరిగిన గోవా అసెంబ్లీ ఎన్నికల్లో నెంబర్ గేమ్‌లో కాంగ్రెస్‌ను వెనక్కినెట్టి ప్రాంతీయ పార్టీలతో కలిసి బీజేపీ సంకీర్ణ సర్కార్‌ను ఏర్పాటు చేసింది. -
వాళ్లు కనీసం గవర్నర్ వద్దకూ వెళ్లలేదు: జైట్లీ
గోవా అసెంబ్లీలో తమకు 17 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, అతి పెద్ద పార్టీ తమదే అయినా.. బీజేపీ మాత్రం తమ నుంచి అవకాశాన్ని దొంగిలించిందని కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలను కేంద్ర ఆర్థిక, రక్షణ శాఖల మంత్రి అరుణ్ జైట్లీ ఖండించారు. ఈ విషయమై ఆయన స్పందించారు. గోవా ప్రజలు విభిన్నమైన తీర్పును ఇచ్చారని.. దాంతో అక్కడ హంగ్ అసెంబ్లీ ఏర్పడిందని అన్నారు. అందుకే అక్కడ ఎన్నికల తర్వాత పొత్తులు పెట్టుకోవాల్సి వచ్చిందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అనవసరంగా లేనిపోని అభాండాలు వేస్తోందని.. సుప్రీంకోర్టులో వాళ్లు దాఖలు చేసిన పిటిషన్ కూడా ఏమాత్రం వాళ్లకు పనికిరాకుండా పోయిందని చెప్పారు. గోవా గవర్నర్ మృదులా సిన్హా వద్దకు మనోహర్ పరీకర్ నేతృత్వంలోని 21 మంది ఎమ్మెల్యేల ప్రతిపాదన మాత్రమే వెళ్లిందని.. తమ వద్ద 17 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెబుతున్న కాంగ్రెస్ పార్టీ కనీసం ప్రభుత్వం ఏర్పాటుచేస్తామని గవర్నర్ వద్దకు కూడా వెళ్లలేని ఆయన విమర్శించారు. మనోహర్ పరీకర్ నేతృత్వంలోని బీజేపీ మరో రెండు చిన్న పార్టీలు, స్వతంత్రుల మద్దతుతో గోవాలో ప్రభుత్వం ఏర్పాటుచేస్తున్న విషయం తెలిసిందే. -
కొబ్బరి చెట్టు...చెట్టుకాదా?
పణాజి: గోవా అనగానే మనకు గుర్తు వచ్చేది అందమైన బీచ్‌లతోపాటు ఎక్కడికెళ్లినా కనిపించే పచ్చని కొబ్బరి చెట్లు. ఇప్పుడు వాటి మనుగడకే ముప్పు తీసుకొచ్చే నిర్ణయం గోవా కేబినెట్ తీసుకున్నది. గోవాలో ప్రభుత్వ స్థలమే కాకుండా ప్రైవేటు స్థలంలో ఉన్న ఏ చెట్టును కొట్టివేయాలన్ని గోవా, డయ్యూ, డామన్ చెట్ల పరిరక్షణ చట్టం కింద అటవి శాఖా అధికారుల అనుమతి తీసుకోవాలి. అందుకనే రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా చెట్ల జాబితా నుంచే కొబ్బరి చెట్టును తొలగించింది. దీని వల్ల ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా అటవి శాఖా అధికారుల నుంచి ఎలాంటి ముందస్తు అనుమతి తీసుకోకుండానే రాష్ట్రంలోని కొబ్బరి చెట్లను కొట్టివేయవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న ఈ వివాదాస్పద నిర్ణయం పట్ల పర్యావరణ పరిరక్షకులు, నిపుణులు, ఉద్యమకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘కొబ్బరి చెట్టు చెట్టుకాకపోతే, మరి గడ్డియా?’ అని ప్రముఖ పర్యావరణ ఉద్యమకారుడు క్లాడ్ ఆల్వరెస్ ప్రశ్నిస్తున్నారు. కొబ్బరి కాయల వల్ల మానవులకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని, కొబ్బరి నీళ్లు మానవ ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషక విలువలను ఇస్తుండగా, దాని నూనెను రాష్ట్ర వంటకాల్లో ఎక్కువగా వినియోగిస్తున్నారని ఆయన చెప్పారు. అంతేకాకుండా ఫెన్నీ లాంటి మద్యంలో కూడా వినియోగిస్తున్నారని చెప్పారు. అలాగే ఎండిన కొబ్బరి పీచులను వంట చెరకుగాను, పరుపుల్లోను ఉపయోగిస్తున్నారని తెలిపారు. ఇప్పుడు చెట్టు జాబితా నుంచి దాన్ని తొలగించడం వల్ల రానున్న కాలంలో ఈ చెట్లు అంతరించిపోయే ప్రమాదం ఎంతో ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 1984 నాటి చెట్ల పరిరక్షణ చట్టంలో కొబ్బరి చెట్టు లేదని, 2008లో మాత్రమే చట్టంలో ఆ చెట్టును చేర్చారని, చెట్టు అనే నిర్వచనం కిందకు అది రాదుకనుక దాన్ని తొలగించామని రాష్ట్ర ప్రభుత్వం సమర్థించుకుంటోంది. చెట్టంటే దానికి శాఖలు ఉండాలని, నిర్దేశించిన ప్రమాణాల్లో దాని మొదలు ఉండాలని ప్రభుత్వం వాదిస్తోంది. చట్టంలో పేర్కొన్న ప్రమాణాల మేరకు ఓ చెట్టు మొదలు ఐదు సెంటీమీటర్ల వ్యాసంతోపాటు 30 సెంటీ మీటర్ల పొడవుండాలి. ఇప్పుడు కేబినెట్ ఈ నిర్వచనాన్ని కూడా మార్చివేసింది. పది సెంటీమీటర్ల వ్యాసం, ఒక మీటరు పొడవు ఉండాలంటూ కొత్త నిర్వచనాన్ని తీసుకొచ్చింది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నదన్న అనుమానం రావచ్చు. రాష్ట్ర దక్షిణ ప్రాంతంలోని సంగియం తాలూకాలో ఓ డిస్టిలరీని ఏర్పాటు చేసేందుకు ‘వాణి ఆగ్రో’ అనే కంపెనీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆ స్థలంలో దాదాపు 500 కొబ్బరి చెట్లు ఉన్నాయి. వాటిని కొట్టివేసేందుకు చట్టం అడ్డుపడుతోంది. సవరించని పాత చట్టం ప్రకారం ప్రభుత్వ స్థలంలో చెట్లు ఉంటే వాటిని అటవి శాఖ అధికారులు అసలు కొట్టనీయరు. ప్రైవేటు స్థలంలో చెట్లను కొట్టివేయాలంటే యజమాని అవసరం మేరకు అనుమతి ఇస్తారు. కొట్టివేసిన ప్రతి చెట్టుకు యజమాని నుంచి నష్ట పరిహారాన్ని కూడా వసూలు చేస్తారు. -
ఇబోలా రావచ్చు.. కోతులతో ఆడొద్దు!
ఇబోలా వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది కాబట్టి, ఎవరూ కోతులతోను, బబూన్లతోను ఆటలు ఆడొద్దని గోవా ఆరోగ్యశాఖ హెచ్చరించింది. పశ్చిమాఫ్రికాలో మొదలైన అత్యంత ప్రమాదకరమైన ఈ వైరస్‌ను ఎదుర్కోడానికి, దీనికి సంబంధించిన విషయాలను పర్యవేక్షించడానికి ఓ కోర్ కమిటీని కూడా ఏర్పాటు చేసినట్లు గోవా సర్కారు వెల్లడించింది. ఉన్నత స్థాయి ఆరోగ్యశాఖాధికారులు, పోలీసులు, ఇమ్మిగ్రేషన్ అధికారులు ఈ కమిటీలో ఉన్నారు. దీనికి ఆరోగ్యశాఖ కార్యదర్శి అధ్యక్షత వహిస్తారు. ఇబోలా ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు చేతులు శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలని, సరిగా వండిన ఆహారాన్ని మాత్రమే తినాలని ప్రజలకు సూచిస్తున్నారు. గోవాలో ఇప్పటివరకు ఒక్క ఇబోలా కేసు కూడా నమోదు కాకపోయినా.. ముందు జాగ్రత్తగా ఈ హెచ్చరికలు చేశారు.