న్యూఢిల్లీ: ఆరుసార్లు ప్రపంచ చాంపియన్, భారత దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ పారిస్ ఒలింపిక్స్‌లో చెఫ్ డి మిషన్‌గా వ్యవహరించలేనని తన బాధ్యతల నుంచి వైదొలగింది. ఈ మేరకు భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షురాలు పీటీ ఉషకు ఆమె లేఖ రాసింది. ‘దేశానికి సేవ చేయడాన్ని నేనెప్పుడు గౌరవంగా భావిస్తాను. మానసికంగానూ సిద్ధంగా ఉంటా.
కానీ... వ్యక్తిగత కారణాల వల్ల ప్రతిష్టాత్మక ఈవెంట్‌లో గురుతర బాధ్యతలు నిర్వర్తించలేకపోతున్నాను. అందుకే ఆ పదవికి రాజీనామా చేస్తున్నా’ అని 41 ఏళ్ల ఈ మణిపూర్ మహిళా బాక్సర్ లేఖలో వివరించింది. దీనిపై స్పందించిన పీటీ ఉష... మేరీకోమ్ పదవి నుంచి తప్పుకోవడం బాధాకరమే అయినా... ఆమె నిర్ణయాన్ని, వ్యక్తిగత గోప్యతను గౌరవిస్తామని తెలిపారు. మేరీ స్థానంలో మరొకరిని నియమిస్తామని ఉష చెప్పారు. పారిస్ ఒలింపిక్స్ ఈ ఏడాది జూలై 26 నుంచి ఆగస్టు 11 వరకు జరుగుతాయి.
Comments
Please login to add a commentAdd a comment