అరుణ్ జైట్లీ
సాక్షి, న్యూఢిల్లీ : మూత్ర పిండాల వ్యాధితో బాధపడుతున్న జైట్లీకి ఎయిమ్స్‌లోని వైద్యులు సోమవారం డయాలసిస్ నిర్వహించారు. త్వరలో ఆయనకు కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స చేయనున్నారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. శుక్రవారం ఆస్పత్రిలో చేరిన జైట్లీకి డయాలసిస్ అనంతరం డాక్టర్లు ఇంటికి పంపించారు. ఇన్ఫెక్షన్ పెరగవచ్చన్న కారణంతో ప్రస్తుతం ఆయన్ను కలిసేందుకు ఎవ్వరినీ అనుమతించడంలేదు. అయితే అనారోగ్యంతో బాధపడుతున్న జైట్లీ తన శాఖకు సంబంధించిన పనులను మాత్రం ఇంటి వద్ద నుంచే నిర్వర్తిస్తున్నారు. అరుణ్ జైట్లీ అటు పార్టీలోనూ, ఇటు ప్రభుత్వంలోనూ కీలకపాత్ర పోషిస్తున్నారు. మోదీకి ఆత్మీయుడిగా కొనసాగుతూ...ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాల్లో ఆయన సలహాలను ఇస్తున్నారు.
ప్రభుత్వంలో కీలక పాత్ర
మోదీ ప్రభుత్వంలో జైట్లీ కీలకపాత్ర పోషిస్తున్నారు. అత్యంత ముఖ్యమైన ఆర్థిక, రక్షణ శాఖలను మొదటగా జైట్లీకి అప్పజెప్పారంటే ఆయనపై మోదీకి ఎంత నమ్మకమో ఊహించుకోవచ్చు.మధ్యలో గోవా ముఖ్యమంత్రి ఉన్న మనోహర్ పారికర్ రక్షణ శాఖలు చేపట్టినా, కొద్దిరోజులకే తిరిగి గోవా ముఖ్యమంత్రిగా వెళ్లారు. దీంతో ఆ శాఖను నిర్మలా సీతారామన్ చేపట్టే వరకు జైట్లీయే ఆ బాధ్యతను నిర్వర్తించారు. ఆర్థికమంత్రిగా ఉంటూ చరిత్రలో నిలిచిపోయే సంస్కరణలు తీసుకొచ్చారు. నోట్ల రద్దు, జీఎస్టీ వంటి కీలక నిర్ణయాల్లో జైట్లీ పాత్ర ఉంది.
ప్రతిపక్ష నాయకుడిగా
జైట్లీ ప్రతిపక్ష నాయకుడిగా అప్పటి యూపీఏ ప్రభుత్వంపై రాజీలేని పోరాటం చేశారు. బీజేపీ తరపున రాజ్యసభలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వాన్ని సమర్ధవంతంగా ఎదుర్కొన్నారు. అప్పటి ఆర్థిక మంత్రి చిదంబరంపై జైట్లీ పలుమార్లు తీవ్ర ఆరోపణలు చేశారు.
మోదీకి ఆత్మీయుడు
జైట్లీ ప్రతిసారి మోదీకి బాసటగా నిలిచారు. ఆయన మొదటిసారి గుజరాత్ ముఖ్యమంత్రి కావడంలో, గుజరాత్ అల్లర్ల సమయంలో జైట్లీ ప్రధానపాత్ర వహించారు. 2013లో మోదీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడంలోనూ కీలకపాత్ర పోషించారు.
గొప్ప ఎన్నికల వ్యూహకర్త
బీజేపీ ఎన్నికల వ్యూహకర్తలో జైట్లీ ముఖ్యుడు. అమిత్ షా బీజేపీ జాతీయ అధ్యక్షుడు కాకముందు జైట్లీయే ఎన్నికల వ్యూహాలను రచించేవారు. బీజేపీ ప్రధాన కార్యదర్శిగా, మంత్రిగా ఉంటూ దాదాపు 12 రాష్ట్రాల్లో పార్టీ విజయం సాధించేలా కృషి చేశారు.
న్యాయవాదిగా
అరుణ్ జైట్లీ న్యాయవాదిగా బీజేపీకి చేసిన కృషి మరువలేనిది. చాలా సందర్భాలలో బీజేపీ నాయకుల తరఫున వివిధ కోర్టుల్లో వాదించారు. గుజరాత్ అల్లర్ల కేసులో మోదీకి బాసటగా నిలుస్తూ కోర్టులో వాదనలు వినిపించారు. అమిత్ షా తరఫున కూడా చాలా కేసుల్లో ఆయన వాదించారు.
Comments
Please login to add a commentAdd a comment