న్యూఢిల్లీ : మూడేళ్లుగా జాతీయ క్రీడల నిర్వహణను వాయిదా వేస్తోన్న గోవా ప్రభుత్వాన్ని భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) కార్యదర్శి రాజీవ్ మెహతా హెచ్చరించారు. ముందే చెప్పినట్లుగా ఈ నవంబర్‌లో క్రీడల్ని నిర్వహించలేకపోతే వాటిని మరో వేదికకు తరలించాల్సి వస్తుందని స్పష్టం చేశారు. ఈ అంశంపై చర్చించేందుకు త్వరలోనే ఐఓఏ ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇప్పటికే క్రీడల నిర్వహణను నాలుగు సార్లు వాయిదా వేసిన గోవా ప్రభుత్వం తాజాగా మరోసారి ఇదే పోకడను అనుసరిస్తూ వచ్చే ఏడాది నిర్వహిస్తామంటూ కొత్త వాదనను వినిపించింది. దీంతో గోవా ప్రభుత్వ తీరుపై రాజీవ్ మెహతా అసహనం వ్యక్తం చేశారు. ‘మా ఓపిక నశించిపోతోంది. గోవా ప్రభుత్వానికి నిబద్దత లేదనే విషయం మాకిప్పుడే అర్థమవుతోంది. ప్రతీసారి క్రీడల్ని వాయిదా వేయలేం. వేరే వేదికకు మార్చడం అనివార్యమనిపిస్తుంది’ అని అన్నారు. చివరిసారిగా 2015లో కేరళ జాతీయ క్రీడలకు ఆతిథ్యమిచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment